KCR On AP: కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఏపీలో మెజార్టీ వర్గాలను చేరదీయాలి.. ఇప్పుడు ఇదే కేసీఆర్ టార్గెట్ అందుకే.. ఏపీలోనే అత్యధిక జనాభా ఉన్న వారికి పెద్దపీట వేశారు. ఏపీలో ఎలాగైనా సరే ప్రభావం చూపాలని పంతం పట్టారు. కాపులే టార్గెట్ గా ఎత్తులు వేస్తున్నారు. తన రహస్య మిత్రుడు జగన్ కు మేలు చేయాలని మాస్టార్ ప్లాన్ వేశాడు. అదే సమయంలో టీడీపీ-జనసేన పొత్తుకు గురిపెట్టాడు. మూడంచెల వ్యూహంతో కేసీఆర్ ఏపీలో ఎవరి కొంప ముంచుతాడోనన్న చర్చ సాగుతోంది. కేసీఆర్ కాపు పాలిటిక్స్ పై స్పెషల్ ఫోకస్.

ఏపీలో తన బీఆర్ఎస్ విస్తరించాలన్న ప్రయత్నంలో ఉన్న కేసీఆర్ ఏ అవకాశాన్ని జార విరుచుకోవడం లేదు. చివరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలో సైతం ఏపీలో అవసరానికే పెద్దపీట వేశారు. ఎందరో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నా వారందర్నీ కాదని శాంతికుమారి నియామకం వెనుక ఏపీలో పార్టీ ప్రయోజనాలున్నాయన్న కామెంట్స్ వినిపించాయి. ఇప్పటికే కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్ మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలో ఏపీ పర్యటనకు సిద్ధమవుతున్న ఆయన ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఇటీవల రాజకీయాలకతీతంగా హైదరాబాద్ లో కాపు నేతలు సమావేశమయ్యారు. కేసీఆర్ చేతిలో ఉన్న ఆ బ్రహ్మాస్త్రం గురించి తెలిసేసరికి కాపు వారంతా షాకయ్యారట. తమ ముందర కాళ్లకు బంధం వేసేందుకు కేసీఆర్ సిద్ధపడుతున్నారని తెలిసి కలవరపాటుకు గురయ్యారుట.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కాపు నాయకులు తరచూ సమావేశమవుతూ వస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు సమావేశాలకు హాజరవుతున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా అంతా కలిసికట్టుగా ఉండాలని.. కాపుల హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలని చర్చించుకుంటున్నారు. ఇటువంటి సమావేశాలు అటు తెలంగాణ, ఇటు ఏపీ వేదికగా జరిగాయి. అయితే మొన్న ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన సమావేశం మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి ఏపీ బీఆర్ఎస్ నేతలు హాజరుకావడమే దీనికి కారణం. టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, బీజేపీనుంచి కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు హాజరుకాగా.. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, పార్థసారధి వచ్చారు. ఏపీలో టీడీపీ,జనసేన పొత్తుతో మారే సమీకరణలు, కాపుల ప్రయోజనాలు, కేసీఆర్ బీఆర్ఎస్ లో కాపులకు కీలక భాగస్వామ్యం వంటివి చర్చకు వచ్చాయి. అయితే తాము ఎందుకు బీఆర్ఎస్ లో చేరింది? కాపులకు కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ ను బీఆర్ఎస్ నేతలు బయటకు చెప్పేసరికి అక్కడున్న నేతలకు నోటి మాట రాలేదు. సమావేశ అజెండా పక్కకు వెళ్లి కేసీఆర్ ఆఫరే ప్రధాన చర్చగా మారింది.
ఏపీలో బీఆర్ఎస్ కాపు నినాదంతో వెళ్లాలని భావిస్తోంది. కాపులకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తోంది. ఇతర సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూనే కాపుల రాజకీయ డిమాండ్లను కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆ సమావేశంలో వెల్లడించారు. త్వరలో కేసీఆర్ ఏపీలో వరుస పర్యటనలు చేయనున్నారని.. కాపులకు సీఎం ఆఫర్ నేరుగా ప్రకటించనున్నారని చెప్పారు. దీంతో అక్కడ ఉన్న అన్ని పార్టీల్లో కలవరం ప్రారంభమైంది. కేసీఆర్ తాజా ఆఫర్, దాని వెనుక ఉన్న రాజకీయాలు,రాజకీయ ప్రయోజనాలు, కాపుల ప్రయోజనాలపై నేతలు విశ్లేషణలు చేయడం ప్రారంభించారు.
అయితే కేసీఆర్ కాపులకు సీఎం ఆఫర్ పై విస్తృత చర్చ జరుగుతోంది. ఆ రెండు సామాజికవర్గాల కంటే ఎక్కువ ఉన్న కాపులకు రాజ్యాధికారం దక్కాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మాజీ ఎంపీ హరిరామజోగయ్య అయితే బాహటంగానే చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నా పవనే సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే పొత్తు ఉన్నా పవన్ సీఎం గా ఉండేందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా అన్నది అనుమానమే. ఇప్పుడు కేసీఆర్ నేరుగా సీఎం ఆఫర్ ప్రకటన వెనుక టీడీపీ, జనసేన పొత్తును అడ్డుకట్ట వేయడమేనన్న టాక్ వినిపిస్తోంది. అది జగన్ కుప్రయోజనం చేకూర్చడానికే తప్ప బీఆర్ఎస్ కు ఏపీలో అంత సీన్ ఉందా? అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. అయితే కాపులకు సీఎం ఆఫర్ ప్రకటించడం ద్వారా ఒక విస్తృత చర్చకు అయితే కేసీఆర్ కారణమవుతున్నారు. మున్ముందు ఆయన రాజకీయ అడుగులు ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి మరీ.