TRS MLAs Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ సిట్ దూకుడుగా వెళ్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో, ఆయన దిశా నిర్దేశం మేరకే దర్యాప్తు జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ టార్గెట్‌గా జరుగుతున్న సిట్ దర్యాప్తు.. గురువారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీలో లింకులు ఉన్నట్లు గుర్తించిన సిట్.. ఆ ఎంపీకి నోటీసులు 41ఏ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తులో ఇది కీలక పరిణామం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-ఆరోపణల నుంచి దారి మళ్లించేందుకేనా..
సిట్ దర్యాప్తు పూర్తిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంలోనే జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సిట్ ఏర్పాటు చేయకముందు కేసీఆర్ ప్రెస్‌మీట్‌లలో ఎవరెవరి పేర్లు చెప్పారో.. వారికే సిట్ నోటీసులు ఇవ్వడం కూడా బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు బుధవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేపట్టిన విచారణలోనూ సిట్ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుందని నిరూపించుకునేందుకు.. ఏపీ ఎంపీని ఇందులోకి లాగినట్లు తెలుస్తోంది.
-రఘురామకు నోటీసులు..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. విచారణలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు 41ఏ కింద నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని కోరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులను రఘురామ గతంలో కలిశారని దర్యాప్తులో గుర్తించినందున ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రఘురామ ఇప్పటి వరకు స్పందించలేదు.

-జగన్‌పై ధిక్కార స్వరం..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు 2019లో వైసీపీ టికెట్‌పై భీమవరం నుంచి విజయం సాధించారు. తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన జగన్‌పై ధిక్కార స్వరం వినిపించారు. పార్టీకి దూరంగా ఉంటున్నా. బీజేపీ, టీడీపీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వైసీపీ జారీచేసిన షోకాజ్ నోటీసులపై సంచలన రీతిలో స్పందించిన తర్వాత.. చాలా కాలంగా బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని గతంలో వైసీపీ ఎంపీ రఘురామపై ఆరోపణలు చేసింది. దీంతో ఎంపీ సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం, షోకాజ్ నోటీసులూ అందుకోవడం జరిగింది. తాజాగా తెలంగాణ సిట్ ఎంపీకి నోటీసులు ఇవ్వడంతో బీజేపీతో రఘురామ సాన్నిహిత్యం కొనసాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.