కెసిఆర్ గారు, తెలంగాణా విమోచనదినం వద్దా?

కెసిఆర్ గారి మాటలు తెలంగాణా ప్రజలు మరిచిపోలేదు. తెలంగాణా ఉద్యమంలో ఏమి చెప్పారు కెసిఆర్ గారు? సమైక్యాంధ్ర వాదులు హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని కూడా ఉత్సవంగా జరపకుండా తెలంగాణా కు ద్రోహం చేసారని చెప్పలేదా? తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమయితే మేము ఘనంగా తెలంగాణా విమోచన/విలీన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పలేదా? మరి ఇప్పుడు ఏ సమైక్యవాదులు అడ్డువచ్చారు కెసిఆర్ గారు? ఎందుకు సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణా అమరవీరుల స్మృత్యర్ధం గా […]

Written By: Ram, Updated On : September 17, 2020 10:56 am
Follow us on

కెసిఆర్ గారి మాటలు తెలంగాణా ప్రజలు మరిచిపోలేదు. తెలంగాణా ఉద్యమంలో ఏమి చెప్పారు కెసిఆర్ గారు? సమైక్యాంధ్ర వాదులు హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైన సెప్టెంబర్ 17వ తేదీని కూడా ఉత్సవంగా జరపకుండా తెలంగాణా కు ద్రోహం చేసారని చెప్పలేదా? తెలంగాణా ప్రత్యేక రాష్ట్రమయితే మేము ఘనంగా తెలంగాణా విమోచన/విలీన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పలేదా? మరి ఇప్పుడు ఏ సమైక్యవాదులు అడ్డువచ్చారు కెసిఆర్ గారు? ఎందుకు సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణా అమరవీరుల స్మృత్యర్ధం గా జరుపుకోలేకపోతున్నారో సెలవిస్తారా? చెప్పిన మాటలు అంత తొందరగా మరిచిపోతే ఎలా? ఇవేమీ దళితులకు మూడెకరాల హామీలు లాగా నిధులతో కూడుకున్నవి కాదుకదా? ప్రభుత్వం దగ్గర నిధులు లేవని సర్దిపుచ్చుకోవటానికి. ఇది తెలంగాణా ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది మాత్రమే.

ఒక్క పైసా ఖర్చు కాకుండా కేవలం ఒక జీఓ ఇస్తే సరిపోతుంది. ఎన్నోవేల బలిదానాలు శాంతిస్తాయి. వాళ్ళ కుటుంబాలు, వారసులు గర్వపడతారు. ఆగష్టు 15వ తేదీకి ఇదేమీ తీసి పోయింది కాదు కదా. దేశానికి ఆగష్టు 15 ఎట్లానో తెలంగాణా వాసులకు సెప్టెంబర్ 17 అంతేగదా. ఆ మాత్రం మీకు తెలియంది కాదు కదా. మరి దేనికి తాత్సారం? ఎందుకు ఈ మౌనం? ఇది మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజలకు అవమానం కాదా? ప్రతిదానికి తెలంగాణా అత్మగౌరవం పేరుతో కేంద్రం పై విరుచుకు పడే మీకు ఈ తెలంగాణా వారసత్వం గర్వకారణంగా లేదా? మీ మనసులో ఏముందో చెప్పండి సారూ.

చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ తెలంగాణా పోరాటం 

ఆ చరిత్ర తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. ఎక్కడనుంచి ఎక్కడ దాకా సామాజిక మార్పు. నీ బాంచను కాల్మొక్తా దగ్గర్నుంచి బండెనుక బండి కట్టి నిజాము సర్కోరాడా దాకా జరిగిన పోరాట క్రమం మాటల్లో వర్ణించలేము. పూర్తి భూస్వామ్య సమాజం నుంచి ఆధునిక చైతన్య సమాజం దాకా మారటానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డారో తెలియదా కెసిఆర్ గారు? తెలుగు భాషనే మాట్లాడే పరిస్థితి లేని చోట ఆంధ్ర మహాసభ ని పెట్టి భాషోద్యమం నుంచి మొదలై గ్రామ గ్రామాన సంఘం స్థాపించి జాగీర్దార్లు, దేశముఖ్ లకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరీ కి వ్యతిరేకంగా జరిపిన పోరాట క్రమం గుర్తుకు రాదా? మీరు పుస్తకాలు విపరీతంగా చదువుతారని ప్రచారం లో పెట్టారు కదా మరి ఈ పరిణామ క్రమం గుర్తుకు రావటం లేదా? చాకలి అయలమ్మ కు నివాళులు అర్పిస్తారు కానీ తెలంగాణా విమోచన దినోత్సవానికి అంగీకరించరా? ఇదెక్కడి వైపరీత్యం? తెలంగాణా ప్రజలు అమాయకులు కాబట్టి నోరు వాయా లేనివాళ్ళు కాబట్టి మీ కపట వైఖరిని సహిస్తున్నారు. మరెక్కడైనా అయితే ఈ పోరాటాన్ని ఆకాశానికెత్తే వాళ్ళు కదా? కేరళ లో ఇప్పటికీ పున్నప్ర వయలార్ రైతాంగ పోరాటాన్ని ఘనంగా జరుకుంటూనే వుంటారు కదా. నిజానికి దానితో పోలిస్తే మన పోరాటం చాలా పెద్దది కెసిఆర్ గారూ. కమ్యూనిస్టుల నాయకత్వాన దాదాపు పది లక్షల ఎకరాలు భూమిని పేదలకు పంచటం ఎక్కడైనా దేశం లో విన్నారా? అసలు దేశం లో భూ సంస్కరణలు ప్రభుత్వం ఓ అంశం గా ముందుకు తీసుకొచ్చిందే ఈ తెలంగాణా భూ పంపిణీ తర్వాతే గదా. దాన్ని మీరు ఘనంగా దేశం మొత్తం లో తెలంగాణా వారసత్వాన్ని గురించి ప్రచారం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మీరు మొన్న అసెంబ్లీ లో మాట్లాడుతూ తెలంగాణా లో 93 శాతం భూమి చిన్న, సన్నకారు రైతుల చేతిలో వుందని స్వయంగా చెప్పారు కదా. అలా కావటానికి ఈ తెలంగాణా పోరాటమే భూమిక కాదా?

అసలు హైదరాబాద్ లో ఏం జరిగిందో మీకు తెలియదా? నిజాం నవాబు 1947 ఆగష్టు 15వ తేదీన భారత్  లో విలీనం కావటానికి ఒప్పుకోకపోవటం అందరికీ తెలిసిందే కదా. తర్వాత పాకిస్తాన్ లో కలవటానికి జిన్నాతో మంతనాలు జరిపిందీ తెలిసిందే కదా. ఆ తర్వాత అదీ కుదరక పోతే స్వతంత్రం ప్రకటించుకోవటానికి పన్నాగం పన్నిందీ తెలియంది కాదు కదా. అందుకోసం రజాకార్ల తో మిలిటెంట్ సంస్థ ని ఏర్పాటు చేసి ముస్లిం లను హైదరాబాద్ లో రెచ్చగొట్టి తెలంగాణా లో గ్రామాలకు గ్రామాలు లూటీలు, దౌర్జన్యాలు, స్త్రీల పై అత్యాచారాలు లాంటి ఘోరమైన చర్యలు చేపట్టటం మరిచిపోయారా? హైదరాబాద్ లో, మిగతా చోట్ల భారత జాతీయ జెండా ఎగరవేస్తే నిర్బంధించటం, నానా హింసలు పెట్టటం తెలిసిందే కదా. మీ గుండె మీద చేయి వేసుకొని ఇవన్నీ జరగలేదని చెప్పగలరా?  ఒకవైపు కమ్యూనిస్టులు నిజాం వ్యతిరేక , భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేస్తే మరొకవైపు ఆర్య సమాజ్ నాయకత్వాన స్వతంత్ర పోరాటం జరగటం చరిత్రలో లిఖించబడింది కదా. అలాగే కాంగ్రెస్ కూడా తనదైన శైలి లో నిజాం వ్యతిరేక పోరాటం చేయటం కూడా వాస్తవమే కదా. చివరకు హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యం లో పోలీస్ యాక్షన్ చేసి హైదరాబాద్ ని విముక్తం చేయకపోతే హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమయ్యేదా? ఇవన్నీ వాస్తవాలయినప్పుడు ఇంతటి ఘన చరిత్రకలిగిన తెలంగాణా నిజాం వ్యతిరేక పోరాటం సెప్టెంబర్ 17వ తేదీన భారత సైన్యం హైదరాబాద్ లో ప్రవేశించటం, నిజాం నవాబు పటేల్ కి లొంగిపోవటం తో విజయవంతమయ్యింది. ఇది చరిత్రాత్మకమా కాదా?

ఎందుకు కెసిఆర్ తెలంగాణా విమోచన దినోత్సవాన్ని జరపటం లేదు?

ఇది ప్రతి ఒక్క తెలంగాణా పౌరుడు అడగాల్సిన ప్రశ్న. కొన్ని సందర్భాల్లో తెలంగాణా సాయుధ పోరాటాన్ని ప్రశంసిస్తాడు, మరి కొన్ని సందర్భాల్లో నిజాం నవాబు ని పొగుడుతాడు. ఈ కెసిఆర్ వింత పోకడ కి అర్ధముంది. ఒకవైపు తెలంగాణా సమాజం ఈ స్థాయికి రావటానికి, ఈ రోజు తనా కుర్చీ లో కూర్చోవటానికి తెలంగాణా విమోచన జరగటం కారణమని తన అంతరాత్మ చెబుతుంది, రెండో వైపు తన కుర్చీ కాపాడుకోవటానికి ముస్లిం ఓట్లు కావాలని ఆరాటం కనబడుతుంది. ఇది తన భయం తప్పితే ముస్లిం లందరూ నిజాం ని, రజాకార్లను సపోర్టు చేయలేదు. తెలంగాణా పోరాటం లో తిరుగుబాటు చేసిన సోహబుదుల్లా ముస్లిం నే కదా. చారిత్రాత్మక ప్రకటన చేసిన త్రిమూర్తులలో ఒకరైన మక్దుం మొహియుద్దీన్   ముస్లిం నే కదా. అయినా ఓట్ల కోసం  రజాకార్ల వారసులు మజ్లీస్ ని సమర్ధించటం తెలంగాణా ఆత్మ గౌరవాన్ని అవమానించటం కదా. ఎప్పుడైనా ఒవైసీ ఆ రోజు రజాకార్లు చేసిన అకృత్యాలు తప్పని చెప్పాడా? కెసిఆర్ ముందుగా  షరతు పెట్టి అయినదేదో అయ్యింది ఆ రోజు జరిగింది అరాచకమే నని ఒవైసీ ఒప్పుకుంటే ఆ తర్వాత సయోధ్య నెరిపితే ఎవరికీ ఈ ఖేదం వుండేది కాదు. అలా కాకుండా ఇప్పటికీ వాటికి వారసుడు గానే మాట్లాడే ఒవైసీ కోసం సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరపక పోవటం క్షంతవ్యం కాదు. అదేమంటే నిజాం అన్ని మంచి పనులు చేసాడు, ఇన్ని గొప్ప పనులు చేసాడు అని పొగడటం తెలంగాణా పోరాటాన్ని అవమాన పరిచినట్లే. అలాగయితే బ్రిటీష్ వాళ్ళు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారు, మరి వాళ్ళను పొగుడుదామా? పాలకుడన్న వాడెవడైనా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు. దాన్ని భూతద్దం లో చూపించి ప్రజల్ని పీడించిన ఉదంతాలను , గాయపరచిన గుండెలను, చనిపోయిన వేలమంది అమరవీరుల ఆత్మ త్యాగాన్ని కించపరచటం ఎటువంటి పరిస్తితుల్లో క్షంతవ్యం కాదు కెసిఆర్ గారు. మీరు ఈ విషయం పై ప్రశ్చాత్యపడే రోజు తప్పకుండా వస్తుంది. తెలంగాణా కు స్వతంత్రం వచ్చిన రోజు ని జరుపుకోలేని దుస్థితి లో తెలంగాణా రాష్ట్రం వుండటం మన దౌర్భాగ్యం. ఎప్పటికైనా తెలంగాణా లో సెప్టెంబర్ 17వ తేదీని నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందిన విమోచన దినంగా , భారత్ లో విలీనం అయిన స్వాతంత్రదినంగా జరుపుకొనే రోజు వస్తుందని వేయికళ్లతో ఆశతో ఎదురుచూస్తూ…….