https://oktelugu.com/

Bhadrachalam Temple : భద్రాద్రి రామా… కనవేమిరా ఈ సర్కార్ లీలలు!

Bhadrachalam Temple : “భద్రాద్రి అభివృద్దికి పోలవరం అడ్డుకట్ట” ఆ   పత్రిక నమస్తే తెలంగాణ చేసిన ఆరోపణ ఇది. కానీ నాడు తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతున్నప్పుడు ‘ఆంధ్రాకు పోలవరం మంజూరు చేస్తున్నాం. దీనివల్ల భద్రాచలం మునుగుతుంది. అని కాంగ్రెస్‌ నాయకులు అంటే మాకు తెలంగాణ వస్తే చాలు భద్రాచలం ఉన్నా లేకపోయినా పెద్దగా ఫాయిదా లేదు అని’ చెప్పింది కేసీఆరే అని ఇప్పటికీ పలువురు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ విషయాన్ని మరిచి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 28, 2023 / 09:31 PM IST
    Follow us on

    Bhadrachalam Temple : “భద్రాద్రి అభివృద్దికి పోలవరం అడ్డుకట్ట” ఆ   పత్రిక నమస్తే తెలంగాణ చేసిన ఆరోపణ ఇది. కానీ నాడు తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతున్నప్పుడు ‘ఆంధ్రాకు పోలవరం మంజూరు చేస్తున్నాం. దీనివల్ల భద్రాచలం మునుగుతుంది. అని కాంగ్రెస్‌ నాయకులు అంటే మాకు తెలంగాణ వస్తే చాలు భద్రాచలం ఉన్నా లేకపోయినా పెద్దగా ఫాయిదా లేదు అని’ చెప్పింది కేసీఆరే అని ఇప్పటికీ పలువురు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ విషయాన్ని మరిచి ఆ నమస్తే తెలంగాణ అడ్డగోలు వాదనలకు దిగింది. తన కళ్లకు గులాబీ పొరలు కమ్మితే దాని తప్పవుతుంది కాని తెలంగాణ ప్రజల తప్పు ఎలా అవుతుంది? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం వద్ద పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఏడాది పొడవునా 43 అడుగులు నీటి మట్టం ఉంటుందని నిపుణులు పేర్కోంటున్న విషయం వాస్తవమే. కానీ ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉన్నప్పటి నుంచి తెరపైకి వచ్చిన విషయాన్ని ఆ నమస్తే మరిచింది.

    అప్పట్లో జరిగింది ఇదీ

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఎత్తును తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో 2007 జనవరి 29న జరిగిన నిరసన కార్యక్రమం పోలీసు కాల్పులకు దారి తీయడం, ముగ్గురు గాయపడటం, 78 మందిపై కేసు నమోదు కావడం గుర్తు లేదా. 16 ఏళ్ల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న కొత్తగూడెం జిల్లా కోర్టు పోలవరం కేసును సైతం కొట్టివేసింది వాస్తవం కాదా. అంతెందుకు స్వయంగా కేంద్ర మంత్రుల హోదాలో కె.చంద్రశేఖర్‌రావు, ఆలే నరేంద్ర, శిబు సోరెన్‌లు భద్రాచలం వచ్చి పోలవరానికి వ్యతిరేకంగా భద్రాచలం జూనియర్‌ కళాశాలలో బహిరంగ సభలో ప్రసంగించింది యాది లేకపోవడం నిజంగా బాధాకరమే.

    ఏ విధంగా ప్రకటించారు?

    2014 జూన్‌ రెండున స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం 2015లో, 2016లో భద్రాద్రిని సందర్శించినప్పుడు మరి సీఎం కేసీఆర్‌ భద్రాద్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రూ.100 కోట్లు కేటాయిస్తామని ఏ విధంగా ప్రకటించారో వారికే తెలియాలి. మరి ఆ సమయంలో మరిచినా మళ్లీ ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి, చినజీయర్‌స్వామి, మంత్రులను భద్రాద్రికి పంపి క్షేత్రస్థాయి సర్వేలు ఆలయ అభివృద్ది మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన స్వయంగా మంత్రులు, సీఎం మాస్టర్‌ ప్లాన్‌ పరిశీలన ఎందుకు చేశారో వారికే తెలియాలి. ఒక వేళ భద్రాద్రి ఆలయ అభివృద్ధికి పోలవరమే అడ్డంకి అయితే అదే విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు. భద్రాద్రి వరద కరకట్టను సురక్షితం చేసి ఎత్తు పెంచి పొడిగిస్తామని సీఎం కేసీఆర్‌ 2022 జూలై 17న భద్రాచలం పర్యటన సమయంలో చెప్పడం వాస్తవం కాదా. 32 ఏళ్ల నాటి వరదలు గత ఏడాది రావడంతో భద్రాద్రి రామాలయ పరిసరాలు, ఇతర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ క్రమంలో భవిష్యత్‌లో ఎటువంటి ముంపు సమస్య రాకుండా చర్యలు చేపడతామని ఇచ్చిన భరోసా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది.

    సాకారం కాని భద్రాద్రి పాలక మండలి

    స్వరాష్ట్రం ఆవిర్భవించి ఎనిమిదేళ్లు కావస్తున్నా దక్షిణ అయోధ్యగా ప్రసిద్దిగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంకు కనీసం పాలక మండలి రూపుదిద్దుకోకపోవడం పట్ల సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2010 నవంబరు 26న చివరి పాలక మండలి కొలువుదీరగా 2012 నవంబరు 25న కాల పరిమితి ముగిసింది. అనంతరం 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు భద్రాద్రి దేవస్థానానికి పాలక మండలి ఏర్పాటు కాకపోవడంతో అధికార పార్టీ ఆశావాహులు సైతం నిరాశకు లోనయ్యారు.

    ఉత్సవాలకు రూ.2 కోట్ల ప్రతిపాదన నేటికీ అమలుకాలేదు:

    ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011లో అప్పటి పాలక మండలి భద్రాద్రి శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు రూ.2 కోట్లు నిధులు ప్రతి ఏటా కేటాయించాలని కోరుతూ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఆనాటి ప్రభుత్వానికి పంపినా అమలుకు నోచుకోలేదు. అనంతరం స్వ రాష్ట్రంలో సైతం ఈ ప్రతిపాదన అమలుకు నోచుకోవడంలేదు.

    ఆదాయం గణనీయంగా తగ్గింది

    రామయ్య భూముల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది అనేది దేవస్థానం అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం. భద్రాద్రి దేవస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 1,350.68 ఎకరాల భూమి ఉంది. ఇందులో ఏపీలోని అల్లూరి జిల్లా యటపాక మండలం పురుషోత్తపట్నంలో 890 ఎకరాల భూమి ఉంది. ఇందులో 650 ఎకరా లు ఆక్రమణదారుల చేతుల్లోనే ఉందని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఏటా దేవస్థానం భూముల ద్వారా దేవస్థానానికి 35 నుంచి 40 లక్షల ఆదాయం సమకూరాల్సి ఉందని అయితే రూ.15 నుంచి రూ.20 లక్షలు మాత్రమే వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా గత నాలుగేళ్లుగా పురుషోత్తపట్నంలో ఆక్రమణలు, గొడవలు చోటు చేసుకోవడంతో భూమిని వాడుకొని నష్ట పరిచినందుకుగాను నష్ట పరిహరంగా (ఏజెన్సీ ప్రాంతం కావడంతో శిస్తు వసూలు సాధ్యం కాదు) రావాల్సిన బకాయిలు రావడం లేదని సమాచారం.