Homeజాతీయ వార్తలుCongress MLA Candidates: కాంగ్రెస్ లో అభ్యర్థుల వడపోత.. ప్రస్తుతానికయితే వీరు ఖరారయినట్టే..

Congress MLA Candidates: కాంగ్రెస్ లో అభ్యర్థుల వడపోత.. ప్రస్తుతానికయితే వీరు ఖరారయినట్టే..

Congress MLA Candidates: రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్‌ ముమ్మరం చేసింది. పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 119 నియోజకవర్గాలకుగాను దాఖలైన 1006 దరఖాస్తుల వడపోత ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశమైంది. నియోజకవర్గాలవారీగా దరఖాస్తులను పరిశీలించిన కమిటీ సభ్యులు.. 30కి పైగా నియోజకవర్గాల్లో ఒకే పేరుపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయానికి వచ్చినవాటిలో సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనాయకుల పేర్లే ఉన్నట్లు సమాచారం. అయితే గత సంప్రదాయానికి భిన్నంగా తమ ప్రాధాన్యాలు, వాటికి కారణాలు, సూచనలను ప్రతి సభ్యుడూ సీల్డ్‌ కవర్లో సమర్పించారు. కమిటీ సమావేశం ప్రారంభం కాగానే.. అందులోని 30 మంది సభ్యులకూ నియోజకవర్గాల వారీగా 1006 మంది ఆశావహులు, పార్టీకి వారు చేసిన సేవలు, వారి రాజకీయ, సామాజిక నేపథ్యం తదితర వివరాలను పంపిణీ చేశారు. ఆ వివరాల ఆధారంగా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి సభ్యుడూ తొలి, మలి, మూడు.. కొన్ని సందర్భాల్లో నాలుగు.. ఐదో ప్రాధాన్యాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా ఆశావహులకు ఆయా ప్రాధాన్యాలు ఎందుకు నిర్ణయించినదీ వివరణా, తగు సూచనలూ పేర్కొన్నారు. 30కి పైగా నియోజకవర్గాలకు సంబంధించి తొలి ప్రాధాన్యం నమోదులో మెజారిటీ సభ్యులు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

స్ర్కీనింగ్‌ కమిటీ సంప్రదింపులు జరిపి..

ఏకాభిప్రాయం వచ్చిన అభ్యర్థులతో ఈ నెల ఒకటి, లేదా రెండో వారంలో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మెజారిటీ సభ్యులు ఏకాభిప్రాయం వెలిబుచ్చిన అభ్యర్థుల్లో సిటింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్యనాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. ఉదాహరణకు.. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి జానారెడ్డి దరఖాస్తు చేసుకోలేదు. అయితే ఆ నియోజకవర్గం నుంచి జానారెడ్డి అభ్యర్థి అయితేనే బాగుంటుందంటూ మెజారిటీ సభ్యులు అభిప్రాయాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ వడపోతలోనే నియోజకవర్గానికి ఒకటి నుంచి నాలుగు వరకు పేర్లు రేసులో మిగలనున్నాయి.
మరళీధరన్‌ చైర్మన్‌గా, జిగ్నేష్‌ మేవానీ, సిద్దిఖీ సభ్యులుగా ఏర్పాటైన స్ర్కీనింగ్‌ కమిటీ.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సభ్యులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. సీల్డ్‌ కవర్‌లో ఆయా సభ్యులు ఇచ్చిన ప్రాధాన్యాలు, సూచనలు ఆధారంగా వారు చర్చలు జరుపుతారు. అలాగే ఈ నెల 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ స్ర్కీనింగ్‌ కమిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు 6న సమావేశమై.. కమిటీ సభ్యులు సేకరించిన అభిప్రాయాలు, సర్వేలు, సామాజిక సమీకరణల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఈ కసరత్తులోనే ఏకాభిప్రాయం వచ్చిన పేర్లతో తొలి జాబితాను రూపొందించి.. ఆమోదం కోసం ఏఐసీసీ ఎన్నికల కమిటీకి పంపనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వీరు ఖరారు

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఏకాభిప్రాయం వచ్చిన పేర్లు.. రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), భట్టివిక్రమార్క (మధిర), ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (హుజూర్‌నగర్‌), కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (నల్లగొండ), జగ్గారెడ్డి (సంగారెడ్డి), శ్రీధర్‌బాబు (మంథని), సీతక్క (ములుగు), పొదెం వీరయ్య (భద్రాచలం), జీవన్‌రెడ్డి (జగిత్యాల), కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌ రావు (మంచిర్యాల), సుదర్శన్‌ రెడ్డి (బోధన్‌), షబ్బీర్‌ అలీ (కామారెడ్డి), ఆది శ్రీనివాస్‌ (వేములవాడ), దామోదర్‌ రాజనర్సింహ (ఆందోల్‌), ఎ.చంద్రశేఖర్‌ (జహీరాబాద్‌), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్‌ రెడ్డి (పరిగి), గడ్డం ప్రసాద్‌కుమార్‌ (వికారాబాద్‌), ఫిరోజ్‌ఖాన్‌ (నాంపల్లి), సంపత్‌కుమార్‌ (ఆలంపూర్‌), వంశీచంద్‌ రెడ్డి (కల్వకుర్తి), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), పద్మావతి రెడ్డి (కోదాడ), దొంతి మాధవరెడ్డి (నర్సంపేట్‌), కొండా సురేఖ (వరంగల్‌ ఈస్ట్‌), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి)

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular