కరోనా కల్లోలం అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. చాలా మందికి ఉపాధి, ఉద్యోగం లేకుండా చేసింది. అందరినీ రోడ్డున పడేసింది. కరోనా లాక్ డౌన్ పైసలు లేక ఎంత మంది అవస్థలు పడ్డారో మనం చూశాం.
అయితే అన్ని రంగాలు కోలుకున్నా.. విద్యావ్యవస్థ మాత్రం ఇంకా పట్టాలు ఎక్కలేదు. విద్యార్థులు చదువులకు నోచుకోవడం లేదు. కరోనా తీవ్రత రెండో వేవ్ రావడంతో వారు స్కూళ్లకు వెళ్లడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలలను నమ్ముకొని ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయులు ఏడాదిగా జీతాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారు.
కరోనాతో రాష్ట్రంలోని విద్యాలయాలు మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు టీచర్లకు జీతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరైతే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ప్రైవేటు టీచర్లకు భరోసా కల్పించేందుకు గురువారం కీలక ప్రకటన చేశారు.
గుర్తింపు పొందిన ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి రూ.2వేల నగదు ప్రోత్సాహకంతోపాటు 25 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయంతో తెలంగాణలోని 1.45 లక్షల మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి లబ్ధి చేకూరనుందని ప్రకటించారు. బ్యాంక్ అకౌంట్, ఇతర వివరాలతో కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.