KCR vs BJP: రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలంటే మాత్రం ముందస్తు వ్యూహాలు తప్పనిసరిగా కావాలి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను అంచనా వేసి ముందుగానే వ్యూహాలు రచించుకొని సిద్ధంగా ఉన్న వారే పదవిలో కొనసాగుతారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను చూస్తుంటే ఆయన చాలా ముందస్తు వ్యూహాలతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా విడుదలైన ఐదు రాష్ట్రాల ఫలితాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. బీజేపీ యూపీలో గెలవడం పెద్ద బ్రేక్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ వ్యూహాలను జగన్ ముందుగానే పసిగట్టారో లేదంటే ఫలితాలు వచ్చేదాకా కావాలనే సైలెంట్ గా ఉన్నారో తెలియదు గానీ.. బీజేపీ విషయంలో మాత్రం ఆయన క్లారిటీ గానే వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఇటు కేసీఆర్ ను చూసుకుంటే బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి తమతో రావాలంటూ కోరారు. కానీ ఈ విషయంలో కేసీఆర్ కు జగన్ ఎలాంటి మద్దతు తెలపలేదు. వాస్తవంగా కేసీఆర్ కు జగన్ కు మంచి స్నేహభావం ఉంది. అయినా కూడా జగన్ మాత్రం బీజేపీని వ్యతిరేకించే విషయంలో కేసీఆర్ కు సపోర్ట్ ఇవ్వలేదు.
ఇప్పుడు విడుదలైన ఫలితాలు జగన్ నిర్ణయం కరెక్టే అని తేల్చేశాయి. బీజేపీని వ్యతిరేకించక పోవడమే జగన్ కు మేలు చేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి ఫలితాలను చూస్తుంటే కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం బీజేపీకి నల్లేరు మీద నడకే. కాబట్టి ఏపీ పరిస్థితుల రీత్యా కేంద్రంతో సత్సంబంధాలు మెయింటేన్ చేయడమే మంచిదని జగన్ భావిస్తున్నారు.

ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం సపోర్ట్ తప్పనిసరి. మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. కాబట్టి జగన్ వ్యవహరించిన తీరు ఆయన రాజకీయ ముందస్తు వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇటు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మాత్రం బెడిసికొట్టింది. బీజేపీ వ్యతిరేక స్టాండ్ దేశవ్యాప్తంగా పనిచేయదని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. మొత్తంగా కేసీఆర్ కంటే జగన్ వ్యవహరించిన తీరు రాజకీయంగా ఆయనకు లాభం చేసిందంటున్నారు.