తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా యువ నేత కేటీఆర్ హవా కనిపించేది. ప్రతీ ఎన్నికను ఆయన ముందుండి నడిపించే వారు. అయితే.. ఉద్యమం ఊపు ఉన్నన్ని రోజులు కేటీఆర్ ఎలా చెబితే ప్రజలు దానినే నమ్మారు. ఆవేశ ఉపన్యాసాలతో ఓటర్లను చైతన్యవంతులను చేశారు. అదే ఊపుతో విజయాలు సాధించుకొచ్చారు. ఇది మొన్నటివరకు జరిగిన ముచ్చట. కానీ.. ఇప్పుడు అంతా రివర్స్. ప్రజల్లో ఏదో తెలియని చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఉద్యమ సెంటిమెంట్‌ను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అందుకే.. ఆచితూచి ఆలోచిస్తూ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓ చర్చ జోరుగా నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి కేటీఆర్ పాత్ర నామమాత్రమైందట. దుబ్బాక మెదక్ జిల్లాలో ఉండడం..ఆ జిల్లా బాధ్యతలు ముందు నుంచి హరీష్ రావు చూస్తుండడంతో దుబ్బాకకు కేటీఆర్ దూరంగా ఉన్నారనుకున్నా.. గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ ఆయనే అన్నీ తానై వ్యవహరించారు. అయితే.. ఈ రెండు ఎన్నికల్లోనూ ఫలితం కారు పార్టీకి అనుకూలంగా రాలేదు. పైగా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ప్రచారం ప్రారంభమయ్యాక టీఆర్ఎస్ గ్రాఫ్ ఎంతో కొంత తగ్గుతూ వస్తోంది.
అందుకే.. పార్టీ పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేసీఆర్ వ్యూహాలు పన్నితే.. ఏ ఎన్నికలో అయినా గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. అందుకే.. ఆయన సునాయసంగా ఒకటి అనుకున్న చోట రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకొచ్చారు. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక జరగబోతోంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటికే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీలు హోరాహోరీ ప్రచారం నడిపిస్తున్నాయి. ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరింది. దుబ్బాక, గ్రేటర్ దెబ్బతో ఉన్న టీఆర్ఎస్‌కు సాగర్‌లో గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో మండలాలు, గ్రామాల వారీగా పార్టీ కీలక నేతలకు కేసీఆరే స్వయంగా బాధ్యతలు అప్పగించారు.
అంతేకాదు.. కులాల వారీగా ఓట్ల సమీకరణ చేయడమే కాకుండా కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. ఈ పోరులో మొత్తంగా చూస్తే కేటీఆర్ హవా ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్ షోలు మాత్రం చేస్తున్నారు. అంతకు మించి వ్యూహరచన మాత్రం చేయడం లేదు. ఎన్నికల వ్యూహాలు అన్ని పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచార రంగంలోకి తాను కూడా స్వయంగా దిగుతున్నారు. ఈ నెల 14న హాలియాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతుండడంతో కేటీఆర్ రోడ్ షోలు రద్దయినట్టు పార్టీ నుంచి అధికార ప్రకటన రావడంతో పార్టీ వర్గాలు సైతం షాక్ తిన్నాయి. ఇంత హోరాహోరీ పోరులోనూ సాగర్‌లో కేటీఆర్ హవా ఏమాత్రం లేకుండా పోయింది.