https://oktelugu.com/

జిహెచ్ఎంసి ఫలితాల సారాంశం/పాఠాలు

జిహెచ్ఎంసి ఎన్నికలు ఆఘమేఘాల మీద వున్నఫలంగా జరపటం తెరాసకి లాభమా,నష్టమా? ఇదో పెద్ద ప్రశ్న. దీని ఫలితం అనుకున్నదొకటి అయినదొకటి లాగా అయ్యింది. ముందుగా జరిపితే ప్రతిపక్షాలకు సమయం లేక ఇరుకున పడిపోతాయని భావించి అంత సడెన్ గా పెట్టారు. కాని ఇది సీన్ రివర్సు అయ్యింది. వరదలో మునిగిన కాలనీ వాసులకు 10వేల సాయం ఎన్నికల్లో లాభిస్తుందనుకుంటే అదే తెరాస ని దెబ్బకొట్టింది. కార్యకర్తల సొమ్ము కైంకర్యంతో వరద బాధితులు తెరాసకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు […]

Written By:
  • Ram
  • , Updated On : December 5, 2020 / 07:56 AM IST
    Follow us on

    జిహెచ్ఎంసి ఎన్నికలు ఆఘమేఘాల మీద వున్నఫలంగా జరపటం తెరాసకి లాభమా,నష్టమా? ఇదో పెద్ద ప్రశ్న. దీని ఫలితం అనుకున్నదొకటి అయినదొకటి లాగా అయ్యింది. ముందుగా జరిపితే ప్రతిపక్షాలకు సమయం లేక ఇరుకున పడిపోతాయని భావించి అంత సడెన్ గా పెట్టారు. కాని ఇది సీన్ రివర్సు అయ్యింది. వరదలో మునిగిన కాలనీ వాసులకు 10వేల సాయం ఎన్నికల్లో లాభిస్తుందనుకుంటే అదే తెరాస ని దెబ్బకొట్టింది. కార్యకర్తల సొమ్ము కైంకర్యంతో వరద బాధితులు తెరాసకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసారు. అందుకే ఎల్ బి నగర్, సరూర్ నగర్ చుట్టుపక్కల అన్ని డివిజన్లు బిజెపి కైవసం చేసుకుంది. ఇక ప్రతిపక్షాలు తక్కువ సమయం ఇస్తే ఇబ్బంది పడతాయనే ఆలోచన కూడా అంతగా ఫలితాలు ఇవ్వలేదు. బిజెపి యంత్రాంగాన్ని కెసిఆర్ తక్కువ అంచనా వేసినట్లు కనబడుతుంది. అంత తక్కువ సమయంలో కూడా జనం దగ్గరకు పోగలిగారు. ప్రచారాన్ని వుధృతం చేయగలిగారు. ఇది తెరాస ఊహించలేదు. కెసిఆర్ కి ఒక్క వాళ్ళ అబ్బాయి కేటిఆర్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్. బిజెపికి లెక్కలేనంతమంది స్టార్ క్యాంపెయినర్లు. అది ప్రచారంలో బిజెపి పైచేయి సాధించటానికి ఉపయోగపడింది. ఇక మిగతా అంశాల కొస్తే కొన్ని విచిత్రాలు జరిగాయి.

    ఆంధ్ర ఓటర్లు కీలకంగా మారారు 

    అందరూ హిందూ-ముస్లిం సమీకరణాల గురించి మాట్లాడుకుంటుంటే నిశ్శబ్దంగా ఆంధ్ర ఓటర్లు ఫలితాన్ని సెట్ చేశారు. వాళ్ళు బలంగా వున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ల్లో ఈసారి తెరాస కి మద్దత్తుగా నిలిచారు. ఇదే జరిగి ఉండకపోతే కెసిఆర్ పరువు పూర్తిగా పోయివుండేది. ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు తెరాస ఎమ్యెల్యేలు పార్టీకి వెన్నుదన్నుగా వుండి తెరాసని గెలిపించగలిగారు. అదే జరిగివుండకపోతే బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించి వుండేది. ఇది కెసిఆర్ కి లాభం, బిజెపికి నష్టం. వీళ్ళు బిజెపిపై కోపంగా వున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో బిజెపి వైఖరి పరోక్షంగా జగన్ కి వుపయోగపడేటట్లు వుందని భావించటం వలన మోడీకి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలుస్తుంది. ఏది ఏమైనా కెసిఆర్, బిజెపి మధ్య కెసిఆర్ నే మిత్రుడుగా ఎంచుకున్నారు. దీనిపై బిజెపి పునః సమీక్షించుకోవాల్సి వుంటుంది. రెండోది, బిజెపి ప్రచారంలో ఆంధ్ర ఓటర్లను పూర్తిగా విస్మరించినట్లు అర్ధమవుతుంది. ఏదో మొక్కుబడిగా చివరలో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు వచ్చి ప్రచారం చేయటం తప్పిస్తే పెద్దగా కేంద్రీకరించింది ఏమీ లేదు. పార్టీలో వున్నఆంధ్రా ప్రాంతపు అతిరధ మహారధుల్ని దింపలేదు. ఒకవిధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వర్గం అదనుచూసి బిజెపిని దెబ్బ కొట్టినట్లుగా తెలుస్తుంది.

    కెసిఆర్ కుటుంబపాలన ఇకనైనా తగ్గించాలి 

    ఈ ఎన్నికల్లో తెరాస నేర్చుకోవాల్సిన గుణ పాఠం. ఇకనైనా అన్నింటికీ కేటిఅర్, హరీష్ రావు, కవితలను రంగంలోకి దించటం, అన్ని వ్యవహారాలు వాళ్ళే చక్కబెట్టటం మానుకోవాలి. ప్రజలు తెలంగాణా వచ్చిన కొత్తలో దీన్ని పట్టించుకోకపోయినా ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్పే మాటలకు ఒక చెవి వేస్తున్నారని గుర్తుంచుకోవాలి. వున్న కుటుంబపాలన చాలక కవితని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్త బలంగా వినబడుతుంది. ఇదే జరిగితే అది కెసిఆర్ కుటుంబంపై వ్యతిరేకతను ఇంకా పెంచుతుంది. ఇప్పటికైనా కుటుంబ సభ్యులను పక్కకు పెడితేనే తెరాసకు మంచిది.

    కెసిఆర్ జాతీయ రాజకీయాల ప్రవేశం మానుకోవాలి 

    ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాలను ఏలదామనుకుంటే అది మొదటకే ముప్పు వస్తుంది. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఇక్కడ పరిపాలనను చక్కపెట్టమని కానీ ఇక్కడనుంచి డిల్లీకి ఎగిరిపొమ్మని కాదు. అయినా ఆ రాజకీయాలు ప్రాంతీయ పార్టీలకు అచ్చిరాదు. జాతీయ పార్టీలు పూర్తిగా బలహీనంగా వున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పొచ్చు, కానీ బిజెపి అత్యంత బలంగా వున్నప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు. లోక్ సభ ఎన్నికలు ఇంకా మూడు సంవత్సరాలు వున్నాయి. ఈ లోపల ఎన్ని పరిణామాలు సంభవిస్తాయో ఇప్పుడే చెప్పలేము. ఇప్పుడు కలిసివస్తాయనుకున్న పార్టీలు అప్పటికి ఎటు ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఆ ప్రయత్నం మానుకోవటం మంచిది.

    మజ్లీస్ తో పొత్తుపై కూడా సమీక్షించుకోవాలి 

    దీనివలన తాత్కాలిక ప్రయోజనం వుండవచ్చేమో కాని దీర్ఘకాలంలో తెరాసకి దెబ్బనే. ఉదాహరణకు భైంసాలో జరిగిన అల్లర్లు ఉత్తర తెలంగాణాలో హిందువుల్లో ఇప్పటికే తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు హైదరాబాద్ లో మేయర్ పీఠం కోసం మజ్లీస్ తో పొత్తు పెట్టుకుంటే బిజెపికి మంచి ఆయుధం దొరికినట్లే. అందుకే దీనిపై కఠిన నిర్ణయం తీసుకోవటమే మంచిది. ఇప్పుడు ప్రధాన ప్రత్యర్ధి బిజెపి కావటంతో  తెరాస దాని వ్యూహాల్లో పలు మార్పులు చేసుకోవాల్సి వుంది. మజ్లీస్ తో పొత్తు పెట్టుకోవటం వలన బిజెపికి ఇంకా బలం చేకూరే అవకాశం వుంది.

    జాతీయ నాయకుల ప్రచారం అవసరమా?

    బిజెపి జిహెచ్ఎంసి ఎన్నికల్లో వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని తీసుకొచ్చి ప్రచారం నిర్వహించింది. దీనివలన అదనపు ప్రయోజనం ఏమిటో తెలియదు. ఒక్కోసారి జాతీయ నాయకత్వ ప్రచారం వలన నష్టం జరిగే అవకాశం కూడా వుంది. ఇప్పటికే ప్రభుత్వాల మధ్య జరిగే సంప్రదింపుల్లో రాష్ట్ర ప్రభుత్వ పధకాల్ని కొన్నిసార్లు ప్రశంసించటం జరుగుతుంది. దాన్ని రాష్ట్ర పార్టీలు వివిధ సందర్భాల్లో తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ వుంటారు. అదీగాక స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన నాయకత్వానికి వుండే అవకాశం లేదు. రెండోది, వాళ్ళ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఓడిపోతే అది వేరేగా వుంటుంది. ఉదాహరణకు అమిత్ షా బౌద్ధనగర్-సీతాఫల్ మండి మధ్య ర్యాలి నిర్వహించాడు. ఆ రెండు ప్రాంతాలు తెరాస గెలిచింది. అదివరకు కాంగ్రెస్ కూడా ఇదే పని చేసేది. దీనిపై జాతీయ పార్టీలు సమీక్షించుకోవటం మంచిది.

    కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా రివర్స్ లో వుంది 

    బిజెపి అతిగా స్పందించిందని అనుకుంటే కాంగ్రెస్ అసలు పట్టించుకోలేదు. పాపం ఆ రేవంతరెడ్డి ఒక్కడే అభిమాన్యుడులాగా పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. తనకి రాష్ట్ర నాయకత్వ మద్దత్తు, కేంద్ర నాయకత్వ సహాయం లేకపోయింది. ఇన్నాళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడ్ని నియమించకపోవటం కాంగ్రెస్ డొల్ల తనాన్ని తెలియ చేస్తుంది. బీహార్ ఎన్నికల నుంచి ఏమీ గుణపాఠం నేర్చుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు రేవంత రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినా ఒరిగేదేమీ లేదు. తెలంగాణా రాజకీయాలు తెరాస-బిజెపి మధ్యనే ఉండబోతున్నాయి.

    బిజెపి ఇకనైనా గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలకటం మంచిది 

    తెరాసలో ప్రజాస్వామ్యంలేదు అంతా ఏక స్వామ్యమే. బిజెపిలో రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్యం ఎక్కువగా వుంది. అది రాను రాను గ్రూప్ రాజకీయాల కింద మారిందని అందరూ అనుకుంటున్నారు. అదే నిజమయితే కెసిఆర్ లాంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవటం చాలా కష్టం. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు వుంది. కెసిఆర్ రాజకీయ చాణక్యం సంగతి అందరికి తెలిసిందే. బిజెపిలో అంతర్గత ప్రజాస్వామ్యం మంచిదే కానీ అది వాళ్ళ సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగే స్థాయికి చేరకూడదు. చేరితే కెసిఆర్ దాన్ని తనకు అడ్వాంటేజ్ గా మార్చుకోవటం పెద్ద పనేమీ కాదు.

    చివరిగా 

    జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితం బిజెపి కి పెద్ద నైతిక బలాన్ని ఇచ్చింది. వచ్చే మూడు సంవత్సరాల్లో అది తీసుకునే కార్యక్రమాలు, వ్యూహాలపైనే దాని వృద్ధి ఆధారపడి వుంది. వాళ్లకు అదృష్టవశాత్తు 24 గంటలూ పనిచేసే కేంద్ర యంత్రాంగం, నాయకత్వం వుంది. అదే వాళ్లకు పెద్ద అసెట్. ఇక తెరాస కి ఇప్పటికీ ఆత్మ విమర్శచేసుకొని తప్పులు సరిదిద్దుకొని పని చేస్తే రాష్ట్ర ప్రజల మన్ననలు పొందే అవకాశం వుంది. ఇప్పటికి తెలంగాణాలో కెసిఆర్ పై ఎవరికీ లేని ఇమేజ్ వుంది. అసెంబ్లీలో పూర్తి మెజారిటీ వుంది. కావలసినదల్లా పునః సమీక్షించుకొని ముందుకు వెళ్ళటమే. రాజకీయ చిత్రం ఇప్పటికీ కెసిఆర్ ని దాటి వెళ్ళలేదు. దాన్ని నిలబెట్టుకోవటమా, పోగొట్టుకోవటమా అనేది పూర్తిగా కెసిఆర్ చేతిలోనే వుంది. మొత్తం మీద తెలంగాణా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చూద్దాం ఎవరు పైచేయి సాధిస్తారో.