KCR: తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలు తమ బలం పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మరింత పదును పెట్టే వ్యూహాలు ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హుజురాబాద్ లో దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తున్న టీఆర్ఎస్ మదిలో మరిన్ని ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. అయితే దళితబంధు పథకం ఏ మేరకు విజయం సాధిస్తుందో దాని ఆధారంగానే వాటిని ప్రచారంలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

రెండు దఫాల్లో సునాయాసంగా గెలుపు సాధించిన టీఆర్ఎస్ కు ఈ సారి అంత సులువుగా రాదనే విషయం తేలడంతోనే అధికార పార్టీ గులాబీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని పథకాల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వీటిని తెరమీదకు తెచ్చేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న రైతులకు రూ.5 వేల పింఛన్ ఇచ్చే పథకానికి రూపకల్పన చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
అయితే ఈ పథకం అమలు సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతులందరికి పింఛన్ ఇవ్వాలంటే ప్రభుత్వంపై పెనుభారమే పడుతుంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంతో ఓట్లన్ని గంపగుత్తగా పడతాయని భావిస్తున్నా రైతు పథకాలతో వారికి చేరువైన కేసీఆర్ పింఛన్ పథకంతో ఓట్లు సాధించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
దళితబంధు పథకంతో ఏ మేరకు ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందో దాని ద్వారానే మరిన్ని పథకాల అమలుపై ఆధారపడనుంది. ఇప్పటికే దళితబంధు పథకం రాష్ర్టమంతా విస్తరించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీకి ఏ విధంగా లాభం జరుగుతుందోననే దానిపైనే పార్టీ ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. హుజురాబాద్ లో వచ్చే ఫలితాల ఆధారంగానే పథకాల అమలుకు శ్రీకారం చుడుతుందనే విషయం తెలుస్తోంది.