Munugode By Election- KCR: దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. కెసిఆర్ ప్రచారానికి వెళ్లలేదు. హుజరాబాద్ లో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ కూడా ప్రచారానికి కేసీఆర్ వెళ్లలేదు. ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్న భారతీయ జనతా పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బండి సంజయ్ నుంచి రఘునందన్ రావు దాకా కీలక నేతలు మొత్తం అక్కడే మోహరించారు. ఇక టిఆర్ఎస్ కూడా ఏం తక్కువ తినలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రచారంలోకి దింపింది. ఒక్కొక్కరికి ఒక్కో బూత్ అప్పగించింది. దీంతో వారు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ సర్వేలో టిఆర్ఎస్ అనుకున్నంత ఫలితాలు కనిపించడం లేదు. పైగా టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అతితో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.

రంగంలోకి నేరుగా కేసీఆర్
కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. పేరుకు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు పరిశీలించేందుకు వెళ్లారని చెబుతున్నా.. తెర వెనుక జరిగేది వేరుగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో సిబిఐ విచారణలో వేగం పెంచింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను విచారించింది. ఇప్పటికే ఒకప్పటి కవిత మాజీ పిఏ అభిషేక్ ను అదుపులోకి తీసుకుంది. రామచంద్ర పిళ్లై ను పలు ప్రశ్నలు అడిగింది. ఈ నేపథ్యంలో తర్వాత కవితనే ఈడీ టార్గెట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే టిఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ వరుస పరిణామాలతో కెసిఆర్ పై ఒత్తిడి తీవ్రస్థాయిలో పెరిగింది. పైగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని లక్ష్యంతో ఉన్న కేసీఆర్ కు ఈ పరిణామాలు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో తానే బయటకు రావాలని కెసిఆర్ అనుకుంటున్నారు. మునుగోడులో విస్తృత ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. నిన్న ఢిల్లీలో తన పార్టీ ముఖ్య నాయకులతో మునుగోడుపై కసరత్తు చేశారు.

ఇదే సమయంలో బిజెపి నాయకులపై, ఎన్నికల కమిషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ బిజెపి కను సన్నల్లో నడుస్తోందని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు ను పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. అయితే నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగుతుండడంతో మునుగోడు లో టిఆర్ఎస్ కు చుక్కెదురు అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతంలో ఎప్పుడూ ఉప ఎన్నిక జరిగినా ప్రచారానికి వెళ్ళని కెసిఆర్.. ఇప్పుడు మునుగోడు విషయంలో అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎన్నికకు ఇంకా రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో మునుముందు పరిస్థితి ఇంకా రంజుగా మారే అవకాశాలు ఉన్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.