Komatireddy Rajagopal Reddy- KCR: మునుగోడు ఉప ఎన్నిక ముగిసినా బిజెపి, టిఆర్ఎస్ మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మునుగోడు ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించారు. టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థలను మొత్తం తన ఆధీనంలో పెట్టుకొని గెలిచిందని, సాంకేతికంగా గెలుపు తనదేనని ఆయన కుండబద్దలు కొట్టారు. 2023 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గానికి ఇంతమంది నాయకులను తీసుకు రాగలరా అని సవాల్ విసిరారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను యధావిధిగా డైరెక్ట్ స్పీచ్ లో ఇస్తున్నాం. పాఠకులు గమనించగలరు.

కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడి లక్షల కోట్లు దోచుకుంటున్నది. మీడియాను మొత్తం మేనేజ్ చేసింది. బిజెపి ని ఎదుర్కొనే దమ్ము లేక ఎన్నికల ముందు ఎమ్మెల్యేల కొనుగోలు నాటకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టిఆర్ఎస్లోకి వెళ్లిన వారే. అలాంటి వారిని బిజెపి ఎందుకు కొనుగోలు చేస్తుంది? వారి వల్ల మా పార్టీకి ఏంటి ఉపయోగం?
రేవంత్ రెడ్డి చంద్రబాబు సంకలో పిల్లి
రేవంత్ రెడ్డి అనేవాడు అనేక కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడు. అలాంటివాడు కర్మకొద్దీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. అలాంటి వాడి కింద ఎలా పని చేయమంటారు? మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే పార్టీని కచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చేవాళ్లం. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడం నాకు ఇష్టం లేదు.. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాను.

కెసిఆర్ పాస్పోర్టుల దొంగ
ఎన్నికల ముందు నాకు 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని టీఆర్ఎస్ వాళ్లు దుష్ప్రచారం చేశారు. గోడల మీద రకరకాల పోస్టర్లు అంటించారు. ఇంకా చేస్తే వారికి వచ్చింది కేవలం పదివేల ఓట్ల మెజారిటీ. నైతికంగా గెలుపు నాదే. మహా అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక సంవత్సరం పాటు ఎమ్మెల్యేగా ఉంటాడు. ఆ తర్వాత మునుగోడులో గెలిచేది నేనే. పాస్పోర్ట్ కేసుల్లో నిందితుడైన కేసీఆర్ నాకు 18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందని చెప్పడం పచ్చి అబద్ధం. ప్రాణాలు పోయినా పర్వాలేదు కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించడమే నా ముందున్న కర్తవ్యం. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తా. మునుగోడులో ఇక ముందు జరగబోయేది ధర్మ యుద్ధమే. మీడియా మొత్తం ఆయనకు వంత పాడుతోంది.. అయినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు.. ధైర్యంగా ముందడుగు వేస్తాను. ప్రజాబలంతో ఎమ్మెల్యేగా గెలిచి కెసిఆర్ కుటుంబాన్ని ఢీకొంటాను.