KTR, KCR Presidential elections : కేంద్రంలోని బీజేపీతో చెడింది.. ఇప్పుడా పార్టీతో నువ్వా నేనా అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ.. ఎట్టి పరిస్థితుల్లో ఎదగనీయకూడదని టీఆర్ఎస్.. మరోవైపు దేశ రాజకీయాలను దున్నేయడానికి రెడీ అయిన కేసీఆర్ .. ఈ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సంకుల సమరంలోనే రాష్ట్రపతి ఎన్నికలు ఊడిపడ్డాయి. దీంతో టీఆర్ఎస్ కక్కలేక మింగలేక ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేక సతమతమవుతోంది.
బీజేపీ ఇప్పటికే గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేసేసింది. ఆమె గెలుపు కోసం స్కెచ్ గీస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలన్నీ ఒకప్పటి బీజేపీ సీనియర్ నేతను నిలబెట్టాయి. దీంతో ఇటు బీజేపీతో కలవలేక.. కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్టు చేయలేక సతమతమైన టీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైనా కూడా కేంద్రంలోని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది.
తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రకటించారు. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలుకు టీఆర్ఎస్ పార్లమెంట్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ తరుఫున సంఘీభావం తెలిపి అనంతరం యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించినట్లు కేటీఆర్ తెలిపారు.
బీజేపీతో ఫైట్ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని కేటీఆర్ తెలివిగా సమర్థించుకోవడం విశేషం. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చేలా ఒక ప్రధాన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని.. కేంద్ర ప్రభుత్వం నియంతలా.. నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని.. మోడీ అన్యాయ, అప్రజాస్వామిక పరిపాలనను ఎదురించేందుకే యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నట్టు కేసీఆర్ కవర్ చేశారు.
అదే సమయంలో గిరిజన అభ్యర్థి ద్రౌపదిపై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదని కేటీఆర్ చెప్పుకురావడం విశేషం. మొత్తంగా అటు కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్టు చేయలేక.. ఇటు బీజేపీ అభ్యర్థిని తిరస్కరించడానికి కారణం వెతుక్కోలేక టీఆర్ఎస్ సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలవడానికి టీఆర్ఎస్ కు ధైర్యం చాలడం లేదు.