KCR Chinajiyar swamy: త్రిదండి చినజీయర్ స్వామీజీ.. పరిచయం అక్కరలేని పేరు. రెండు నెలల క్రితం వరకు ఈయన సీఎం కేసీఆర్‌కు దైవంతో సమానం. ఏ పనికి అయినా ఆయన సలహాలేనిదే ముఖ్యమంత్రి మొదలు పెట్టేవారు కాదంటే అతిశయోక్తి కాదు. పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు, నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా ఏవైనా ఆయన సలహా తీసుకోవాల్సిందే. స్వామి వారు ముహూర్తం పెట్టాల్సిందే. వీలైతే ప్రత్యక్షంగా ఆయన కార్యంలో పాల్గొనాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదగిరి గుట్ట ప్రస్తుత యాదాద్రి ఆలయ నిర్మాణానికి కర్త, కర్మ ఆయనే. కానీ ప్రస్తుతం క్రియలో ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాకుండానే యాదాద్రి నూతన ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తిచేశాడు కేసీఆర్. యాదగిరికి యాదాద్రిగా నామకరణం చేసి, యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేసిన చిన జీయర్‌స్వామి ఈ ఓపెనింగ్ సెర్మనీలో ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.. దీంతో కేసీఆర్ ఇక స్వామీజీకి స్వస్తి పలికినట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనకు జీయర్ స్వామికి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మీరే సృష్టిస్తున్నారని కేసీఆర్ సైతం పేర్కొన్నారు. కానీ యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి నూతన ఆలయం మహాకుంభ సంప్రోక్షణలో చినజీయర్ లేకుండా చేసి ముచ్చింతల్‌లో తనకు జరిగిన అవమానానికి కేసీఆర్ ప్రతీకారం తీర్చుకున్నారన్న చర్చ మొదలైంది.
-ముచ్చింతలే ముంచిందా..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి 216 అడుగుల సమతామూర్తి(రామానుజాచార్యుల) విగ్రహం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 14 వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల ప్రారంభం వరకు తన ఆధ్యాత్మిక గురువు అయిన చినజీయర్ స్వామికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సీఎం కేసీఆర్ అన్నీ తానై ఏర్పాట్లు చేయించారు. మైహోం రామేశ్వర్‌రావు, చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడకలకు ఆరు నెలల ముందు నుంచే స్వామీజీ దేశంలోని ప్రముఖులను ఆహ్వానించారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు సీఎం కేసీఆర్ కూడా ముచ్చింతల్ వెళ్లొచ్చారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించారు. అయితే అంతకు రెండు రోజుల ముందే సీఎం కేసీఆర్ కేంద్రంపై, ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రమైన పదజాలంతో ఆరోపణలు చేశారు. దీంతో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని ముచ్చింతల్ వచ్చినా.. ఆయనకు ముఖం చూపించలేక సీఎం కేసీఆర్ జ్వరం పేరుతో తప్పించుకున్నారు. ఆ తర్వాతే అసలు వివాదం మొదలైంది. సమతా మూర్తి విగ్రహావిష్కరణ శిలాఫలకంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేరు ఒక్కటే రాయించి జీయర్‌స్వామి కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు. ఇక్కడి నుంచే విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Also Read: Andhra Pradesh MP Vs SP: ఏకంగా ఎస్పీ స్థలానికే ఎసరు పెట్టిన ఎంపీ.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో..?
-ముహూర్తం ఆయనదే.. కానీ ఆయనకే ఆహ్వానం లేదు..
యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చిన చినజీయర్‌స్వామిని ఆలయ పునఃప్రారంభ వేడుకలకు దూరంగా ఉంచాలని సీఎం నిర్ణయించారు. ఈనెల 21 నుంచి 27 వరకు ఉద్ఘాటన పూజలు, 28న 11:50 గంటలకు ధ్వజస్తంభ ధర్శనం, 12:20 గంటలకు గర్భాలయంలో మహాపూజ నిర్వహించాలని చినజీయర్‌స్వామి ముహూర్తం ఖరారు చేశారు. ఈమేరకు మూడు నెలల క్రితం సీఎం కేసీఆర్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. చిన్నజీయర్ స్వామి పెట్టిన ముహూర్తం ప్రకారమే ఈనెల 21 నుంచి ఉద్ఘాటన పూజలు ప్రారంభమయ్యాయి. 28 సోమవారం మహాకుంభ సంప్రోక్షణ, గర్భాలయంలో స్వయంభూ లక్ష్మీనృసింహస్వామివారికి సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. అంతకముందు మహాసుదర్శన చక్రానికి, గాలిగోపురంపై ఏర్పాటు చేసిన బంగారు శిఖరాలకు పూజలు చేశారు. కానీ ఎక్కడా చినజీయర్‌స్వామి లేడు. తాము ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపలేదని ఆలయ ఈవో తెలిపారు.
-తానో చక్రవర్తిలా.. మంత్రులు, ఎమ్మెల్యేలు సామంతులుగా..
యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహస్వామి నూతన ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని రాజరిక పాలనలో ఓ చక్రవర్తి నిర్వహించినట్లుగా కేసీఆర్ జరిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం రూ.1200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఆలయాన్ని తానేదో సొంతంగా నిర్మించుకున్నట్లు.. తానే అన్నీ నిర్వహించాలి అన్నట్లు జరిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే గతంలో ఆలయ స్తంభాలపై తన చిత్రాలను కూడా చెక్కించుకున్నారు. తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని తొలగింపజేశారు. ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణం, దైవ కార్యానికి అందరూ ఆహ్వానితులే. కానీ సీఎం కేసీఆర మాత్రం తాను చక్రవర్తిగా ఆదేశిస్తే.. ఆయన మంత్రివర్గ సహచరులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సామంతులుగా ఆలయ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. వేడుకలో గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు మినహా వేరే ఏపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనిపించకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రాలనికి ఒక గుర్తింపు తెచ్చేలా నిర్వహించిన ఆలయానికి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానం పంపకపోయినా అందరూ ఆహ్వానితులే అని ప్రకటించి ఉండాల్సింది. తన సొంత ఇంటి కార్యక్రమం కాదు కాబట్టి అందరినీ పిలువడమే సముచితం. కానీ కేసీఆర్ కేవలం తన కుటుంబం, తన మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబాలనే పిలవడం కేసీఆర్ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: Tirumala Tirupati: తిరుమల విషయంలో వీరబ్రహ్మంగారు చెప్పినవి నిజమేనా?