
KTR Etela : తెలంగాణలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా హుజురాబాద్(Huzurabad) నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారుతుందనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ‘పవర్’ కీలకంగా పని చేయబోతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నిక ఎక్కడ జరిగినా అది అధికార పార్టీకే అనుకూలంగా ఫలితం వస్తుంది. కొన్ని ప్రత్యేక కారణాల్లో మినహా దాదాపు ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికలన్నింటిలోనూ ఇదే రిజల్ట్ వచ్చింది.
టీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కొత్తేమీ కాదు. ఉద్యమ సమయంలో నేతలు రాజీనామాలు చేసి ఎన్నికలు వెళ్లి గెలిచిన ఘటనలు అనేకం ఉన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్సే ఉప ఎన్నికల్లో సత్తాచాటుతూ వస్తోంది. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం టీఆర్ఎస్ కు వ్యతిరేక ఫలితం వచ్చింది. అయితే ఆ వెంటనే వచ్చిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ మళ్లీ సత్తాచాటింది. ఇక త్వరలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగబోతున్న నేపథ్యంలో అందరిచూపు ఇక్కడే కేంద్రీకృతమైంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajendar) రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. సీఎం కేసీఆర్(kcr) ను ధిక్కరిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ ఇక్కడ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఎన్నిక ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారిపోయింది. హుజూరాబాద్లో ఈటలవర్గం బలంగా ఉండటంతో ఆయన గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలను అన్నీ తానై పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఈటలకు గెలుపు అంతా ఈజీ కాదనే మాటలు విన్పిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ సైతం హుజూరాబాద్లో నిధుల వరద పారిస్తున్నారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్టును ఇక్కడి నుంచే ప్రారంభించారు. దళితులకు 10లక్షల పేరిట స్కీము పెట్టి గంపగుత్తగా ఎస్సీ ఓట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారు. రేషన్ కార్డులు, ఆసరా ఫించన్లు, గొర్రెల పంపిణీ ఇలా అడిగిన వారికి లేదనకుండా ఏదో ఒక లబ్ధిని చేకూరుస్తున్నారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ నేతలు, కార్యకర్తల విస్కృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ‘హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నది.. దానిని పట్టించుకోవాల్సిన పనిలేదు.. దాన్ని లైట్ తీసుకుందామంటూ’ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నిజంగా హుజూరాబాద్ ను లైట్ తీసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ హుజూరాబాద్లోనే ఎందుకు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్థికమంత్రి హరీష్ రావు హుజూరాబాద్లోని ఎందుకు తిష్టవేశారని సందేహాలు కలుగకమానదు. ఇదంతా ఈటల మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టే ప్లాన్ అని.. ఈటలను డిఫెన్స్ లో పడవేసి నీరుగార్చే ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు.
హుజూరాబాద్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో కేటీఆర్(KTR) ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ ఈ స్థానంలో ఓడిపోయినా ఆ ప్రభావం పార్టీ శ్రేణులపై పడకుండా ముందు జాగ్రత్తగానే కేటీఆర్ ఇలా మాట్లాడి ఉంటారని అర్థమవుతోంది. ముందగానే గెలుపొటములపై కార్యకర్తలకు ఓ క్లారిటీ ఇవ్వడం ద్వారా వారిలో నిరుత్సాహం అవరించకుండా చేయాలని కేటీఆర్ భావించినట్లు కన్పిస్తోంది.
బీజేపీకితోడుగా కాంగ్రెస్ సైతం హుజురాబాద్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీస్తుండటం ఇక్కడ గెలుపు ఏ పార్టీకి ఏకపక్షంగా ఉండబోదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ క్యాడర్ దృష్టి మరల్చేందుకు కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి కేటీఆర్ చెబుతున్నట్లుగా హుజురాబాద్ ఉప ఎన్నిక లైట్ తీసుకునే పరిస్థితులు అక్కడ లేవని మాత్రం అర్థమవుతోంది.