https://oktelugu.com/

KCR National Politics: ఏతోడు లేకుండా… ఎటువైపు కేసీఆర్‌ పయనం..!

అటు కాంగ్రెస్‌తో కలవలేరు.. ఇటు బీజేపీని వ్యతిరేకించలేరు అనే పరిస్థితికి కేసీఆర్‌ జారిపోయారన్న అభిప్రాయం జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. బీజేపీని గద్దె దించి తాను ఢిల్లీ పీఠం ఎక్కేందుకు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ స్థాపించారు.

Written By: , Updated On : May 25, 2023 / 01:45 PM IST
KCR National Politics

KCR National Politics

Follow us on

KCR National Politics: ‘దేశంలో కిసాన్‌ సర్కార్‌ రావాలి.. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలి. మేం అధికారంలోకి వస్తే దేశమంతా దళితబంధు అమలు చేస్తాం.. ఇంటింటికీ తాగునీరు ఇస్తాం.. రైతు వ్యతిరేక సర్కార్‌ను సాగనంపుదాం’ మహారాష్ట్రలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభల్లో కేసీఆర్‌ చెబుతున్న మాటలు, ఇస్తున్న హామీలు. కానీ కేసీఆర్‌ను ప్రజలు ఎంత వరకు నమ్ముతున్నారో తెలియదు కానీ, దేశంలోని రాజకీయ పార్టీలు మాత్రం విశ్వసించడం లేదు.

జాతీయ రాజకీయాల్లో ఒంటరిగా..
అటు కాంగ్రెస్‌తో కలవలేరు.. ఇటు బీజేపీని వ్యతిరేకించలేరు అనే పరిస్థితికి కేసీఆర్‌ జారిపోయారన్న అభిప్రాయం జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. బీజేపీని గద్దె దించి తాను ఢిల్లీ పీఠం ఎక్కేందుకు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ స్థాపించారు. కానీ ఢిల్లీ వైపు చూడటం లేదు. ఆయనను ఇతరులూ పిలవడం లేదు. బీజేపీని దింపేందుకు కలిసి పని చేద్దామని.. ప్రత్యేక విమానంలో చాలా రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్‌ను ఇప్పుడు విపక్షాలు ఏకమైనా పిలువడం లేదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు వివిధ అంశాలపై పోరాడుతున్నాయి. అందులో మొదటిది ఢిల్లీ అధికారాలను తగ్గించేందుకు కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌. మరొకటి.. పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం. ఇలాంటి అంశాలపై రాజకీయ పార్టీలన్ని కలిసికట్టుగా పోరాడుతున్నాయి. ఈ పోరాటాలే భవిష్యత్‌ రాజకీయాలకు.. విపక్షాల కూటమికి.. ఈ అంశం ఓ వేదికగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌ ఈ విషయంలో ఆ పార్టీలతో కలవడం లేదు.

రాహుల్‌పై వేటు సందర్భంగా పోరాటం..
గతంలో రాహుల్‌ గాంధీపై అనర్హతా వేటు వేసినప్పుడు.. కాంగ్రెస్‌ పార్టీ తరపున నిర్వహించిన సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి కేసీఆర్‌ ఆసక్తి చూపించకపోవడం వల్లనే ఇతర పార్టీలు పిలవడం మానేశాయన్న అభిప్రాయాలు వినిపిస్తోంది. విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్నారు. ఆయన కేసీఆర్‌ను కలుస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ కలవలేదు. ఆయన కలవడానికి సిద్ధమే కానీ.. కేసీఆరే ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.

కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి అందని ఆహ్వానం..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పశ్చిమబెంగాళ్, తమిళనాడు, జార ్ఖండ్, రాజస్తాన్, హిమాచల్‌ ప్రదేశ్, బీహార్‌ సీఎంలతోపాటు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌థాక్రే, ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌కు ఆహ్వానం పంపారు. కమ్యూనిస్టు నేతలు కూడా హాజరాయ్యరు. కానీ తెలంగాణ సీఎంకు ఎవరూ ఆహ్వానించలేదు. అంతకు ముందు స్టాలిన్‌ పుట్టిన రోజు వేడుకలకూ కేసీఆర్‌కు ఆహ్వానం అందలేదు. దీంతో కేసీఆర్‌ ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఒంటిర ప్రయాణం ఎందాక సాగుతుందో చూడాలన్న వాదన వినిపిస్తోంది.