
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నేటికి 68 రోజులవుతోంది. మే 31తో ఇది ముగియబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ 5.0కు సంబంధించిన ప్రణాళికల్లో పడింది. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి మాల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరవడానికి , పరిమితులను తగ్గించడానికి వీలుగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ కొనసాగేలా కొత్త నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తోంది.
మే 31న ప్రధాని మోడీ మన్ కీబీత్ కార్యాక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ఈసారి మరికొన్ని సడలింపులు .. కీలక నిర్ణయాల దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
లాక్ డౌన్ 5.0లో ప్రధానంగా దేశంలోని 11 నగరాలపైనే దృష్టి సారించబోతున్నారట.. ఈ 11 నగరాల్లోనే దేశవ్యాప్తంగా 70శాతం కేసులు వెలుగుచూస్తున్న దృష్ట్యా ఇక్కడే లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని మోడీ ప్రణాళిక రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
జూన్ 1 నుంచి మొదలయ్యే లాక్ డౌన్ 5.0లో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్ కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్ చేయనున్నారని తెలిసింది. దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కేసుల్లో కేవలం ముంబై, ఢిల్లీ, ఫుణే, కోల్ కతా, అహ్మదాబాద్ లలోనే 60శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నగరాల్లోనే నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.
దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల్లో 80శాతం నమోదవుతున్న 30 మున్సిపల్ కార్పొరేషన్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని.. ఈసారి అక్కడ గట్టిగా లాక్ డౌన్ విధించి దేశమంతా భారీ సడలింపులు ఇస్తుందని సమాచారం.
ప్రధానంగా ఈ లాక్డౌన్ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చీలు తెరుచుకునేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రార్థనా స్థలాల్లో భారీగా ప్రజలు గుమిగూడడం నిషేధిస్తూ నిబంధనలు పాటించేలా అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రార్థనా స్థలాలకు జూన్ 1 నుంచి అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇక లాక్డౌన్ 5.0లో జిమ్ లకు కూడా అనుమతించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని చోట్ల జిమ్ లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ప్రతీ ఒక్కరు మాస్క్ , భౌతిక దూరంతో ఇవన్నీ నడవనున్నాయి.
ఢిల్లీ ఇతర మెట్రోలను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉంది. మార్కెట్లు తెరవడంతోపాటు మతపరమైన ప్రార్థనాలయాలు కూడా తెరువనున్నట్టు తెలుస్తోంది. విద్యాసంస్థలు కనీసం 10 రోజులు మాత్రమే తెరువాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని సమాచారం. కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం నిబంధనలు కఠినతరం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
జూన్ 1 నుంచి కరోనా ప్రబలే కంటైన్ మెంట్ జోన్ల నిర్ణయాధికారం అక్కడి మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్రం కట్టబెడుతోంది. కొత్త మార్గదర్శకాలు 70శాతం కేసులు దేశంలో నమోదవుతున్న 13 నగరాల్లో మరింత కఠినంగా రూపొందిస్తున్నారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానే, ఫుణే, హైదరాబాద్, కోల్ కతా, మరియు దాని పక్కనే ఉన్న హౌరా, ఇండోర్, జైపూర్ , జోద్ పూర్, చెంగల్పట్టు , తిరువల్లూరు. ఈ నగరాల్లో దేశంలోనే మూడు నగరాలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ నగరాల్లో కేంద్రం కఠినమైన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
-నరేశ్ ఎన్నం