లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 24 గంటల లోపుగానే హోమ్ మంత్రిత్వ శాఖ బుధవారం జారీచేసిన మార్గదర్శక సూత్రాల పట్ల తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. వాటిని అమలు చేస్తే ఈ నెల 20 నుండి లాక్ డౌన్ తొలిగించినట్లే కాగలదని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అందుకనే బుధవారం జరిగిన సమీక్ష సందర్భంగా 20 నాటి పరిష్టితి చూసిన తర్వాత కేంద్రం ఇచ్చిన సడలింపులు ఏ మేరకు అమలు పరచాలో చూస్తామని పేర్కొనడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు లాక్‌డౌన్ యథాతథంగా అమలవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తరువాత పరిస్థితిని బట్టి మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని చెబుతూ కేంద్రం సూచించిన సడలింపులు అన్ని తెలంగాణలో ఉండకపోవచ్చని సంకేతం ఇచ్చారు.
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ను సడలించాలని ఆలోచనలో మోదీ ఉన్న సమయంలో ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ముందుగా చెప్పింది కేసీఆర్ కావడం గమనార్హం. ఇటుక బట్టీలు మొదలుకుని, రియల్టీ దాకా అనేకచోట్ల పనులు నిర్వహించుకునేందుకు కేంద్రం అనుమతించింది.
జనసందోహాలు, జనసంచారం అవసరమైన పలు రంగాలకు తలుపులు తెరుస్తూనే.. ‘అయితే నిబంధనల ప్రకారం సాంఘిక దూరం పటించాలి’ అనే షరతు ఉన్న ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకవైపు లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పుడే జనం ఆగడం లేదని, మారిప్పుడు జన సంచారానికి అనుమతిస్తే.. కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తక్కువున్న ప్రాంతాలకు వైరస్ వ్యాపించదా? అన్న అనుమానం రేకెత్తుతున్నది.
కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమనీ, దేశమంతా ఒకేతాటిపై ఉండి అమలుచేయడమే పరిష్కారమని పలు రాష్ట్రాలు ముక్తకంఠంతో కోరగా.. అవసరమైతే రాష్ట్రాలు సొంతంగా కఠిన నిబంధనలు విధించుకోవచ్చని కేంద్రం ముక్తాయించడం పట్ల కేసీఆర్ విస్మయం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తున్నది.
లాక్‌డౌన్ మినహాయింపుల విషయంలో అనూహ్య వేగంతో నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రాష్ర్టాలకు అత్యంత కీలకమైన ఆర్థిక సహాయం విషయంపై మాత్రం పెదవి విప్పకపోవడం పట్ల అసహనం వ్యక్తం అవుతున్నది.
దేశంలో వైరస్ తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపించడంలేదు. రోజుకు 700 నుంచి వెయ్యి కేసులు పాజిటివ్‌గా నమోదవుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ 30 నుంచి 40 మంది వరకు మృత్యువాత పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన మార్గదర్శకాలు విడుదల చేయడం వల్ల వైరస్ వ్యాప్తికి అవకాశమిచ్చినట్లే అవుతుంది తప్ప.. నియంత్రణకు కాదని వివిధ వర్గాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.