KCR Delhi Tour: ఉట్టికెగరనమ్మ స్వర్గానికెగిరిందట.. కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరతాడట అనేవి సామెతలు. ఇవి సీఎం కేసీఆర్ కు చక్కగా పనికొస్తాయి. ప్రస్తుతం కేసీఆర్ ఎక్కడ చూసినా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని తరిమికొడతామని పిలుపునిస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి తెలిసినా కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలను ప్రధానంగా చేసుకుని రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సందు దొరికితే చాలు ఢిల్లీ కేంద్రంగా తన గళం విప్పుతానని పదేపదే చెబుతున్నారు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలను ప్రభావితంచేస్తారా? ఆయనలో అంత సత్తా ఉందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే రీతిగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తానని చెప్పి చేతులు కాల్చుకున్న సంగతి తెలియదా? ఇదివరకు ఎంతో మంది కూడా జాతీయ రాజకీయాల్లో తమ పాత్ర ఉండాలని భావించినా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఢిల్లీలో చక్రం తిప్పేది ఉత్తరాది వారే కానీ దక్షిణాది వారికి ఆ అవకాశం రాలేదు. ఇన్ని సంవత్సరాల కాలంలో దక్షిణాది నుంచి ఇద్దరే ఇద్దరు పీఎంలు అయ్యారు. పీవీ నరసింహారావు, దేవెగౌడ మాత్రమే ప్రధానమంత్రులు కాగలిగారు.
Also Read: తిరుమల వెళ్లే వీఐపీలకు షాకిచ్చిన టీటీడీ..? ఈ గగ్గోలేంటి?
దేశ రాజకీయాల్లో ఉత్తరాది వారి పెత్తనమే ప్రధానంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. కానీ ప్రస్తుతం కేసీఆర్ మాత్రం దేశంలో బీజేపీని నామరూపాల్లేకుండా చేస్తానని శపథం పట్టారు. తగ్గేదేలే అని ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీ రాజకీయాలను టార్గెట్ చేసుకుని గల్లీలో అధికారం సాధించాలని ఆరాటపడుతున్నారనే వాదనలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎంత మేర విజయం సాధిస్తారో చూడాల్సిందే.
తన కొడుకుకు సీఎం పోస్టు ఇచ్చి ఇక తాను ఢిల్లీకే పరిమితం కావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ రాజకీయాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ బీజేపీ ప్రభావం పెరుగుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుండటంతో ఓర్వలేకే కేసీఆర్ ఇలాంటి పన్నాగానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కేసీఆర్ ప్రయత్నాలు అంత సులువుగా తీరవు. దానికి చాలా కసరత్తు కావాలి.
ఏవో రెండు మూడు పార్టీలు కలిసినంత మాత్రాన అధికారం రాదు. ఎన్డీయే పక్షాలను చీల్చితేనే బీజేపీ బలం తగ్గుతుంది. కానీ కేసీఆర్ యూపీఏ పక్షాలను విడగొడుతున్నారు. దీంతో పరోక్షంగా బీజేపీకి లాభం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. దీంతో కేసీఆర్ అసలు ఉద్దేశం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ క్రమంలో కొంత కాలం ఢిల్లీలో మకాం వేసి అక్కడి పార్టీలు, మేధావులను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మత విద్వేషాలు రెచ్చగొడుతున్న పార్టీలను బంగాళాఖాతంలో కలిపేస్తామని బీరాలు చెబుతున్నా కేసీఆర్ కు అంత సామర్థ్యం ఉందా? జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ నేత ఎదుర్కోగలడా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఏదిఏమైనా కేసీఆర్ మాత్రం పట్టుదలతో తాను అనుకున్నది చేస్తానని చెప్పడం కొసమెరుపు.
Also Read: మల్లన్నసాగర్ నిర్మాణంతో రైతుల కల నెరవేరుతుందా?