నిన్నటి వరకూ టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు.. ఇప్పుడు తమపై తామే సంధించుకుంటున్నారు. కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు చేసిన వారు.. తమలో తాము కలహించుకుంటున్నారు. దీనంతటికీ కారణం కేటీఆర్ తో పలువురు బీజేపీ నేతలు భేటీ కావడమే! ఇది రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలియకుండా జరిగిందట. దీంతో.. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బండి.. హై కమాండ్ కు ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్ ఇటీవల మృతిచెందారు. ఆయన బీజేపీ నుంచి గెలిచారు. దీంతో.. త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని కోరుతూ హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ముఖ్యనేతలు కేటీఆర్ వద్దకు వెళ్లడమే ఈ పంచాయతీకి కారణమైంది. అక్కడికి వెళ్లడం ఒక కారణమైతే.. అందరూ కలిసి బండి సంజయ్ ను టార్గెట్ చేసినట్టుగా ప్రచారంలోకి వచ్చింది.
బీజేపీలో అందరూ మంచివాళ్లే.. ఒక్క బండి సంజయ్ తప్ప అన్నారట కేటీఆర్. కేసీఆర్ పై ఇష్టారీతిన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, తాగుబోతు అంటూ మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతేనా? అని అక్కడికి వచ్చిన నేతలతో అన్నారట కేటీఆర్. ఈ విషయంలో.. బీజేపీ నేతలు గులాబీ నేతకు మద్దతు తెలిపినట్టు సమాచారం. మరీ.. అతి చేస్తున్నాడంటూ.. ఏవేవో అనుకున్నారట. ఈ విషయం లీకవడంతో కమలంలో ముసలం మొదలైంది.
ఈ విషయం తెలుసుకున్న సంజయ్ ఆ నేతలపై గుర్రుగా ఉన్నారట. తనకు తెలియకుండా వెళ్లడమే కాకుండా.. తనపై ఇలా మాట్లాడుతారా? అని మండిపడుతున్నారట. దీంతో.. అధిష్టానానికి ఫిర్యాదు చేసి, ఆ ముగ్గురినీ పార్టీ నుంచి పంపేయాలని ఒత్తిడి తెస్తున్నారట. ఆ ముగ్గురిలో ఇటీవల హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోయిన అభ్యర్థి రామచంద్రరావు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీనికి కౌంటర్ గా మిగిలిన నేతలు కూడా సంజయ్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
అయితే.. లీకేజీ ఎక్కడి నుంచి జరిగిందన్నదే అసలు సమస్య. కొందరు మాత్రం టీఆర్ఎస్ నుంచే బయటకు వచ్చిందని చెబుతున్నారు. ఆ విధంగా ప్లాన్ ప్రకారమే.. బీజేపీలో పంచాయితీ రగిలించారని అంటున్నారు. నిన్నా మొన్నటి వరకూ టీఆర్ఎస్ పై ఒంటికాలిమీద లేచిన బండి సంజయ్ కు.. ఇప్పుడు సొంత కుంపటిని సరిదిద్దుకునే పని పెట్టారని అంటున్నారు. మొత్తానికి కేటీఆర్ వ్యూహాత్మకంగా ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడంలో సఫలం అయ్యారని విశ్లేషిస్తున్నారు. మరి, ఈ పంచాయితీ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.