ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హుజురాబాద్ నియోజకవర్గ నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. టీఆర్ఎస్ ను నమ్ముకున్న వారిని ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ గా వకులాభరణం కృష్ణ మోహన్ కు అవకాశం కల్పించారు. దీంతో ఆశావహులందరికి పదవులు ఎరగా వేస్తున్నారు.
హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలు చూస్తున్న రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీ నేతలకు మరిన్ని పదవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతల పదవుల పంపిణీలో నాయకుల పంట పండుతోంది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు వారికి తగిన గుర్తింపు ఇస్తున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు బీఎస్పీ కూడా తన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హుజురాబాద్ లో పోటీకి దించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల భవితవ్యంపై భయపడుతున్నాయి. ప్రవీణ్ కుమార్ రాకతో రాజకీయ సమీకరణలు మారుతాయని చెబుతున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యవహారంపై పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది. విజయావకాశాలు ఎలా ఉంటాయోనని ఆసక్తి కలుగుతోంది.