https://oktelugu.com/

KCR: కేంద్రం వర్సెస్‌ రాష్ట్రం: ధాన్యం యుద్ధం.. వరి కొయ్యలకు బలయ్యేదెవరో..?

KCR: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘వరి’గడ్డి వేస్తే భగ్గు మంటోంది. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ధూషణలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. మరి ఈ వరి పోరులో చివరికి మళ్లీ బలయ్యేది, నష్టపోయేది రైతులే అన్నది జగమెరిగిన సత్యం. -రాజకీయమే అసలు లక్ష్యం.. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయం చేయడమే లక్ష్యం అన్నట్లుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 27, 2022 / 11:13 AM IST
    Follow us on

    KCR: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘వరి’గడ్డి వేస్తే భగ్గు మంటోంది. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ధూషణలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. మరి ఈ వరి పోరులో చివరికి మళ్లీ బలయ్యేది, నష్టపోయేది రైతులే అన్నది జగమెరిగిన సత్యం.

    -రాజకీయమే అసలు లక్ష్యం..
    తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ప్రయోజనాలకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయం చేయడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. వానాకాలం ధాన్యం కొనుగోళ్ల సమయంలోనే కేంద్రం, రాష్ట్రం మధ్య రాజకీయ యుద్ధానికి బీజం పడింది. హుజారాబాద్‌ ఎన్నికల్లో ఓటమితో తీవ్రంగా దెబ్బతిన్న కేసీఆర్‌ ఆ పగ తీర్చుకోవడానికి వరి పోరుకు తెరలేపారు. ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ రచ్చ షురూ చేశారు. తర్వాత యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ఉండవని, కొనుగోలు కేంద్రాలు తెరువబోమని ప్రకటించారు. యాసంగిలో ఎవరూ వరి వేయొద్దని కోరారు.

    -తాను వరి వేసి ఇరుక్కుపోయిన కేసీఆర్‌..
    రాష్ట్రంలో రైతులను యాసంగిలో వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి వేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫొటోలు, వీడియోలతో బయటపెట్టాడు. దీంతో కేసీఆర్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. వరి వేసిన వార్తలను ఖండించలేక.. ఎలా కవర్‌ చేసుకోవాలో తెలియక కిమ్మనకుండా ఉండిపోయారు. కేసీఆర్‌ వరి వేసిన విషయం విస్తృతంగా ప్రచారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆలస్యంగా వరి సాగు షురూ చేశారు. కోటి ఎకరాల్లో సాగవ్వాల్సిన పంట సుమారు 50 వేల ఎకరాల వరకు సాగైంది. ప్రస్తుతం పంటలు కొనుగోలు దశకు చేరుకుంటున్నాయి. కాస్త అటూ ఇటుగా నెల రోజుల్లో దిగుబడి వస్తుంది. దీంతో ధాన్యం కొనుగోళ్లపై ఆయాచితంగానే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో సీఎం కేసీఆర్‌ మళ్లీ వరి రాజకీయాలకు తెరలేపారు.

    -ఫాంహౌస్‌లో అత్యవసర సమావేశం..
    వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు రాజకీయ సలహాదారుగా నియమించుకున్న పీకే ఇటీవల మొదటి విడత సర్వే పూర్తి చేశారు. ఇందులో కేసీఆర్‌ కు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డట్లు సమాచారం. పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వెల్లడించారు. ఇదే సమయంలో బీజేపీ సానుకూల పవనాలు వీస్తున్నట్లు తెలిపారు. దీంతో షాక్‌కు గురైన కేసీఆర్‌ అందుబాటులో ఉన్న మంత్రులను హడావుడిగా తన ఫాంహౌస్‌కు పిలిపించుకున్నారు. పడిపోతున్న పార్టీ ఇమేజ్‌ను ఎలా పెంచాలని చర్చించారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో కేంద్రాన్ని టార్గెట్‌ చేయడానికి, ప్రజల్లో తన ఇమేజ్‌ పెంచుకోవడానికి ఏ అంశమూ దొరకలేదు. దీంతో మళ్లీ వరి అంశాన్నే ఎత్తుకోవాలని నిర్ణయించారు. గత వానాకాలంలో కోతల సమయంలో చేసిన రచ్చ బెడిసి కొట్టిన నేపథ్యంలో ప్రస్తుతం యాసంగి పంటల కోతలకు ఇంకా సమయం ఉన్నందున ముందుగానే యుద్ధం షురూ చేశారు.

    -బెంగాల్‌ తరహా హింసకు స్కెచ్‌..
    వరి కొనుగోలు విషయంలో రాష్ట్రంలో బెంగాల్‌ తరహా హింసకు గులాబీ దళం స్కెచ్‌ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉగాది తర్వాత ఢిల్లీకి రైతులను తోలుకొని వస్తామని మంత్రులు చేసిన ప్రకటనల వెనుక ఇదే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రైతులను ఢిల్లీకి తీసుకెళ్లి.. అక్కడ ఎలాంటి అనుమతి లేకున్నా ఆందోళనలు చేయడంతోపాటు పోలీసులను రైతులపైకి ఉసిగొల్పే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు తమ ఆవేదనను దేశ ప్రజలకు తెలియజేయడానికి వెళితే కేంద్రం కుట్రపూరితంగా రైతులపై దాడిచేసిందని, తెలంగాణ రైతులను అవమానించిందని ప్రచారం చేసుకోవాలని భావిస్తోంది. అవసరమైతే ఢిల్లీలో ఒకరిద్దరు రైతులతో ఆత్మహత్యాయత్నం కూడా చేయించే ఆలోచనలో ఉన్నట్లు గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రణాళిక కార్యరూపం దాల్చితే రాష్ట్రంలోనూ అల్లర్లు సృష్టించి విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. కాగా, టీఆర్‌ఎస్‌ స్కెచ్‌పై ఇప్పటికే కేంద్ర హోం శాఖకు ఇంటలిజెన్స్‌ నివేదిక అందినట్లు సమాచారం. ఏది ఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న రాజకీయ వరి పోరులో చివరకు నష్టపోయేది మాత్రం వరి రైతులే అనేది సుస్పష్టం.