తెలంగాణ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ అయిన తరువాత కేటీఆర్ సమస్యలపై తొందరగా స్పందిస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా సమ్మె చేస్తామని ప్రకటించిన జూనియర్ డాక్టర్ల సమస్యను చిటికెలో పరిష్కరించారు. తమకు గతంలో ఇచ్చిన హామీలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు వెళ్తామని చెప్పడంతో కేటీఆర్ చురుకుగా వ్యవహరించారు. జూనియర్ డాక్టర్ల విషయంలో ట్విటర్ వేదికగా వారు కేటీఆర్ ను కోరడంతో సమ్మె చేయొద్దని చెప్పి సమస్య పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రవర్తించారు.
విధులు బహిష్కరిస్తే..
జూనియర్ డాక్టర్లు సమ్మె పేరుతో విధులు బహిష్కరిస్తే ఈ క్లిష్ట సమయంలో చాలా కష్టం. అందుకే కేటీఆర్ స్పందించి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేశారు. హౌస్ సర్జన్, పీజీల స్టైఫండ్ 15 శాతం పెంచాలని కేసీఆర్ హెల్త్ సెక్రటరీకి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జీవో విడుదల చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
గత ఏడాది సమ్మెతో..
జూనియర్ డాక్టర్లు గత ఏడాది జరిపిన మెరుపు సమ్మెతో నష్టం పెద్ద మొత్తంలో జరిగింది. దీంతో ఆ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్ల సాధన కోసం పాటుపడతామని హామీ ఇచ్చి దాని అమలుకు నిర్ణయం తీసుకున్నారు. యాక్టింగ్ సీఎంగా కేటీఆర్ చొరవ బాగుందని జూనియర్ డాక్టర్లు కొనియాడారు. ఆయన స్పందించిన తీరుకు ట్విటర్ వేదికగా తమ ప్రశంసలు కురిపించారు. రాష్ర్టంలో కేటీఆర్ లాంటి నాయకులు ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో తిరుగులేని నాయకుడు అవుతారని కీర్తించారు.
ప్రశంసల వెల్లువ
జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించిన కేటీఆర్ కు ప్రశంసల జల్లు కురుస్తోంది. పరిపాలనలో తనదైన శైలిలో స్పందిస్తున్నారని తెలిపారు. ఆయన చొరవతోనే సమ్మె జరగకుండా అయిందని లేకపోతే సమ్మె చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉండేవన్నారు. కరోనా కాలంలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తే పరిణామాలు మరోలా ఉండేవని పోస్టులు చేశారు. కేటీఆర్ నైపుణ్యంపై అందరూ వేనోళ్ల పొగిడారు.