KTR: తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నిన్నటి వరకు బీఆర్‌ఎస్ ఒక్కటే ప్రచారంతో హోరెత్తించింది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కూడా రంగంలోకి దిగాయి. నేతలు, అధినేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ గెలుపుపై దృష్టిపెట్టగా, బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఇక బీఆర్‌ఎస్ ఈసారి పెద్దగా హామీలు ఏమీ ఇవ్వకపోగా, ప్రచారంలోనూ, ప్రసంగంలోనూ పాత చింతకాయ పచ్చడిలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అస్త్రశస్త్రాలతో..
ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేని బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీల్లో ధనిక పార్టీ. దీంతో ఉప ఎన్నికల తరహాలోనే అసెంబ్లీ ఎన్నికలను కూడా ఖరీదుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఓటర్లకు రూ.5 వేలు పంచేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అభ్యర్థులకు అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు కీలకపాత్ర పోషిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లనురంగంలోకి దింపుతుండగా, బీఆర్‌ఎస్‌కు త్రిమూర్తులే అన్నీ అయ్యారు. ఇప్పటికే సోషల్‌మీడియాను బీఆర్‌ఎస్ విస్తృతంగా వాడుకుంటోంది. డిజిటల్ బోర్డులతో ప్రచారం చేస్తుంది. పత్రికలు,టీవీల్లో ప్రకటను ఇస్తోంది.
ఇంటర్వ్యూల్లో కేటీఆర్ బిజీ..
ఇదిలా ఉండగా కేటీఆర్ ఈసారి బీఆర్‌ఎస్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇందుకోసం మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. తన అనుకూల మీడియాలో స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు ఇప్పటికు ఇచ్చుకున్నారు. పత్రికల్లోనూ ఇంటర్వ్యూలు వచ్చాయి. రెండు రోజలు క్రితం మై విలేజ్‌షో గంగవ్వతో నాటుకోడి కూర వండి ప్రచారం చేయించుకున్నారు. అయితే కాస్త బూమరాంగ్ అయింది. ఇందుకు రూ.2 కోట్లు ఇచ్చినట్లు గంగవ్వ తెలిపింది. దీంతో కేటీఆర్ పరువు పోయింది. నెట్టింట్లో కేటీఆర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ మరో అస్త్రం ఎంచుకున్నారు. హైదరాబాద్ ఓటర్ల, యువ ఓటర్ల ప్రసన్నం కోసం రేడియో మిర్చి 98.3 ఎఫ్‌ఎంకు వెళ్లారు. ఇందుకోసం ఎంత ఇచ్చారో తెలియదు కానీ, రేడియో యాజమాన్యం పిలిస్తేనే వచ్చినట్లు మాత్రం ప్రకటించుకున్నారు. పదేళ్లు పట్టిందని జాకీ అనగానే.. మీరు సరిగా పిలవలేదు.. అందుకే రాలేదు అంటూ సందడి చేశారు. కాసేపు రేడియలో మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీబాత్‌పై విమర్శలు చేస్తున్న కేటీఆర్.. ఇప్పుడు ఆయన బాటలోనే రేడియో స్టేషన్‌కు వెళ్లడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కేటీఆర్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను వీలైనంత వాడుకుంటున్నారు.