https://oktelugu.com/

BRS: వద్దొద్దు.. ఈ సారికి మీరే పోటీ చేయండి!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈసారి తనకు కాకుండా తన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరినట్టు తెలుస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : August 9, 2023 8:27 am
    BRS

    BRS

    Follow us on

    BRS: మరో కొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల కార్యాలయాలు కళ కళలాడుతున్నాయి. ఇప్పటికే టికెట్ల గోల మొదలైంది. కొంత మంది ఎమ్మెల్యేలు ఎన్నికల బరి నుంచి తాము తప్పుకుంటామని, తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి అధిష్టానాన్ని కోరుతున్నారు..కానీ, వారి ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తున్నది. ” వద్దొద్దు.. ఈ సారికి మీరే పోటీ చేయండి” అంటూ చెబుతున్నట్టు సమాచారం. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఇతర నేతలు కూడా తమ వారసులను ఎన్నికల బరిలోకి దించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత రాష్ట్ర సమితిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వారసులకు టికెట్ దక్కించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా అధినేత కేసిఆర్ ను కలుస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీకి తమ దూరంగా ఉంటామని, తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని వారు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. తమ వారసులను ప్రమోట్ చేసుకునేందుకు నేతలు చేస్తున్న ప్రతిపాదనలను కెసిఆర్ తోసి పుచ్చుతున్నట్టు సమాచారం. ఇలా కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొస్తున్న వారిలో సీనియర్ నేతలు ఉన్నట్టు సమాచారం.

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈసారి తనకు కాకుండా తన తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరినట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు ఉండాల్సిందేనని, అక్కడి నుంచి మీరే పోటీ చేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డికి కెసిఆర్ సూచించినట్టు. అలాగే, అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తన కుమారుడు ప్రేమేందర్ కు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన తనయుడు ప్రశాంత్ రెడ్డికి, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే తన కుమారుడు హరీష్ కు టికెట్ ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను కెసిఆర్ తోసిపొచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తమ వారసులను పరిగణనలోకి తీసుకోవాలని కోరినప్పటికీ కెసిఆర్ ససేమిరా అన్నట్టు సమాచారం. అలాగే, సిటింగ్ ఎమ్మెల్యేలు కాకుండా పలువురి ఇతర నేతల ప్రతిపాదనలకూ అధిష్టానం ఓకే చెప్పలేదని సమాచారం.

    శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు అమిత్ రెడ్డికి మునుగోడు నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తన కుమారుడు భరత్ ప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్ కి టికెట్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది..మంత్రి కేటీఆర్ కు సంజయ్ స్నేహితుడు కావడం విశేషం. ముందుగానే టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన క్షేత్ర స్థాయిలో తిరుతున్నట్టు తెలుస్తోంది. గడచిన ఎన్నికల్లో పరిగి సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి కొడుకు మహేష్ రెడ్డి, ఇంకా కొందరి వారసులకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో వారసులకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెబుతోంది.