https://oktelugu.com/

ఒవైసీ సెక్యులరిజాన్ని గురించి తెలుసుకుందాం

ఇటీవల ముఖ్యంగా బీహార్ ఎన్నికల తర్వాత ఒవైసీ పేరు ప్రతిరోజూ పత్రికల్లో,చానళ్లలో వస్తుంది. ఆయన బీహార్ ఎన్నికల్లో గ్రాండ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పడి పోటీ చేసాడు. ఒవైసీ ఫేవరైట్ స్లోగన్ ‘సెక్యులరిజం,డెమోక్రసీ,రాజ్యాంగం’. వీటి పరిరక్షణకే తను పాటుపడుతున్నట్టు పదేపదే వల్లె వేస్తూ ఉంటాడు. నిజంగా మనసా,వాచా అలా నమ్ముతున్నాడా? అసలు ఆయన పార్టీ మజ్లీస్ సెక్యులరిజాన్ని పరిరక్షించటానికి కట్టుబడి వుందా? వీటిని స్థూలంగా పరిశీలిద్దాం. మజ్లీస్ చరిత్ర  1926లో దీని పుట్టుక. నిజాం సంస్థానానికి […]

Written By:
  • Ram
  • , Updated On : November 20, 2020 / 09:18 AM IST
    Follow us on

    ఇటీవల ముఖ్యంగా బీహార్ ఎన్నికల తర్వాత ఒవైసీ పేరు ప్రతిరోజూ పత్రికల్లో,చానళ్లలో వస్తుంది. ఆయన బీహార్ ఎన్నికల్లో గ్రాండ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఏర్పడి పోటీ చేసాడు. ఒవైసీ ఫేవరైట్ స్లోగన్ ‘సెక్యులరిజం,డెమోక్రసీ,రాజ్యాంగం’. వీటి పరిరక్షణకే తను పాటుపడుతున్నట్టు పదేపదే వల్లె వేస్తూ ఉంటాడు. నిజంగా మనసా,వాచా అలా నమ్ముతున్నాడా? అసలు ఆయన పార్టీ మజ్లీస్ సెక్యులరిజాన్ని పరిరక్షించటానికి కట్టుబడి వుందా? వీటిని స్థూలంగా పరిశీలిద్దాం.

    మజ్లీస్ చరిత్ర 

    1926లో దీని పుట్టుక. నిజాం సంస్థానానికి రక్షణగా వుండేది. దీనికి 1938లో నవాబ్ బహదూర్ యార్ జంగ్ అధ్యక్షుడయ్యాడు. ఆయన దీనికి సిద్ధాంత పునాదిని పటిష్టం చేసాడు. అసలు దీని ఉద్దేశం ఆసఫ్ జాహి వంశాన్ని పరిరక్షించటానికి కాదని ఇస్లాం సామ్రాజ్యాన్ని తిరుగులేని రాజ్యంగా తయారుచేయటానికని చెప్పాడు. ఇస్లాం  ఎప్పటికీ పాలక రాజ్యంగా వుండాలని సెలవిచ్చాడు. 85 శాతం పైన వున్న హిందువులు ఎప్పుడూ పాలించబడే వాళ్ళేనని చెప్పాడు. దేశ విభజన కోరుకున్న మహామ్మదాలి జిన్నాతో,ముస్లిం లీగ్ తో సత్సంబంధాలు కొనసాగించాడు. 1944లో తను అర్ధంతరంగా చనిపోయిన తర్వాత 1946లో దీనికి ఖాసిం రజ్వి అధ్యక్షుడయ్యాడు. ఈయన హయాంలో ఈ పైత్యం పరాకాష్టకు చేరింది. నిజాం నవాబ్ కనుసన్నలలోనే రజాకార్ల పేరుతో పారామిలిటరీని ఏర్పాటుచేశారు. దీనిపనల్లా హిందువుల్ని భయభ్రాంతుల్ని చేయటం, హిందూ గ్రామాలపైబడి దోచుకోవటం, స్త్రీలను అత్యాచారం చేయటం, ఎదిరిస్తే చంపేయటం, నిజాం నవాబుకి వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదపకుండా చేయటం. నిజాం నవాబు అభద్రతాభావంతో చివరిదశలో ఈ సైన్యాన్ని ప్రోత్సహించాడు. వీళ్ళు చేయని అకృత్యాలు లేవు. వీరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు గ్రామాల్లో ఆత్మ రక్షక దళాల్ని ఏర్పాటుచేశారు. పట్టణాల్లో స్వామి రామానంద తీర్ధ నాయకత్వాన ఆర్యసమాజ్,కాంగ్రెస్ పార్టీలు పనిచేశాయి.

    నిజాం నవాబు సంస్థానాల విలీనం సందర్భంలో ముందుగా పాకిస్తాన్ తో కలవాలని ఓ ప్రయత్నం చేసాడు. కాని అది ఆచరణ సాధ్యం కాదని జిన్నానే చెప్పాడు. అయితే మజ్లీస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో హైదరాబాదు సంస్థానం     భారత్ లో కలిసేదిలేదని ఖరాఖండిగా చెప్పటమే కాకుండా భారత ప్రభుత్వం కనక దాడికి పూనుకుంటే తీవ్ర పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. లక్షమంది తో ఎదుర్కుంటామని, అవసరమయితే సౌదీ అరేబియా సహాయం తీసుకుంటామని కూడా ప్రకటించింది. చివరకు భారత ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ ని విమోచన చేసింది. ఎటువంటి చడీ చప్పుడు లేకుండా నిజాం నవాబు లొంగిపోయాడు. ఖాసిం రజ్వీని అరెస్టు చేసారు. మజ్లీస్ కార్యాలయం దారుల్ సలాంని స్వాధీనం చేసుకున్నారు. ఖాసిం రజ్వీ 1957 వరకు జైల్లో వున్నాడు. నెహ్రూ ప్రభుత్వం రజ్వి పాకిస్తాన్ వెళ్ళటానికి ఒప్పుకొని విడుదల చేసింది. తను వెళుతూ మజ్లీస్ ని అసదుద్దీన్ ఒవైసీ తాత అబ్దుల్ వాహెద్ ఒవైసీ కి అప్పజెప్పి వెళ్ళాడు. అప్పటినుంచి ఈరోజు వరకు మజ్లిస్ పార్టీ ఒవైసీ కుటుంబ పార్టీగానే నడుస్తుంది.

    మజ్లీస్ పార్టీ అఖిల భారత మజ్లీస్ గా మార్పు 

    అబ్దుల్ వాహెద్ ఒవైసీ 1958 లో పార్టీని అల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ గా మార్చాడు. కాని మేము పాత మజ్లీస్ వారసులమనే ఘనంగా చెప్పుకుంటున్నారు. అలాగే ఆ పార్టీ వెబ్ సైట్ లో కూడా వుంది. 1975 దాకా అబ్దుల్ వాహెద్ ఒవైసీ అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు సలాహుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడయ్యాడు. 2008 లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడయి ఇప్పటిదాకా కొనసాగుతున్నాడు. అంటే మజ్లీస్ పార్టీ అనేది ఒవైసీ కుటుంబ ఆస్తి లాగా మారింది. ఇదీ ఒవైసీ మార్కు ప్రజాస్వామ్యం. రెండోవైపు తెరాస కెసిఆర్ కుటుంబ ఆస్తి లాగా తయారయ్యింది. ఈరెండు కుటుంబాలు తెలంగాణను ఏలుతున్నాయి. 2008 లో అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షుడైన తర్వాత మజ్లీస్ రూపురేఖలు మారిపోయాయి. అప్పటివరకూ హైదరాబాద్ కే పరిమితమైన మజ్లీస్ పార్టీని ఇతర ప్రాంతాలకు విస్తరించాడు. స్వతహాగా విద్యావేత్త కావటం,లండన్ లో బారిస్టర్ చదవటం ఒవైసీకి కలిసొచ్చింది. ముందుగా వుమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు,ఆతర్వాత పాత హైదరాబాద్ సంస్థానంలోని మరాట్వాడ, హైదరాబాదు కర్ణాటక ప్రాంతానికి, ముంబాయ్ కి విస్తరించాడు. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో శాఖలు వున్నాయి. ఇటీవలే బీహార్ లో అయిదు శాసన సభ స్థానాలు గెలుచుకొని దేశవ్యాప్త ప్రాచుర్యం పొందాడు. అయినా ఇప్పటికీ కుటుంబ పార్టీగానే కొనసాగుతుంది. తను అఖిల భారత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుంటే , తమ్ముడు అక్బరుద్దీన్ తెలంగాణా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇంకో తమ్ముడు బుర్హనుద్దీన్ దారుల్ సలాం బ్యాంకును, ఉర్దూ పత్రిక ఎతిమాద్ ను నడుపుతున్నాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. అక్కడా బీహార్ రిపీట్ అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీకి ఆఫర్ ఇచ్చాడు. బిజెపిని నిరోధించటానికి కలిసిపోటీ చేయటానికి సిద్ధమని ప్రకటించాడు. ఇది వ్యూహాత్మక నిర్ణయం. ఇప్పుడు బంతి మమతా కోర్టులో వుంది. మొత్తం మీద భారత రాజకీయాల్లో ఇదో పెనుమార్పు. ముస్లింలు సెక్యులర్ పార్టీలుగా పిలవబడే పార్టీలను పక్కకు పెట్టినట్లే కనబడుతుంది. ఇప్పటికే అస్సాంలో బద్రుద్దీన్ నాయకత్వంలో సమీకరించబడ్డారు. కేరళలో ఎప్పటినుంచో ప్రత్యేకంగా ముస్లిం లీగ్ కింద వున్నారు. కాశ్మీర్ లో ఎప్పుడూ వేరుగానే వున్నారు. ఇకమిగిలిందల్లా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. బీహార్ లో వచ్చిన మార్పుని చూసాం. పశ్చిమ బెంగాల్ లో త్వరలో జరగనున్న ఎన్నికలు అక్కడి సమీకరణాలను తెలుపుతాయి. ఇకమిగిలిందల్లా ఉత్తరప్రదేశ్. అక్కడా 2022 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించాడు. అంటే మొత్తం భారతదేశంలో ముస్లింలు ప్రత్యేక పార్టీగా మార్పు చెందుతున్నారు. దానికి దేశవ్యాప్త నాయకుడిగా అసదుద్దీన్ ఒవైసీ ఎదిగాడు.

    ఒవైసీ అభ్యుదయవాదా? ఆధునిక ప్రజాస్వామ్యవాదా?

    ఇది ఇప్పుడు దేశంలో నడుస్తున్న చర్చ. ఎందుకంటే ఆధునిక ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, చట్టబద్ద పరిపాలన గురించి తను మాట్లాడినంతగా మిగతా వాళ్ళెవ్వరూ మాట్లాడటంలేదు. అదేసమయంలో బిజెపికి వ్యతిరేకంగా,మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళలో తను ముందు వరసన ఉంటాడు. మోడీపై గుడ్డి వ్యతిరేకతతో అభ్యుదయవాదులుగా పిలిపించుకుంటున్న కొందరు మీడియా మిత్రులు ఒవైసీకి విపరీతమైన ప్రచారం కల్పించారు. ఒప్పుకుందాం, తను నిజంగా సెక్యులరిజాన్ని నమ్ముతున్నాడని అనుకుందాం. అయితే అది తన చర్యల్లో కనబడాలి కదా. మాటలు ఒక్కటే సరిపోదు.

    ఇప్పటికీ మజ్లీస్ పార్టీ గత చరిత్రను గుర్తుచేసుకుంటుంది, నవాబ్ బహదూర్ యార్ జంగ్ ని వాళ్ళ నాయకుడిగా కీర్తిస్తుంది. రజాకర్ల దౌర్జన్యాలను,అకృత్యాలను ఖండించిన పాపానపోలేదు. నిజాం నవాబు భారత్ లో విలీనం చేయకుండా స్వతంత్రంగా వుండాలనుకోవటాన్ని ఖండించలేదు. నిజాం పాలనలో జర్నలిస్టు సోయబుల్లాఖాన్ ని కేవలం భారత్ లో విలీనం కావాలని వ్యాసాలు రాసినందుకు నానా చిత్రహింసలు పెట్టి చంపటాన్ని తప్పుగా ఒప్పుకోవటంలేదు. ఇటీవలికాలంలో కొన్ని సంవత్సరాల క్రితం తస్లీమా నస్రీన్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడితే భౌతిక దాడి చేసారు. మరి వీళ్ళు చట్టబద్ధ పాలనను గౌరవిస్తున్నారని ఎలా అనుకోవాలి? ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ నిర్మల్ లో మీటింగ్ పెట్టి హిందూ దేవతలను దూషిస్తే కనీసం ఖండించలేదు. అదే ముస్లిం దేవుళ్ళను ఎవరైనా అంటే వాళ్ళపై జరిగే హింసనూ ఖండించలేదు. పార్టీని కుటుంబ ఆస్తి లాగా నడుపుతూ వస్తున్నాడు. మరి ఈ పెద్దమనిషిని అభ్యుదయ వాదిగా,ఆధునిక ప్రజాస్వామ్య విలువలను పాటించే వ్యక్తిగా ఎలా అనుకోవాలి?  నిజమైన సెక్యులర్ వాది అయితే అన్ని మతాలను సమభావంతో చూడాలి, నిజమైన ప్రజాస్వామ్యవాది అయితే అన్ని భావాలను సహించే గుణం వుండాలి. ఇస్లాం మతాన్ని విమర్శించిందని తస్లీమా నస్రీన్ ని బాధించరు. నిజమైన దేశభక్తియుత అభ్యుదయ వాది అయితే గత రక్తసిక్త చరిత్రను ఘన చరిత్రగా చూడరు. కేవలం మతగుర్తింపు రాజకీయాలతో లబ్ది పొందాలను కునేటప్పుడు ఈ హిపోక్రసీ ఎందుకు? సెక్యులరిస్టుగా,చట్టబద్ద పాలనను గౌరవించే వ్యక్తిగా,అన్ని భావాలను సహించే ప్రజాస్వామ్యవాదిగా ముసుగువేసుకున్న మతవాదిగానే అసదుద్దీన్ ఒవైసీ చరిత్ర కనబడుతుంది. అంటే కొత్త సీసాలో పాత సిరానే సుమా.