మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎదుర్కొనే క్రమంలో భాగంగా అధికార పక్షం అక్రమాలకు తెర తీస్తోంది. ప్రజాప్రతినిధులను బెదిరిస్తూ తమ దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. దీంతో ఈటల రాజేందర్ విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. హుజురాబాద్ ప్రాంత నేతలను కొనడమంటే కత్తిమీద సామే. వారు మా వెంట ఉంటారని చెప్పారు. మంత్రులు పరిపాలనలో భాగం కాకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. భయభ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో తమ వెంట నడిచిన వారందరూ ఇప్పటికీ తన వెంటే ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు. అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడకుండా సభ్యతగా మసలుకుంటే మంచిదని హితవు పలికారు.
ఇన్నాళ్లు రాని వారు..
అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా ఇప్పుడు వచ్చి బెదిరింపులకు గురి చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలు స్థానిక నేతలు తమ దారికి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వేధింపులకు గురిచేయడం ఆశ్చర్యకరం. స్థానిక ప్రజలప్రతినిధులను టార్గెట్ చేస్తూ వారిని తాయిలాలు చూపిస్తూ తమ వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ భ్రమల్లో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి రాజకీయ భ్రమల్లో విహరిస్తున్నారని దుయ్యబట్టారు. 2023 తర్వాత ఎవరి భవిష్యత్తు ఏమిటో అర్థం అవుతుంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రజల హృదయాల్లో ఉన్న తనను ఎవరు వేరు చేయలేరని పేర్కొన్నారు.
ఎన్నికలు జరిగితే..
ఒకవేళ ఎన్నికలు జరిగితే ప్రజలంతా తమ వైపే ఉంటారని ఈటల చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సకలజనులు తమవెంట ఉంటారన్నారు. నాయకులను ప్రలోభ పెట్టి తమ పబ్బం గడుపుకునే రోజులు పోయాయి. డబ్బులిచ్చి జైకొట్టుకోవచ్చు కాని అంతిమంగా విజయం తనదేనని జోస్యం చెప్పారు. ప్రజలను ఎవరు కొనలేరు. వారిని రెచ్చగొట్టి ఓట్లు సాధించుకోవలనుకోవడం అవివేకం.