
కర్నూల్ నగరంలో కరోనా మహమ్మారి తీవ్రత అదుపులోకి రావడం లేదు. బుధవారం ఒక్కరోజే ఈ జిల్లాలో 21మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 638కి చేరింది. అంటే రాష్ట్రంలో గల మొత్తం కేసులలు నాలుగోవంతుకు పైగా ఈ జిల్లాలోనే ఉన్నట్లవుతున్నది.
ఈ వ్యాధికి చికిత్స పొందుతూ జిల్లాలో మరొకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 53కు చేరుకున్నాయి. ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 68కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2,407కు పెరిగింది.
రా ష్ట్రవ్యాప్తంగా బుధవారం 43మంది డిశ్చార్జి అయ్యారు.వీరితో కలిసి 1639 మంది వైరస్ నుండి కోలుకున్నారు. అయితే రాష్ట్రంలో మరో ముగ్గురు వలస కూలీలకు పాజిటివ్ రావడంతో మొత్తం వలస కూలీలా సంఖ్యా 153కు చేరుకొంది
బుధవారం లండన్ నుండి వచ్చిన 143 మంది ప్రవాసాంధ్రులలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపించగా వారిని ఖ్వారంటీన్ కు తరలించారు. వారిలో కృష్ణ జిల్లా కోడూరుకు చెందిన యువకుడు (31), తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంకు చెందిన యువతి(23), హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎన్‌జీవోస్ కాలనీకి చెందిన వ్యక్తి ఉన్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో మరో ఇద్దరికి కరోనా సోకింది. వీరిద్దరూ కోయంబేడు మార్కెట్‌కు కూరగాయలు తరలించే వాహనాలకు డ్రైవర్లుగా పనిచేసినవారే. వీటితో కలిపి ఈ జిల్లాలో కోయంబేడు లింకులతో బయటపడిన మొత్తం కేసులు 96కి పెరిగాయి.
మరోవంక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ సమాచారంలో అస్పష్టత కొనసాగుతున్నది. రాష్ట్ర స్థాయిలో విడుదల చేస్తున్న సమాచారాన్ని, జిల్లా అధికారులు అందిస్తున్న సమాచారాన్ని సంబంధం ఉండటం లేదు.
తాజాగా కోయంబేడు లింకులతో చిత్తూరు జిల్లాలో 6 కేసులు నమోదైనట్టు చూపించారు. కానీ క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం శ్రీకాళహస్తిలో 5, కేవీబీపురంలో 4, గుడిపాలలో ఒకటి చొప్పున 10 కేసులు వెలుగు చూశాయి.
వీటిని జిల్లా అధికారులు కూడా ధ్రువీకరించారు. ఇందులో కోయంబేడు లింకులున్నవి నాలుగే. మిగిలిన రెండు ఎక్కడివో అంతుబట్టడం లేదు. దీనిపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు.
మరోవైపు ఆరోగ్యశాఖ వెల్లడించిన అనధికారిక సమాచారం ప్రకారం 11 కేసులు చూపించారు. ఇందులో 10 చిత్తూరు జిల్లాకు చెందినవి కాగా మరొకటి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందింది. అక్కడనుంచి ఓ వ్యక్తి అనారోగ్యంతో చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు వచ్చారు.
వైద్యపరీక్షల్లో అతడికి కరోనా అని తేలింది. ఈ కేసును కూడా జిల్లా లెక్కలోనే చూపించారు. దీంతో వాస్తవంగా ఎన్ని కేసులు, ఎక్కడ నమోదవుతున్నారునే సమాచారం ప్రజలకు తెలిసే అవకాశమే లేకుండా పోతోంది.