KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో సామాజిక సమీకరణలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీని కోసం మూడోసారి విజయంపైనే గురిపెట్టినట్లు సమాచారం. దీనికి గాను హుజురాబాద్ ఉప ఎన్నికలో పరాజయం చవిచూడటంతో పార్టీని పూర్తిస్థాయిలో నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీని అన్ని విధాలా సమాయత్తం చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త కేబినెట్ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. మండలి అభ్యర్థుల ఎంపికలో కూడా కేసీఆర్ ఇదే వైఖరి అవలంభించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ జాబితాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి కి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిలో కడియం శ్రీహరి ఎస్సీ కాగా బండ ప్రకాశ్ ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం నేతలే ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మంత్రులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఎమ్మెల్సీ కోటాలో చేరిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి మంత్రి పదవి దక్కనుందని సమాచారం. మంత్రి మల్లారెడ్డి స్థానంలో ఆయనకు బెర్త్ ఖాయమని పార్టీ వర్గాల భోగట్టా. మరోవైపు ఎల్. రమణకు కూడా ఎమ్మెల్సీగా చోటు కల్పిస్తారని వార్తలు వచ్చినా చివరి క్షణంలో ఆయన పేరు కనిపించలేదు. అయితే స్థానిక సంస్థల కోటాలో ఆయన్ను తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సీనియర్ నాయకుడి హోదాలో మాజీ మంత్రి కడియం శ్రీహరికి కూడా మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ఎష్సీల్లో ఎవరికి కూడా ఇంతవరకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో కడియంకు ఈ సారి పదవి దక్కడం ముమ్మాటికి ఖాయమనే విషయం తెలుస్తోంది. అన్ని రకాల లెక్కలు వేసుకుని మంత్రివర్గ విస్తరణపై సమాలోచనలు చేయనున్నట్లు సమాచారం.
Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్ ఇదే.. కొందరికీ లక్కీ ఛాన్స్.. వీళ్లకు షాక్