
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఎన్నికల రచ్చ ఏ స్థాయిలో కొనసాగుతోందో తెలిసిందే. ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. ఎన్నికలకు సిద్ధమైపోయారు. అధ్యక్ష బరిలో ముము సైతం అంటూ ఒక్కొక్కరిగా ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికే ఆరుగురు అధికారికంగా అనౌన్స్ చేశారు. పోరు మాత్రం ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు – సీనియర్ నరేష్ వర్గం మధ్యనే ఉంటుందని అంటున్నారు.
అయితే.. ఈ ఎన్నిక విషయమై ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించడం.. అందులో.. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యవర్గంలోని వారు కూడా ఉండడంతో రచ్చ జరిగింది. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నిరసన తెలిపారు. ఈ గొడవ మున్ముందు ఇంకా జఠిలంగా మారే పరిస్థితి కనిపిస్తుండడంతో.. ఎన్నిక ఏకగ్రీవం చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇది కూడా.. నరేష్ చేయడం గమనార్హం. ప్రకాష్ రాజ్ ను అడ్డుకునేందుకు ఆయన ఈ చర్చ తెచ్చారనే డిస్కషన్ కూడా నడుస్తోంది.
అయితే.. ప్రకాష్‌రాజ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. తన వర్గం వారితో వరుస సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. పూరీ జగన్నాథ్ ఇలాఖా (కేవ్)లో రహస్యంగా మంతనాలు జరిపారు. కానీ.. ఈ విషయం లీకైంది. దీంతో.. ఇలా కాదని, నేరుగా ఆఫీస్ ఓపెన్ చేశారు ప్రకాష్ రాజ్. ఫిల్మ్ నగర్ లో రెంటుకు తీసుకున్నారు. ఏం చేసైనా మా అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు ప్రకాష్ రాజ్.
అటు సీనియర్ నరేష్ కూడా తన వర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాలోని దాదాపు వంద మంది మద్దతుదారులతో వరుస భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో.. ప్రకాష్ రాజ్ – నరేష్ వర్గం ఢీ అంటే ఢీ అంటున్నాయని చెబుతున్నారు. అయితే.. నరేష్ పోటీ చేయకపోయినప్పటికీ.. ప్రకాష్ రాజ్ ను అడ్డుకోవాలని చూస్తున్నారట. అందుకే.. మంచు విష్ణుకు మద్దతు ప్రకటిస్తారని సమాచారం.
పరిస్థితి ఇలా ఉండడంతో.. ఇండస్ట్రీ పెద్దలు అంతర్మథనం చెందుతున్నారు. ఇది ఏ మాత్రం మంచి వాతావరణం కాదని, ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా.. ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి, మురళీ మోహన్ వంటివారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న జయసుధ పేరును అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. మరి.. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది చూడాలి.