KCR Wife Shobha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు విన్పించడం, ఈడీ చార్జ్‌షీట్‌లో పేరు ప్రస్తావించడం, ఒక సారి హైదరాబాద్, మరోసారి ఢిల్లీలో విచారించడంతో బీఆర్‌ఎస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. శనివారం అయితే కేసీఆర్ ఉదయం నుంచి రాత్రి దాకా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వాస్తవానికి ఆయన గత పది రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల మదనపడుతున్నారు. మరోవైపు కేసీఆర్ సతీమణి కూడా అస్వస్థతతో బాధపడుతున్నారని తెలుస్తోంది. మొన్న కవిత ఈడీ విచారణ అనంతరం నేరుగా ప్రగతి భవన్ వెళ్లడం, మరుసటి రోజే కేసీఆర్ కు అల్సర్ అని తేలడం, శోభ అస్వస్థతకు గురయినట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రగతి భవన్‌లో ఏం జరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వాంతి చేసుకున్నారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయన కడుపులో అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి ఆయన పదిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఆదివారం వాంతి చేసుకున్న నేపథ్యంలో సీఎంవో కార్యాలయం వైద్యులకు సమాచారం అందించగా.. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు నేతృత్వంలోని యశోద వైద్యుల బృందం ప్రగతి భవన్‌కు వెళ్లి పరీక్షలు చేసింది. ఈసందర్భంగా పదిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు సీఎం కేసీఆర్ వైద్యులకు తెలిపారు. గ్యాస్ట్రిక్ సమస్యగా నిర్ధారించిన వైద్యులు.. ఆయనకు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌కు సీటీస్కాన్‌తో పాటు ఎండోస్కోపీ నిర్వహించారు.
కేసీఆర్ కడుపులో చిన్నపాటి అల్సర్ ఉన్నట్లు గుర్తించారు. దాని కారణంగా ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తేల్చారు. వెంటనే ఇంజెక్షన్లు ఇచ్చారు, తర్వాత సీఎం కేసీఆర్‌ను పరిశీలనలో ఉంచారు. అదేసమయంలో ఆయనకు ఇతర సాధారణ పరీక్షలు కూడా చేశారు. బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో లాంటి టెస్టులు చేశారు. కాగా, సీఎం కేసీఆర్‌కు బీపీ, షుగర్ ఉన్నాయి. వాటికి మందులు వాడుతున్నారు. అవి పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉన్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇక అల్సర్‌కు నెల రోజుల పాటు మందులు వాడాలని వైద్యులు సూచించారు. అనంతరం మరోసారి ఎండోస్కోపీ చేస్తామని చెప్పారు. అలాగే ఈ నెల రోజులు సమయానికి భోజనం చేయాలని సీఎంకు సూచించారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇతర సమస్యలేమీ లేవని వైద్యవర్గాలు తెలిపాయి. అల్సర్లు రావడం సాధారణమేనని, పలురకాల అల్సర్లు వస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్‌కు వచ్చిన అల్సర్ కూడా సాధారణ ఆరోగ్య సమస్యేనని, మందు లు వాడితే తగ్గిపోతుందని చెబుతున్నారు. కాగా, సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు కేసీఆర్ సతీమణి శోభ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆమె అనారోగ్యం గురించి బయటకు చెప్పకపోయినా వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. కవితను శనివారం విచారించిన ఈడీ, మార్చి 16న మళ్లీ రావాలని పిలిచిన నేపథ్యంలో కేసీఆర్, శోభ దంపతులు వేదనకు గురయ్యారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ వారి ఆవేదన మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.