KCR Selling Govt Lands: భూములు అమ్మేస్తున్న కేసీఆర్‌.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆపాలని కేటీఆర్‌ ధర్నా!!

ప్రభుత్వ భూములను ప్రజల అవసరాల కోసం, భావి తరాల అవసరాల కోసం వినియోగించాలి.. ఇది నాడు కేసీఆర్, కేటీఆర్‌ నినాదం. అమ్ముకుంటూ పోతే రాబోయే తరాలకు ఏమీ మిగలదు అని అన్నారు.

Written By: Raj Shekar, Updated On : August 5, 2023 11:16 am

KCR Selling Govt Lands

Follow us on

KCR Selling Govt Lands: హెడ్డింగ్‌లో ఏదో తేడా కొడుతుంది అనుకుంటున్నారా.. మీరు చదివింది కరెక్టే.. కేసీఆర్‌ ప్రభుత్వ వేలం వేస్తున్నది 200 శాతం నిజం.. మరి కేటీఆర్‌ ధర్నా సంగతేంటి అనుకుంటున్నారా.. అది కూడా నిజమే.. కానీ ధర్నా చేసింది ఇప్పుడు కాదు. 2014కు ముందు.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ భూములు వేలం వేసింది. దీనిని నిరసిస్తూ నాడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌.. తన సైన్యాన్ని వెంటపెట్టుకుని వెళ్లి ప్లకార్డులు చేత పట్టుకుని ధర్నా చేశారు. ‘ప్రభుత్వం పాలిస్తుందా.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుందా.. ప్రభుత్వ భూముల వేలం ఆపాలి’ అని డిమాండ్‌ చేశారు.

నాడు రాంగ్‌.. నేడు రైట్‌..
ప్రభుత్వ భూములను ప్రజల అవసరాల కోసం, భావి తరాల అవసరాల కోసం వినియోగించాలి.. ఇది నాడు కేసీఆర్, కేటీఆర్‌ నినాదం. అమ్ముకుంటూ పోతే రాబోయే తరాలకు ఏమీ మిగలదు అని అన్నారు. నిజమే.. కానీ.. నాడు ప్రభుత్వ భూములు వేలం రాంగ్‌ అన్నవారే.. నేడు భవిష్యత్‌ తరాలకు ఏమీ మిగలకుండా అమ్మేస్తున్నారు. ఇక ఆశ్చర్యం ఏమిటంటే.. దీనిని తెలంగాణ ప్రగతి కోణంలో చూడాలని ప్రకటించడమే. మనది సోమవారం.. మందిది మంగళవారం అన్నట్లు ఉంది కేసీఆర్, కేటీఆర్‌ తీరు.

ధరలు పెరిగితే ప్రగతి అంట..
‘తెలంగాణలో భూముల ధరలు భారీగా పెరిగాయి.. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా ఎకరం రూ.20 లక్షలకు పైగా పలుకుతుంది. తెలంగాణ అభివృద్ధికి ఇదే నిదర్శనం’ పలు సభలు, సమావేశాల్లో కేసీఆర్‌ చెప్పే మాటలు ఇవీ. భూముల విలువ పెరిగితే సమస్యలు అన్నీ తీరినట్టే అని.. రాష్ట్రం బంగారు మయం అయినట్లే అని కేసీఆర్‌ చెబుతున్నారు. మరి ఇదే బంగారు తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరదలు వస్తే రాజధానితోపాటు అనేక నగరాలు, పట్టణాలు నీటమునుగుతున్నాయి. ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోతున్నాయి. పంటలకు మద్దతు ధర లేక, దళారులు దోపిడీ చేస్తున్నా ఏమీ చేయలేక రైతులు నిస్సహాయంగా చూస్తున్నారు. నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఉద్యోగులకే ఒకటో తారీఖు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. పింఛన్లు ఎప్పుడు ఇస్తారో తెలియని వైనం..

పైసలు లేక అమ్మేస్తున్నారు..
ఇక తెలంగాణ సర్కార్‌ భూముల అమ్మకం వెనుక అసలు రహస్యం ఖజానా ఖాళీ కావడమే. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నాలుగు నెలలైనా ఉద్యోగులకు సంక్రమంగా వేతనాలు ఇవ్వాలి.. పింఛన్లు ఠంచన్‌గా ఇవ్వాలి. గతంలో ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేర్చాలి. రైతుబంధు, బీసీ బంధు, వంటి పథకాలను నడిపించాలి. ఇవన్నీ అమలు చేయాంటే డబ్బులు కావాలి. కేంద్రం రుణాలపై ఆంక్షలు విధించిది. ఇప్పటికే రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్‌కు ఇకపై ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. దీంతో ఆయనకు కనిపిస్తున్నది ఒక్కటే.. తెలంగాణ ప్రభుత్వ భూములు. ఇవి తన సొంత భూములు అయినట్లు.. పల్లీలు, పుట్నాలు అమ్మేసినట్లు అమ్మేస్తున్నారు. నాడు భూములు అమ్మొద్దని ధర్నా చేసిన కేటీఆర్‌ నేడు సర్కార్‌లో మంత్రిగా ఉన్నారు. కానీ నోరు మెదపలేని పరిస్థితి. ఇదీ రాజకీయం అంటే..!