Homeజాతీయ వార్తలుకేటీఆర్ వాదనలో పస వుందా ?

కేటీఆర్ వాదనలో పస వుందా ?

కేటిఆర్ ఈ పేరు తెలియనివాళ్ళు ఎవరూ వుండరు. కొద్దికాలంలోనే యువత లో , పట్టణ ప్రజానీకంలో మంచి అభిప్రాయం ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. రావటం వారసత్వం నుంచి వచ్చినా తనలో ప్రతిభ ఉందని నిరూపించుకున్నాడు. ఈ అభిప్రాయం ప్రజల్లో వుంది. ఇంగ్లీషులో, తెలుగులో, ఉర్దూ లో అనర్గళంగా మాట్లాడగలడు, వాళ్ళ నాన్నలాగా. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలతో, విద్యావంతులతో ప్రభుత్వం తరఫున మాట్లాడాలంటే కేటీఆర్ నే ఎంచుకుంటారు. కొన్నాళ్ళు అమెరికాలో పనిచేసివచ్చిన అనుభవం కూడా తనకి కలిసొచ్చింది. ఇంతవరకూ బాగానేవుంది. కానీ నిన్న టైమ్స్ నౌ సమ్మిట్ లో మాట్లాడిన ధోరణి ఏమీ బాగాలేదు.

రాష్ట్రాలకు నిధుల విషయంలో ప్రజలకు చెవిలో పూలు పెట్టటం బాగాలేదు. నిధుల్లో న్యాయబద్ధమైన వాటా అంటే ఏమిటి? రాష్ట్రంలో వసూలైన నిధులన్నీ తిరిగి రాష్ట్రానికే చెందాలనటం వినటానికి , అమాయక జనాన్ని నమ్మించటానికి బాగానేవున్నా అది మోసపూరితమైన వివరణ. పరోక్ష పన్నుల్లో కేంద్రం ప్రత్యక్షంగా వసూలుచేసే నిధులు తక్కువ. జీఎస్టీ పేరుతో రాష్ట్రాలు వసూలు చేసే నిధులే ప్రధానమైనవి. వాటిని ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్రానికి, రాష్ట్రాలకు పంపిణి చేయటం జరుగుతుంది. అంతేగాని ఒక రాష్ట్రంలో వసూలయ్యే నిధులు ఆరాష్ట్రంలోనే ఖర్చుచేయాలనటం వితండవాదన. అలాగయితే వెనకబడిన రాష్ట్రాల స్థితిగతులు ఎవరు చూస్తారు?

ఇకపోతే మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేయాలని అడగటంలో తప్పులేదు. కాకపోతే అవి ఇవ్వకపోతే తెలంగాణకు అన్యాయం చేసినట్లని ప్రచారం చేయటం తప్పు. ఇవి న్యాయబద్ధంగా రావాల్సినవి అనటం కూడా తప్పే. ప్రతి రాష్ట్రం తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులకు కేంద్రం నిధులివ్వాలని కోరుకుంటుంది. కానీ అది కేంద్రానికున్న సాధ్యాసాధ్యాలను బట్టి ఒప్పుకుంటుంది. ఉదాహరణకు ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అది విభజన సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చట్టంలో పొందుపరచిన మేరకు ఒప్పుకుంది. అదే తెలంగాణ విభజన సమయంలో మిగులు రాష్ట్రం. ఆదాయంలో సింహభాగం హైద్రాబాదు నగరం వలన తెలంగాణ కు వచ్చింది. అందుకనే ఆరోజు ఈ డిమాండ్ తెలంగాణ పెట్టలేదు. అయినా వనరులుంటే ఇవ్వకూడదని ఎక్కడా లేదు. కాకపోతే కేంద్రం దగ్గర నిధులు ఎక్కడున్నాయి. ద్రవ్యలోటు ను కట్టడి చేయలేని పరిస్థితుల్లో అదనంగా ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా ఏవీ సంతృప్తిగా లేవు. కారణం రాష్ట్రాల కోర్కెలు తీర్చే పరిస్థితుల్లో కేంద్రంలేదు కాబట్టి. అంతమాత్రాన పన్నుల్లో వాటా తప్ప కేంద్రం నుంచి ఏమీ రావటల్లేదని అంటే అది మోసపూరితమే అవుతుంది. ఉదాహరణకు ఇటీవలికాలంలో తెలంగాణలోని అనేక రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా ప్రకటించింది. అవి పన్నుల వాటాగా వచ్చేవాటికి అదనం. అటువంటివి పన్నుల వాటాకు అదనంగా ఎన్నో ఉంటాయి. కాబట్టి కేటీఆర్ మాట్లాడేదాంట్లో నిజం లేదు. దాన్ని కేంద్ర అహంకార ధోరణి పేరుతో మసిపూసి మారేడుకాయ చేయటం ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో పేరుతెచ్చుకుంటున్న కేటీఆర్ కి తగదు.

ఇక రాజకీయ విషయాల్లోకి వస్తే ఇప్పుడున్న పార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని చెప్పటం దుస్సాహసం. తెరాస ప్రాంతీయపార్టీ కాబట్టి అది ఎప్పటికీ జాతీయ పార్టీ కాలేదు కాబట్టి జాతీయ పార్టీలను కూడా తమ స్థాయికి తెచ్చుకోవాలనే తాపత్రయం తప్పించి నిజంకాదు. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటే ఆచి తూచి మాట్లాడాల్సివుంటుంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయి కాబట్టి ప్రాంతీయ పార్టీల కూటమే శరణ్యమని ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేయటం అంత తేలిక కాదు. ప్రజల తెలివితేటల్ని తక్కువ అంచనా వేయొద్దు. ఆప్ ఢిల్లీ ఒక్క రాష్ట్రంలోనే పరిపాలనలో వున్నా ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రాంతీయ పార్టీ నాయకుడుగా చూడటంలేదు. ఎందుకని? అదే కెసిఆర్ ని తెలంగాణ నాయకుడుగానే చూస్తున్నారు. జాతీయ నాయకుడుగా చూడటం లేదు. ఇది వాస్తవం. ఈ నిజాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. కాళ్ళు భూమి మీద పెట్టి నడిచినట్లవుతుంది. కేటీఆర్ కి ఇంకా ఎంతో భవిష్యత్తు వుంది, వయసు వుంది. వేసే అడుగులు జాగ్రత్తగా చూసుకొని వేస్తే ముందు భవిష్యత్తు బాగుంటుందని అర్ధం చేసుకుంటే మంచిది.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
Exit mobile version