
అనుకున్నట్టే అయ్యింది. తెలుగుదేశం పార్టీ ఆఖరి దీపం కూడా ఆరిపోయింది.. చంద్రబాబుకు తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి. ఇక ఆ పార్టీకి పెద్ద దిక్కు, చిన్నదిక్కులు.. ఆసలే దిక్కు లేకుండా పోయింది. తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైపోయినట్టే..
రాష్ట్ర విభజనతో రెండు కళ్ల సిద్ధాంతంను అప్లై చేసిన చంద్రబాబుకు తెలంగాణలో రాజకీయాలు వర్కవుట్ కాలేదు.. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలు పార్టీలు మారిపోయారు. ఆఖరుకు మిగిలిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ సైతం నిన్న కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపారు.
ఈ రోజు ఉదయం ఎల్.రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. టీఆర్ఎస్ లో చేరాలని రమణ నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు రమణ వెల్లడించారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు రమణ కృతజ్ఞతలు తెలిపారు.
నిన్న రాత్రి ఎల్ రమణ స్వయంగా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో చర్చలు జరిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి ఈ చర్చలు ఫలవంతం అయ్యేలా చేశాడు. తగిన గుర్తింపు ఇస్తామని.. రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించారు.మూడు నాలుగు రోజుల్లోనే కేసీఆర్ సమక్షంలో ప్రగతి భవన్ లో రమణ, తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.