
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ పూర్తిస్థాయిలో కాకపోయినా కుల రాజకీయాలకు అంతో ఇంతో ప్రాధాన్యత ఉంది. కులాన్ని చూసి ఓటు వేసే సంస్కృతి పలు ప్రాంతాల్లో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు. కుల సమీకరణల ఆధారంగానే పార్టీల అధినేతలు ఎన్నికల్లో నాయకులను పోటీకి నిలుపుతూ ఉంటారు. దశాబ్దాల కాలం నుంచి కులాల లెక్కలను ఆధారం చేసుకుని ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన టీడీపీ కమ్మ సామాజికవర్గానికి, వైసీపీ రెడ్ల సామాజిక వర్గానికి, జనసేన కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తోంది. అయితే టీడీపీ, వైసీపీ రాష్ట్రంలో బలమైన పార్టీలుగా ఎదిగినా జనసేన పార్టీ మాత్రం ఎదుగూబొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనేలా ఉంది. జనసేన పార్టీ పెట్టిన రోజుకు, నేటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదు. జనసేన కూడా మరో ప్రజారాజ్యం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీని రాష్ట్రంలో బలపరచాలని కాపు వర్గం మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను సోము వీర్రాజు కలిశారు.
అయితే సోము చిరంజీవి, పవన్ ను కలవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్ సోము చిరంజీవిని సీఎం చేయాలని భావిస్తున్నారని… చిరంజీవి కుటుంబానికి సోము హనుమంతుడి లాంటివాడని…. సోము ఆర్.ఎస్.ఎస్. ముసుగులో కాపులను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇద్దరు నేతలను కలిసినంత మాత్రాన కులాన్ని అంటగట్టకూడదని… చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు కులాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని హర్షవర్ధన్ గుర్తుంచుకోవాలని బీజేపీ నేతలు చెబుతున్నారు.