KCR vs Modi: పగ అంటే.. పాముదే అంటారు.. పాము పగబడితే ఎక్కడ ఉన్నా వదలదు.. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా.. కాటు వేయక మానదంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా పాములా తన వ్యతిరేకులను పగబడుతున్నారు. గత ఏడాది ఈటల రాజేందర్, మొన్న ప్రధాని నరేంద్రమోదీ… నిన్న చినజీయర్‌స్వామి.. ఈ రోజు గవర్నర్ తమిళిసై.. తనను వ్యతిరేకించేవారు.. ఎదిరించేవారు ఎవరైనా నాతో పెట్టుకుంటే అంతే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అవతలి వ్యక్తులు సానుకూలంగా ఉన్న తాను మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
kcr vs bjp
-ఏడాది క్రితం ఈటలను గెంటేసి..
తెలంగాణ మంత్రి వర్గంలో కీలక శాఖ, టీఆర్‌ఎస్ పార్టీలో నంబర్ 2 గా ఎదిగిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 2018 ఎన్నికల తర్వాత నుంచి ఆయన కేసీఆర్‌తో విభేదిస్తూ వస్తున్నారు. మాటల ఈటెలు సంధిస్తూ వస్తున్నారు. చినికిచినికి గాలివానలా మారిన ఈ విభేదాలు గతేడాది తారాస్థాయి చేరుకున్నారు. ఈటలపై వేటు వేసేందుకు వ్యూహ రచన చేశారు. ఈటల పరిశ్రమలు ఉన్న శామీర్‌పేట పరిసర గ్రామాల రైతులతో ఓ ఫిర్యాదు ఇప్పించుకున్నారు. మరుసటి రోజే విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత రోజే నివేదిక వచ్చిందటూ.. భూ ఆక్రమణలు నిజమే అని నిర్ధారణకు వచ్చారు. ఆ వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత పార్టీని వీడిన ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఈటలను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. మంత్రివర్గం మొత్తాన్ని హుజూరాబాద్‌లో మోహరించారు. కానీ కేసీఆర్ వ్యూహం పనిచేయలేదు. ఈటలకు ఉన్న ప్రజాదరణ ముందు కేసీఆర్ అధికార, ధన బలం ఓడిపోయింది. ఈటల విజయం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును ప్రగతిభవన్, ఫాంహౌస్ నుంచి బయటకు లాగింది. ఇది కేసీఆరకు ఇప్పటికీ మిగుడు పడడం లేదు. ఇంకా కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
-మొన్న మోదీ..
ఏడేళ్లు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వచ్చిన కేసీఆర్.. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ ఏడాది వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో గిచ్చి గొడవ పెట్టుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా ప్రధాని మోదీని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ధూషించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సభ్యసమాజం తలదించుకునేలా దుర్భాషలాడారు. ఇప్పటికీ ఆదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఈ గొడవ తర్వాత పలుమార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రిని మాత్రం కలవడం లేదు. ఈ క్రమంలో ముచ్చింతల్‌లో ఫిబ్రవరిలో ప్రతిష్టించిన సమతామూర్తి రామానుజాచారి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు కావడంతో ఆయనపై కోపంతో కేసీఆర్ వెళ్లలేదు. కనీసం స్వాగతం కూడ పలకలేదు. జ్వరం వచ్చిందని తప్పించుకున్నారు.
-చినజీయర్‌పై ప్రతీకారం..
ముచ్చింతల్‌లో ఫిబ్రవరిలో నిర్వహించిన రామానుజుల స్వామి విగ్రహావిష్కరణకు చినజీయర్‌స్వామి ఏడాది నుంచే దేశంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. చినజీయర్‌స్వామి తన ఆధ్యాత్మిక గురువు కావడంతో సమతామూర్తి విగ్రహావిష్కరణ ఉత్సవాల ఏర్పాట్లను కేసీఆర్ స్వయంగా దగ్గరుండి చూశారు. అయితే ప్రధాని వేడుకలకు రావడం.. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ప్రధాని నరేంద్రమోదీ పేరు ఒక్కటే ఉండడంతో కేసీఆర్‌కు ఊహించని షాక్ తగిలింది. అందరికీ దమ్‌కీ ఇచ్చే కేసీఆర్‌కు చినజీయర్‌స్వామి దమ్‌కీ ఇవ్వడంతో కేసీఆర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం వేచిచూశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానికి చినజీయర్‌నూ దూరంగా ఉంచారు.
-గవర్నర్‌తో గ్యాప్..
రాష్ట్రంలో రాజ్‌భవన, ప్రగతిభవనకు మధ్య దూరం పెరుగోతంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కౌషికరెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని సీఎం ప్రతిపాదించారు. ఈమేరకు కవర్నర్‌కు ప్రభుత్వం తరపున పేరు పంపించారు. కానీ గవర్నర్ దానిని పెండింగ్‌లో పెట్టారు. అప్పటి నుంచి గవర్నర్, సీఎం మధ్య గ్యాప్ మొదలైంది. తర్వాత రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ వెళ్లకుండా ఆ గ్యాప్‌ను మరింత పెంచారు. ఇటీవల జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు గవర్నర్ తమిళిసై వెళ్లారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో గవర్నర్ వచ్చినా అధికారులు, జిల్లా మంత్రులు ప్రొటోకాల్ పాటించలేదు. కనీసం హెలిక్యాప్టర్ కూడా సమకూర్చ లేదు.
-ఒక్కదెబ్బతో ముగ్గురికి చెక్..
యాదాద్రి ఆలయ పునర్నిర్మానానికి ముహూర్తం పెట్టి.. ఆలయ పునర్నిర్మాణ నమూనాలను ఆగమశాస్త్రాల ప్రకారం ఉందా లేదా పరిశీలించి, పరీక్షించి ఆలయ పునర్నిర్మాణానికి మొదటి నుంచి ఒక దర్శకుడిలా వ్యవహరించిన చినజీయర్‌స్వామినే కేసీఆర్ వ్యూహాత్మకొంగా వేడుకలకు దూరం పెట్టారు. ఇక యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వీవీఐపీలంతా వస్తారని కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ మొన్నటి వేడుకల్లో వీరెవరూ కనిపిచంలేదు. ప్రదాని మోదీకి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. ఆయన కూడా రాలేదు. ఇక గవర్నర్ కూడా వేడకలకు ఆహ్వానం అందలేదు. ప్రగతిభవన్‌కు, రాజ్‌భవన్‌కు దూరం పెరుగుతుందన్న వార్తలను నిజం చేస్తూ కేసీఆర్ గవర్నర్‌ను పిలవలేదు.
-విమర్శలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు..
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి ఎవరినీ ఆహ్వానించని సీఎం కేఈఆర్ తనపై విమర్శలు రాకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు. ఎవరికీ ఆహ్వానం పంపలేదు.. అందరూ ఆహ్వానితులే అన్నట్లు ఈవోతో ఒక ప్రకటన చేయించారు. అలాగే ఆలయంలో ఎక్కడా శిలాఫలకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముచ్చింతల్‌లో శిలాఫలకం రాజకీయం కావడంతో యాదాద్రి ఆలయ పునఃప్రారంభం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంలా జరిపించారు. తొలి భక్తుడిగా సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు. వివాదాల్లో చిక్కుకోకుండా, ఆలయ పునఃప్రారంభం ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రం కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహారం నడిపించారు. అదే సమయంలో తనను వ్యతిరేకించిన వారికి స్పష్టమైన సందేశం పంపించారు. కేసీఆర్ వ్యతిరేకిస్తే ఎందాకైనా వెళతాడు అనేలా ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, బీజేపీ పార్టీకి తన స్వభావం ఎమిటో చెప్పకనే చెప్పాడు..
-ఉగాది వేడుకలకు దూరం..
రాజ్‌భవన్ లో శుక్రవారం శ్రీ శుభకృత నామ ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , కేసీఆర్‌ను ఆహ్వానించారు. ప్రగతి భవన్ కు ఆహ్వానం కూడా పంపారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. స్టేజ్‌పై ఉన్న ఫ్లెక్సీలోనూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఫ్లైక్సీలో కేసీఆర్ ఫోటో కనిపించలేదు. ఈ వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు , ఈటెల రాజేందర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగులయ్య, పలువురు జడ్జీలు, ప్రముఖులు హాజరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు ఎవరూ హాజరు కాలేదు.
-అందరినీ ఆహ్వానించా.. నాకు ఈగో లేదు: గవర్నర్ తమిళిసై
ఉగాది ఉత్సవాలకు అందరినీ ఆహ్వానించినట్లు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తన ఆహ్వానం మేరకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్ భవన్ ను ప్రజా భవన్ గా మార్చినట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాజ్‌భవన్ ఎదుట గ్రీవెన్ బాక్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాజ్ భవన్ లో ఫ్రెండ్లీ గవర్నర్ ఉందన్నారు. వచ్చే నెల నుంచి రాజ్ భవన్ లో రెగ్యులర్ గా ప్రజాదర్బార్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాజ్‌భవన్ లో ఉంది గవర్నర్ కాదు.. సిస్టర్ ఆఫ్ తెలంగాణ. నాకు ఈగో.. భేషాజాలు లేవు. నేను చాలా శక్తివంతురాలినని, నా తల ఎవరూ వంచలేరు. తెలంగాణ ప్రజలను నేనును ప్రేమిస్తాను, గౌరవిస్తాను’ అని ప్రకటించి గవర్నర్ కూడా తన స్వభావం ఎమిటో కేసీఆర్‌కు పరోక్షంగా చెప్పారు.
ఇలా మొత్తంగా అందరితో కయ్యం పెట్టుకుంటున్న కేసీఆర్ చివరకు కాలుదువ్వుతూ వారితో శత్రుత్వాన్ని మరింత పెంచుకుంటున్నారు. వరుసగా వివాదాల వలయంలో చిక్కుకుంటున్నారు. తగ్గేదే లే అంటూ ముందుకెళుతున్నారు. మరి ఆయన పయనం ఎటు దారితీస్తుందన్నది వేచిచూడాలి.