BRS MLAs List: ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలుగా వారంతా నియోజకవర్గాల్లో సామంత రాజులుగా పెత్తనం చెలాయించారు. ఇసుక నుంచి మద్యం దాకా అన్నింట్లో తమ వాటా తాము దక్కించుకున్నారు. ఇలా ఐదేళ్లు ఏకఛత్రాధిపత్యంగా అధికారాన్ని అనుభవించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మరో మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత బీ పామ్‌లు, ఎన్నికలు షరా మామూలే. అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల్లో టిక్కెటే ముఖ్యం. అయితే అధికార భారత రాష్ట్ర సమితిలో చాలా మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఒకటే రంది. ఒకటే వేదన. టిక్కెట్ వస్తుందో రాదోననే టెన్షన్. ఇప్పటికే ప్రగతి భవన్ లీకుల మీద లీకులు ఇస్తోంది. ఆ లీకుల్లో తమ పేర్లు కానరాకపోవడంతో ఆ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
అభ్యర్థులు మారడం ఖాయం
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కొన్ని చోట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థులు మారడం ఖాయమైంది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు మళ్లీ టికెట్ ఇవ్వకూడదని పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చింది. అక్కడి నుంచి కడియాన్ని బరిలోకి దింపనుంది. అలాగే జనగాం, ఉప్పల్, ఖానాపూర్, వేములవాడ, వైరా, సాగర్, రామగుండం, కల్వకుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆశావాహులంతా డీలా
ఇక పార్టీలో మొదట్నించి ఉండీ, మళ్లీ సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామన్న అధిష్ఠానం సంకేతాలతో ఆశావాహులంతా డీలా పడిపోయారు. అధిష్ఠానం పెద్దలను కలుసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా అందుబాటులో లేకుండా అమెరికాకు వెళ్లిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం అసంభవం. కనీసం కేటీఆర్‌ను అయినాకలసి తమ గోడును వెళ్లబోసుకుందామంటే ఆయన కూడా కలవని పరిస్థితి ఉందని ఓ సీనియర్ నేత, ఆశావాహుడు వాపోయారు. ఇలాంటి సమయంలో పెద్ద సారు అపాయింట్‌మెంట్ ఇస్తలేడు. అస్సలు కనికరిస్త లేడు. చిన్న సారు పత్తకు లేడని బీఆర్‌ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.