యూపీ రైతులపైకి ఎక్కించిన బీజేపీ నేత కారు.. ‘లిఖింపూర్’లో అసలేం జరిగింది?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనల్లో భాగంగా అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ జరిగిన ఆందోళనలో 8 మంది మరణించారు. ఈ సంఘటనకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకా గాంధీని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అలాగే […]

Written By: NARESH, Updated On : October 4, 2021 11:12 am
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనల్లో భాగంగా అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ జరిగిన ఆందోళనలో 8 మంది మరణించారు. ఈ సంఘటనకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకా గాంధీని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను పోలీసులు నిర్బంధించారు.

ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ లో రాజకీయం వేడెక్కుతోంది. ప్రతిపక్షాల నాయకులు ఇక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు నిషేధం విధించడంతో ఆయా పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంకా గాంధీని సీతాపూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ పార్టీ నేత సతీశ్ చంద్రా మిశ్రాను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారని మాయావతి ట్వీట్ చేశారు. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎక్కడికి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను కూడా అర్ధరాత్రి మహారాజ్ గంజ్ లో అడ్డుకున్నారు. అయితే లఖింపూర్ కు నాయకులు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..? అసలు ఏం జరిగింది..?

ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించడానికి లఖింపూర్లో ఖేరీలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తో కలిసి మరో కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్లారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పర్యటన గురించి తెలుసుకున్న రైతులు నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో టికునియా పట్టణంలో రైతులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొందరు బీజేపీ నాయకులు వాహనంలో రాగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓ బీజేపీ నేత కారు ఆగకుండా ముందుకెళ్లారు. ఆ కారు రైతులను ఢీకొడుతూ వెళ్లింది. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకుని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కారుకు నిప్పు పెట్టారు.

ఇలా జరిగిన ఆందోళనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సహా మొత్తం 8 మంది మరణించారు. కారు కింద పడి ఇద్దరు వ్యక్తులు చనిపోగా, వాహనం బోల్తాపడి మరో ముగ్గురు మరణించారని లఖింపూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ చౌరాసియా తెలిపారు. ఈ సంఘటనలో మొత్తం 8 మంది చనిపోయారని జిల్లా అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ ప్రకటించారు. చనిపోయిన వారిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కాగా ఈ సంఘటన దురదృష్టకరమని సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను ఆదేశించారు.

లఖింపూర్ సంఘటనపై ప్రతిపక్షాలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ లో నిరసన తెలిపారు. ‘ రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారుతో ఢీకొట్టడం అవమానకరం. బీజేపీ వాళ్ల జులుంకు ఇదే నిదర్శనం ’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘ దేశంలో రైతులను బీజేపీ ఎంత ద్వేషిస్తుందో ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది. రైతులకు జీవించే హక్కు లేదా..? ఇది రైతుల దేశం.. బీజేపీ క్రూరమైన భావజాలానికి జాగీరు కాదు’ అని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ సైతం ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు లఖింపూర్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.