Kuppam Elections: ఇన్నాళ్లు చంద్రబాబును ఆదుకున్న కుప్పం నియోజకవర్గం ఒక్కసారిగా హ్యాండిచ్చిందా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. సందట్టో సడేమియాలా వైసీపీ కుప్పంలో అధికారం హస్తగతం చేసుకోవడం చూస్తుంటే టీడీపీలో కూడా భయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కుప్పం నుంచి కాకుండా వేరే చోట నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని దారులు వెతుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీకి అచ్చొచ్చిన కృష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత కాలం ఆదుకుంటూ వచ్చిన కుప్పం ఓటర్లు ఒక్కసారిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడంపై కంగారు పడుతున్నారు. భవిష్యత్ పై బెంగతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత దారుణమైన పరాభవానికి కారణాలేంటని ఆరా తీస్తున్నారు. పార్టీకి ఇంత దుర్గతి పట్టిన దాఖలాలు గతంలో సైతం కనిపించలేదు. తన అత్తగారి ఊరి నుంచైనా మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు ఖరారు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని పెనమలూరు లేదా అవనిగడ్డ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పోయిన పరువును నిలబెట్టుకోవాలంటే మార్పు తప్పనిసరని ఆలోచనలో పడిపోయినట్లు చెబుతున్నారు. పైగా అక్కడ తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో ఎలాగైనా విజయం సాధించవచ్చనే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

2024 ఎన్నికలే లక్ష్యంగా ఇరు పార్టీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బలమైన పార్టీగా ఎదగాలంటే కొన్ని త్యాగాలు చేయకతప్పకపోచ్చని భావిస్తున్నారు. ఇందుకోసమే నేతలను సమాయత్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో అంచనాలు వస్తున్నాయి. కుప్పం ఫలితాలను బేరీజు వేసుకుని ఇకపై అలాంటి పరాభవం రాకుండా చూసుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
Also Read: అధికారానికే అదలం.. జనసేనకు తృప్తి.. టీడీపీకి ఘోర అవమానమే.. ఇది కామనే?