Kesineni Nani
Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశి నేని నాని వైఖరి టిడిపికి మింగుడు పడడం లేదు. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీకి ఆంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లాలో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. యాత్రను అన్నీ తానై నడిపించాల్సి ఉండగా.. ముఖం చాటేశారు. ఒక్కరోజు కూడా యాత్రలో పాల్గొన్న దాఖలాలు లేవు. కనీసం లోకేష్ గురించి కానీ.. యువగళం గురించి కానీ ఎక్కడ ప్రస్తావించడం లేదు. పైగా యాత్ర జరుగుతుండగానే.. పోటీగా కొన్ని కార్యక్రమాలను నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది.
కేశినేని నాని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ మారేందుకు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాది కాలంగా అనేక రూమర్లు వచ్చాయి. కృష్ణా జిల్లాలోని మిగతా టిడిపి నాయకులతో నానికి విభేదాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో నానిని పక్కన పెట్టి ఆయన సోదరుడు చిన్నికి ఎంపీ అభ్యర్థిగా నిలబెడతారని ప్రచారం జరుగుతోంది.దీనిపై నాని ఘాటుగా స్పందించారు. పిట్టలదొరలను బరిలో దించితే సహకరించనని తేల్చేశారు. తనను తప్పించి తమ్ముడు చిన్నికి టిక్కెట్ ఇస్తే తన ప్రతాపం చూపిస్తానని కూడా హెచ్చరించారు. అయితే ఇదంతా లోకేష్ తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని నాని అనుమానిస్తున్నారు. అటువంటి నాయకుడు యాత్రకు తాను ఎందుకు వెళ్తానని అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
విజయవాడలో కొండపల్లి బొమ్మల తయారీ, విక్రయానికి సంబంధించి ఎంపీ నిధులతో ఒక భవనాన్ని నిర్మించారు. దానిని కేశినేని నాని ప్రారంభించారు. ఎక్కడా టిడిపి ముద్ర లేకుండా ఆహ్వాన పత్రికలు రూపొందించారు. ఈ తరుణంలో నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎక్కడా యువ గళం గురించి గానీ, లోకేష్ గురించి కానీ ప్రస్తావించకుండా వ్యాఖ్యానాలు చేశారు. ప్రజా ప్రయోగ కార్యక్రమం కావున.. కార్యక్రమానికిమీడియా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. యువ గళం పాదయాత్ర కంటే తాను చేసిన కార్యక్రమం గొప్పదని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఎంపీ కేశినేని నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అటు టిడిపి హై కమాండ్ కేశినేని నాని వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తోంది. వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. అయితే నాని అసంతృప్తా, ఆవేదన వెళ్లగక్కుతున్నారా? అలకపాన్పు ఎక్కారా? అన్నది తెలియాల్సి ఉంది. కేవలం లోకేష్ పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు విషయంలో సానుకూలంగానే కనిపిస్తున్నారు. అయితే ఆయన పార్టీలోనే కొనసాగుతారని.. ఆయన కుమార్తెకు ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది. అయితే అది ఎంతవరకు వాస్తవమో చూడాలి మరి. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహార శైలి కాస్తా భిన్నంగానే కనిపిస్తోంది.