KTR – Jagan : పేరుకు ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ… కార్పొరేట్ కంపెనీలు లేకుంటే, అవి పెట్టే పెట్టుబడులు లేకుంటే ప్రభుత్వాలు మనుగడ సాగించలేదు. అందుకోసమే కంపెనీలకు ధారాళంగా రాయితీలు ఇస్తుంటాయి. ఇక గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారుల వద్దకే ప్రభుత్వాధినేతలు వెళ్తున్నారు. ” బ్బా బ్బా బూ” అంటూ బతిమిలాడుతూ దేశానికి రప్పిస్తున్నారు. ఇందులో ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అని తేడా లేదు. కాకపోతే సరైన నాయకుడు, మంత్రి ఉన్న రాష్ట్రాలు విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఇలాంటి పెట్టుబడులకు సంబంధించే ప్రతి ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారులు వెళ్తుంటారు.. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రతిసారి వెళుతూ ఉంటారు. ఈ ఏడాది కూడా వెళ్తున్నారు. ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ – 2023లో కేటీఆర్ పాల్గొనున్నారు.. 2018లో మొదటిసారి ఐటి శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ దావోస్ వెళ్లారు.. ఇక అప్పటినుంచి ఆయన ప్రతిసారి వెళ్తూనే ఉన్నారు.. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచే ప్రపంచంలో టాప్ కంపెనీల సీఈవోలు తెలంగాణకు వస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాకుండా కేటీఆర్ ప్రత్యేకంగా వారిని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు..

గత ఏడాది కోవిడ్ కారణంగా జనవరిలో జరగాల్సిన సమావేశాలు కాస్త ఆలస్యం అయ్యాయి.. ఈసారి మాత్రం జనవరిలోనే జరుగుతున్నాయి.. గత ఏడాది మేలో జరిగిన సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా హాజరయ్యారు.. అక్కడ హంగు ఆర్భాటాన్ని ప్రదర్శించారు.. అక్కడి నుంచి వేలకోట్ల పెట్టుబడి తెచ్చామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అయితే అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడుగా ఉండి జైల్లో శిక్ష అనుభవిస్తున్న శరత్ రెడ్డి వంటి వారితోనే ఒప్పందాలు చేసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ పెట్టుబడిదారులకు ఉన్న అవకాశాలను వివరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు లేకపోలేదు.. ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు అక్కడ సమాధానం చెప్పలేకపోయారు.. అదే కేటీఆర్ మాత్రం అనర్గళంగా ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భారీగా ప్రమోట్ చేసుకున్నారు.
గత ఏడాది ఎదురైన చేదు అనుభవాలతో జగన్మోహన్ రెడ్డి ఈసారి స్విట్జర్లాండ్ ఆలోచన చేయడం లేదని సమాచారం.. దీన్ని కవర్ చేసుకునేందుకు త్వరలోనే విశాఖలో భారీ ఇన్వెస్టర్ల నిర్వహిస్తున్నామని వైసిపి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలోనే దావోస్ వెళ్లి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే విశాఖపట్నం సమ్మిట్ కు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది.. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు ఒక స్పష్టత లేకుండా పోయింది. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి సరైన సమాధానం చెప్పలేకపోవడంతో దావోస్ లో ఆంధ్రప్రదేశ్ అభాసుపాలైంది.. వేల కోట్లు పెట్టుబడి తెచ్చామని ప్రభుత్వం చెప్పుకున్నా.. ఒక రూపాయి కూడా వచ్చిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.. పవన్ కళ్యాణ్ ను పెట్టడంలో పోటీపడే మంత్రులు… ఇలాంటి విషయాల్లో మాత్రం నోరు మెదపరు. ఎందుకంటే వారికి సబ్జెక్ట్ నాలెడ్జి లేదు కనుక…