Komatireddy Rajgopal Reddy Resigned : మునుగోడు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు బయటపడ్డారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలోకి వెళ్లేందుకు తటపటాయిస్తూ 15 రోజుల గడువు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డిపై చాలా మంది సెటైర్లు వేశారు. ఆయన రాజీనామా చేయడని.. ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదని చాలా మంది అవహేళన చేశారు. ఇక నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డి గెలిచే ఛాన్స్ లేదని నివేదికలు బయటపడడంతో ఆయన రాజీనామా చేయరని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పడేశారు.
బయట తనపై జరుగుతున్న అవహేళనను, కుట్రలను అన్నీ చూస్తున్నానని.. తాను రాజీనామా చేయనని అందరూ ఎద్దేవా చేశారని..కానీ వారందరికీ సమాధానం చెప్పడం కోసమే.. తన మునుగోడు ప్రజల కోరిక మేరకు.. రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్, టీవీ ఇంటర్వ్యూలలో తప్పుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాపై చర్చ పక్కదారి పట్టించారని ఆవేదన చెందారు. గడిచిన మూడేళ్లుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని అన్నారని విష ప్రచారం చేశారని.. తానేంటో నిరూపించుకోవాలనే ఈ రాజీనామా చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు.
రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు. ఈ మేరకు తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెరతీశారు. దీంతో మరోసారి తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో వార్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సెమీఫైనల్ లాంటి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు హోరాహోరీ పోరాడడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే టీఆర్ఎస్ హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ చేతిలో చావుదెబ్బ తిన్నది. హుజూరాబాద్ లో అయితే మాజీ టీఆర్ఎస్ ఉద్యమ సహచరుడినే ఓడించలేక చతికిలపడింది. దుబ్బాకలోనే ఒకప్పటి టీఆర్ఎస్ నేతనే ఓడించలేకపోయింది. ఈ రెండు ఓటములు తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండికొట్టాయి. బీజేపీకి ఊపిరి లూదాయి. ఇప్పుడు మునుగోడు కూడా పోతే.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక టీఆర్ఎస్ కు ఈ మునుగోడు ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా చెప్పకతప్పదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి ముందస్తు సంకేతంగా చెప్పొచ్చు. బీజేపీ కనుక గెలిస్తే వచ్చేసారి కమలం పార్టీదే విజయం అని ఖాయమవుతుంది. అందుకే ఈ రెండు పార్టీలు తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించనున్నాయి. ఓ రకంగా తెలంగాణలో వచ్చేది ఎవరి అధికారం అన్నది ఈ ఉప ఎన్నిక నిగ్గుతేల్చనుంది.
టీఆర్ఎస్, బీజేపీ కథ ఇలా ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకే. మునుగోడు కాంగ్రెస్ సీటునే . కానీ ఈ ఉప ఎన్నిక వస్తుంటే కాంగ్రెస్ అసలు పోటీలోనే ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు కోమటిరెడ్డి చేరబోతున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండగా.. టీఆర్ఎస్ అధికారంలో ఉండి అత్యంత బలంగా ఉంది. ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మధ్యలో కాంగ్రెస్ యే ఎటూ కాకుండా పోయింది.
కాంగ్రెస్ పార్టీ గడిచిన నాలుగు ఉప ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడించింది. ఏకంగా ఉత్తమ్ రాజీనామా చేసిన ‘హుజూర్ నగర్’ సీటును టీఆర్ఎస్ కు కోల్పోయింది. నాగార్జున సాగర్ లో ‘జానారెడ్డి’ లాంటి సీనియర్ ఓడిపోయారు. హుజూరాబాద్, దుబ్బాకలో అసలు పత్తాకే లేకుండా పోయింది.దీంతో మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీకి చెలగాటంగా ఉంటే.. కాంగ్రెస్ కు మాత్రం ప్రాణసంకటంగా మారింది. మరి ఈ జీవన్మరణ పోరులో కాంగ్రెస్ ఉనికి నిలుపుకుంటుందా? టీఆర్ఎస్, బీజేపీలలో ఎవరిది విజయం అన్నది ఉత్కంఠగా మారింది. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే రాబోయే తెలంగాణను పాలించేది అని ఓ అంచనాకు రావచ్చు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి చూస్తుంటే మునుగోడులో టీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తోంది. కోమటిరెడ్డిపై మునుగోడులో వ్యతిరేకత ఉందని.. ఆయన గెలుపుపై సందేహాలున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే బీజేపీలో చేరడంతో కాస్త జోష్ నెలకొంది. టీఆర్ఎస్, వర్సెస్ బీజేపీ హోరాహోరీ ఖాయమంటున్నారు.