KTR: బీఆర్‌ఎస్ పార్టీ యువరాజు.. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి కావాలని ఆ పార్టీనేతలు కోరుకుంటున్న నేత కల్వకుంట్ల తారకరామారావు. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేస్తున్న ఆయన మొన్నటి వరకు ప్రజలకు కూడా రాష్ట్రానికి భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించాడు. ఉన్నత విద్యావంతుడుగా, నేర్పరితరం ఉన్న వ్యక్తిగా, విషయం ఏదైనా అనర్గళంగా మాట్లాడే పట్టు ఉన్న నేతగా, ఆపదలో ఉన్నామని ఒక్క ట్వీట్ చేస్తే ఆదుకునే ఆపన్న హస్తుడిగా భావించారు. కానీ, కొన్ని నెలలుగా కేటీఆర్ వ్యవహారం, ఆయనలోని అసహనం, నేతలను కించపర్చే మాటలు.. అధికారం కోసం, తెలంగాణకు తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో చేస్తున్న అసత్య ప్రచారంతో ఇన్నాళ్లూ అండగా నిలిచిన జనం క్రమంగా ఆయనకు దూరమవుతున్నారు. నాయకులుగా ఎదిగే క్రమంలో జనంలోనే ఉండేవాళ్లు కూడా క్రమేపీ ఆ జనానికి దూరమవుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఆ లిస్టులో చేరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

– అరెస్ట్‌లు లేకుండా సొంత నియోజకవర్గంలోనూ పర్యటించలేని పరిస్థితి..
కేటీఆర్‌ను తెలంగాణకు ముఖ్యమైన మంత్రిగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు తనగినట్లుగానే కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తనకు సంబంధం లేని శాఖలో కూడా జోక్యం చేసుకోవడం సర్వ సాధారణం. ఇక నిధుల కేటాయింపు విషయంలోనూ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు ఉన్న ప్రాధాన్యం రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేదన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం ఆయా నియోజకవర్గాలను ఏలుతున్న సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఐటీ మంత్రి కేటీఆర్‌కు కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలంతా బిల్లులు కడుతుంటే నిధులు మాత్రం మూడు నియోజకవర్గాల్లోనే ఖర్చు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. ఇక, తొమ్మిదేళ్ల పాలన లో విసిగిపోయిన జనం తమ నియోజకవర్గాలకు వస్తున్న బీఆర్‌ఎస్ మంత్రులకు ఎదురు తిరుగుతున్నారు. నిలదీస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కొడుకు అయిన కేటీఆర్ కూడా అందరి మంత్రుళ్లా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తన సొంత నియోజవర్గం సిరిసిల్లలో కూడా విపక్ష నేతలను, నిరసన కారులను పోలీసులతో అరెస్ట్ చేయించకుండా పర్యటించలేని పరిస్థితికి వచ్చాడు.
– ఎక్కడికి వెళ్లినా అరెస్టులే..
కేటీఆర్ జిల్లాలకు వెళ్తుంటే ఎవరూ నిరసనలు తెలపకుండా పోలీసులు విపక్ష నేతలను, సంఘాల ప్రతినిధులను , అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కరీంనగర్, హనుమకొండ జిల్లాల పర్యటన సందర్భంగానూ అరెస్టులు జరుగుతున్నాయి. మంగళవారం ఆయన పర్యటన ఉండగా హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతల్లో విపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని అనుమానంతో కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావు సహా ఐదుగురిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. తనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచడం పట్ల రోహిత్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ అరెస్టు చేయొచ్చు కానీ భవిష్యత్తులో కేటీఆర్‌ను అడ్డుకొని తీరుతామంటూ హెచ్చరించారు. మరోవైపు వీణవంక మండలంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కరీంనగర్ లో టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ ను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హనుమకొండలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నిస్తూ ఆందోళన చేయడానికి సిద్ధమైన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

– కేంద్రంపై ఒకవేలు చూపితే..
తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టే నిధులతో తమ మూడు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటున్న త్రిమూర్తులు.. కేంద్రాన్ని మాత్రం వేలెత్తి చూపిస్తున్నారు. తెలంగాణ నుంచి రూ.3 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చామని, రాష్ట్రానికి మాత్రం కేంద్రం రూ.1.6 లక్షల కోట్లే ఇచ్చిందని ఈ త్రిమూర్తులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. ఒక వేలు కేంద్రం వైపు చూపిస్తున్న ఈ నేతలకు మిగతా నాలుగు వేళ్తు తమనే చూపిస్తున్నాయన్న విషయం తెలియంది కాదు. కాకపోతే తామే పాలకులం తమను ఎవరు అడిగేదని మిగతా జిల్లాల నిధులను కూడా తరలించుకుపోతున్నారన్న భావన తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ప్రజలో ఏర్పడుతోంది. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలలోనూ ఈ భావన ఉంది. కాకపోతే ప్రశ్నించే ధైర్యం వారిలో లేదు. కానీ ఓటర్లు, జనం అలాకాదు.. వారికి ఓటు అనే ఆయుధం ఉంది. ఎన్నికల్లో వాటికి సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
విపక్ష నేతలు అయినా, ప్రజలైనా మంత్రులు తమ నియోజకవర్గానికి వస్తున్నారంటే తమ కష్టాలు చెప్పుకోవలని చూసేవారు. ఇదంతా తెలంగాణ ఆవిర్భావానికి ముందు. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో మంత్రులను కలిసే పరిస్థితి లేదు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ గేటు ఎదుట నిలబడే అర్హత కూడా కోల్పోయారు.. కాదు కాదు హరించారు పాలకులు. జనాలను దూరం చేసుకుంటున్న నేతలను వచ్చే ఎన్నికల్లోల జనమే దూరం పెట్టే పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి.