https://oktelugu.com/

దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఘంటికలు

గత ఏడాది ఇదే సమయం.. దేశంలో ఒక్కసారిగా కరోనా తీవ్రతతో ముందూ వెనుకా ఆలోచించకుండా లాక్ డౌన్ పెట్టేశారు. అప్పుడు వలస కార్మికులు రవాణా సౌకర్యాలు లేక పొట్ట చేత పట్టుకొని వేల కిలోమీటర్లు నడిచిన దుస్థితి చూశాం. ఉద్యోగ, ఉపాధి లేక ప్రజలు ఆకలితో అల్లాడడం చూశాం.. అలాంటి పరిస్థితులు దేశంలో మళ్లీ రానున్నాయా? కరోనా కల్లోలానికి దేశం మళ్లీ లాక్ డౌన్ దిశగా నడుస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కరోనా మహమ్మారి దేశంలో […]

Written By: NARESH, Updated On : April 22, 2021 8:41 am
Follow us on

గత ఏడాది ఇదే సమయం.. దేశంలో ఒక్కసారిగా కరోనా తీవ్రతతో ముందూ వెనుకా ఆలోచించకుండా లాక్ డౌన్ పెట్టేశారు. అప్పుడు వలస కార్మికులు రవాణా సౌకర్యాలు లేక పొట్ట చేత పట్టుకొని వేల కిలోమీటర్లు నడిచిన దుస్థితి చూశాం. ఉద్యోగ, ఉపాధి లేక ప్రజలు ఆకలితో అల్లాడడం చూశాం.. అలాంటి పరిస్థితులు దేశంలో మళ్లీ రానున్నాయా? కరోనా కల్లోలానికి దేశం మళ్లీ లాక్ డౌన్ దిశగా నడుస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3 లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటివరకు ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు సెకండ్ వేవ్ లో ఇప్పటిదాకా నమోదు కాలేదు.

దేశంలో మరోసారి లాక్ డౌన్ ఘంటికలు మోగాయి. కరోనా తీవ్రత ఘోరంగా వ్యాపిస్తుండడం.. ఆస్పత్రులన్నీ నిండిపోతున్న వేళ వైద్య ఆరోగ్య రంగం కుదేలవుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ లాక్ డౌన్ తప్పదా? అన్న సూచనలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ను చివరి అస్త్రంగానే వినియోగించాలని ప్రధాని మోడీ కోరినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఢిల్లీ లాక్ డౌన్ బాట పట్టగా.. తాజాగా కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మహారాష్ట్ర సైతం రేపటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.

కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతున్న వేళ లాక్ డౌన్ పై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ ను విధించారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి మహారాష్ట్రలో పూర్తి లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. మే 1 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ పై మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 144 సెక్షన్ ను ప్రభుత్వం విధించింది. అయినా కేసులు, మరణాలు తగ్గడం లేదు. ఆక్సిజన్ కొరతతో.. తప్పిదాలతో నిన్న నాసిక్ లో 24 మంది చనిపోవడం విషాదం నింపింది.

ఈ క్రమంలోనే నేటి నుంచి మే 1 వరకు కర్ఫ్యూ తరహా నిబంధనలు అమలు పరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్ డౌన్ వేళ అత్యవసర సేవలు మినహా అన్ని వర్తక, ఉద్యోగ, వాణిజ్య కార్యకలాపాలు స్తంభింప చేస్తారు.

మహారాష్ట్ర మాత్రమే కాదు.. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా కరోనా తీవ్రతతో అల్లాడుతు్నాయి. ఆ రాష్ట్రాలు కూడా మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ దేశంలో లాక్ డౌన్ తప్పదన్న సూచనలు కనిపిస్తున్నాయి.