Kaleshwaram Project: కాళేశ్వరం ఎంక్వయిరీలో కీలక పరిణామం.. తెరపైకి మళ్లీ ఆయనే!

విజిలెన్స్‌ రిపోర్టు ఆధారంగా కేసీఆర్‌ను జైలుకు పంపేలా రేవంత్‌ పావులు కదుపుతున్నారు. ఈమేరకు న్యాయ నిపుణులు, సలహాదారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : January 30, 2024 12:54 pm
Follow us on

Kaleshwaram Project: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని ఎలాగైనా జైలుకు పంపాలన్న కసితో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తనను ఓటుకు నోటు కేసులో ఇరికించి తన కూతురు పెళ్లి కూడా చూడకుండా చేసిన కేసీఆర్‌పై రివేజ్‌ తీర్చుకునేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. వెతకబోయిన తీగ కాలిగి తగిలినట్లు కేసీఆర్‌ను ఎలా జైలుకు పంపాలా అని చూస్తున్న రేవంత్‌కు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆయుధంగా మారింది. ఈమేరకు ఆధారాల సేకరణలో ఉన్నారు. ఇందుకోసం విజిలెన్స్‌ ఎక్వయిరీ వేశారు. విజిలెన్స్‌ ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రూ.3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ఒక్క ఆధారంతో బొక్కలోకి..
విజిలెన్స్‌ రిపోర్టు ఆధారంగా కేసీఆర్‌ను జైలుకు పంపేలా రేవంత్‌ పావులు కదుపుతున్నారు. ఈమేరకు న్యాయ నిపుణులు, సలహాదారులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇంకా బలమైన ఆధారాల సేకరణకు ప్రయత్నిస్తున్నారు. అయితే విజిలెన్స్‌ ఎంత ప్రయత్నించినా మేడిగడ్డ కుంగుబాటుపై కొత్త ఆధారాలేవీ దొరకడం లేదు. ప్రకృతి వైపరీత్యం అనే అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన అధ్యయన కమిటీ కూడా నిర్వహణలోపం, నాణ్యత లోపం కారణాలుగా చూపుతోంది.

రంగంలోకి మురళీధర్‌రావు..
ఇలాంటి తరుణంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మేలుచేసేలా ఓ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ఇంజినీరింగ్‌ ఇన్‌చీఫ్‌గా ఉన్న మురళీధర్‌రావు ఆధ్వర్యంలోనే గతంలో డీపీఆర్, డిజైన్‌ రూపకల్పనపపాటు కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఆయననే తప్పించి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కానీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ మురళీధర్‌రావునే కాళేశ్వరం అధ్యయన కమిటీలో సభ్యుడిగా ప్రతిపాదించడం గమనార్హం. దొంగ చేతికే తాళం ఇచ్చిన చందంగా ఉందన్న చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌ కోసమేనా..
డిజైన్‌ లోపాలు, నిర్వహణ లోపాలు, ఎస్టిమేషన్‌ పెంపు, అదనపు బిల్లుల చెల్లింపులపై ఈఎన్‌సీ మురళీధర్‌రావునే విచారణ చేయాల్సి ఉండగా, ఆయన మాత్రం కేసీఆర్‌ చెప్పినట్లు చేశామని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో రేవంత్‌ వేసిన అధ్యయన కమిటీలోకి అదే మురళీధర్‌రావును సభ్యుడిగా ప్రతిపాదించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రతిపాదన చేశారన్న చర్చ జరుగుతోంది. మరి రేవంత్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.