కాంగ్రెస్ తో కేసీఆర్ గేమ్.. రేవంత్ ఏం చేస్తారు?

టీఆర్ఎస్ అధినేత‌గా, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌ రాజ‌కీయ వ్యూహాల‌కు ఎంత‌టి ప‌దును ఉంటుందో పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అంద‌రికీ తెలుసు. రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో నీతి, నిజాయితీల‌క‌న్నా.. వ్యూహాలే విజ‌యాన్ని సాధించి పెడతాయి. అయితే.. అంద‌రూ ప‌థ‌కాలు వేస్తూనే ఉంటారు. కానీ.. స‌రైన స‌మ‌యానికి స‌రైన నిర్ణ‌యం తీసుకున్న వారే అంతిమంగా విజేత‌ల‌వుతారు. ఇలాంటి వ్యూహాల‌తోనే తెలంగాణ సాధ‌న‌లో అనుస‌రించారు. ఇలాంటి వ్యూహాల‌తోనే వ‌రుస‌గా రెండు సార్లు అధికారం సాధించారు. అయితే.. రాష్ట్రంలో గ‌తంలో ఉన్నంత అదును ఇప్పుడు కేసీఆర్ […]

Written By: Bhaskar, Updated On : August 10, 2021 3:15 pm
Follow us on

టీఆర్ఎస్ అధినేత‌గా, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్‌ రాజ‌కీయ వ్యూహాల‌కు ఎంత‌టి ప‌దును ఉంటుందో పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అంద‌రికీ తెలుసు. రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో నీతి, నిజాయితీల‌క‌న్నా.. వ్యూహాలే విజ‌యాన్ని సాధించి పెడతాయి. అయితే.. అంద‌రూ ప‌థ‌కాలు వేస్తూనే ఉంటారు. కానీ.. స‌రైన స‌మ‌యానికి స‌రైన నిర్ణ‌యం తీసుకున్న వారే అంతిమంగా విజేత‌ల‌వుతారు. ఇలాంటి వ్యూహాల‌తోనే తెలంగాణ సాధ‌న‌లో అనుస‌రించారు. ఇలాంటి వ్యూహాల‌తోనే వ‌రుస‌గా రెండు సార్లు అధికారం సాధించారు.

అయితే.. రాష్ట్రంలో గ‌తంలో ఉన్నంత అదును ఇప్పుడు కేసీఆర్ కు లేద‌నే చెప్పాలి. ఓవైపు బీజేపీ దూసుకురావ‌డం.. ఇప్పుడు రేవంత్ పీసీసీ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం వంటి కార‌ణాల‌తో గ‌ట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. దీంతో.. కేసీఆర్ వ్యూహం మార్చారు. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో బీజేపీ మీద ప్ర‌యోగించిన ప‌థ‌కాన్నే.. ఇప్పుడు కాంగ్రెస్ మీద‌కు సైతం వ‌దులుతున్నారు గుల‌బీ ద‌ళ‌ప‌తి. మ‌రి, ఇది ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌నే చ‌ర్చ మొద‌లైంది.

జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు రాష్ట్రంలో బీజేపీ జోరు ఓ రేంజ్ లో ఉంది. ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా అధికార పార్టీతో ఫైట్ చేసింది. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో సీట్లు గెలుచుకోవ‌డంతో.. బీజేపీ జోరు రెట్టింప‌య్యింది. ఇక‌, రాష్ట్రంలో అధికారానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామ‌ని నేత‌లు ప్ర‌చారం చేసుకున్నారు. జ‌నాల్లో ప‌రిస్థితి కూడా అదేవిధంగా క‌నిపించింది. స‌రిగ్గా అప్పుడే త‌న‌దైన వ్యూహం అమ‌లు చేశారు కేసీఆర్‌. ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని, అమిత్షా మొద‌లు కాషాయ పెద్ద‌లంద‌రినీ క‌లిశారు. మాట్లాడివ‌చ్చారు. ఏం మాట్లాడార‌న్న‌ది రెండు పార్టీలూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు.

సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ జోరు చాలా వ‌ర‌కు త‌గ్గింది. బీజేపీతో టీఆర్ ఎస్ దోస్తీ కట్టింది, లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది అనే వాయిస్ జ‌నాల్లోకి కొంత మేర వెళ్లింది కూడా. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు వంటి విష‌యంలో ప‌రోక్షంగా మ‌ద్ద‌తు తెలుపుతూ.. క‌మ‌లం, గులాబీ నేత‌లు దోస్తులే అనే ప్ర‌చారాన్ని బ‌య‌ట‌కు తెచ్చారు. ఆ విధంగా.. ఢిల్లీలో స్విచ్ వేస్తే.. రాష్ట్రంలో బీజేపీకి చెక్ ప‌డింద‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. బీజేపీ-టీఆర్ఎస్ బ‌ద్ద శ‌త్రువులు అనే ప్ర‌చారం రాకుండా కేసీఆర్ జాగ్ర‌త్త ప‌డ్డార‌ని, త‌ద్వారా బీజేపీ ఆవేషాన్ని నీరుగార్చార‌నే ప్ర‌చారని, ఆ విధంగా.. కేసీఆర్ వేసిన‌ ప్లాన్ స‌క్సెస్ అయ్యింద‌న్న అభిప్రాయం ఉంది.

ఇప్పుడు స‌రిగ్గా.. కాంగ్రెస్ మీద కూడా ఇదే ప్లాన్ ప్ర‌యోగిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న పెగాస‌స్ అంశం మీద ప్ర‌భుత్వంపై దాడి చేసేందుకు విప‌క్షాల‌న్నీ ఒక్క‌ట‌య్యాయి. రాహుల్ ఇచ్చిన విందుకు మొత్తం 14 పార్టీలు హాజ‌ర‌య్యాయి. బీజేపీపై దాడికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించాయి. కానీ.. అందులో టీఆర్ ఎస్ పార్టీ లేదు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ప్ర‌స్తావించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై దండెత్తారు. బీజేపీ-టీఆర్ఎస్ ఒక‌టేన‌ని, దానికి సాక్ష్యం ఇదేన‌ని అన్నారు. విప‌క్షాల‌ను ఏకం చేసిన‌ రాహుల్ మీటింగ్ కు హాజ‌రు కాక‌పోవ‌డంలో ఆంత‌ర్యం ఇదేన‌ని అన్నారు. త‌ద్వారా.. ఆ రెండు పార్టీల‌ను కార్న‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు రేవంత్ రెడ్డి.

ఇప్పుడు చూస్తే.. ఢిల్లీలో కాంగ్రెస్ నేత క‌పిల్ సిబ‌ల్ నిర్వ‌హించిన విందు స‌మావేశానికి గులాబీ పార్టీ హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. వ‌చ్చే ఏడాది బీజేపీని ఓడించ‌డం ఎలా అన్న‌దే ఈ మీటింగ్ ఎజెండా! అంటే.. గులాబీ పార్టీ ఈ మీటింగ్ కు హాజ‌ర‌వ‌డం ద్వారా.. తాను కాంగ్రెస్ తో దోస్తీ క‌డుతున్న‌ట్టు ప‌రోక్ష సంకేతాలిచ్చిన‌ట్టైంది. అంటే.. బండి సంజ‌య్‌ మీద ప్ర‌యోగించిన ప‌థ‌కాన్నే.. రేవంత్ మీద కూడా ప్ర‌యోగిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. త‌ద్వారా కాంగ్రెస్ శ్రేణుల‌ను గంద‌ర‌గోళ‌ప‌రిచే ఎత్తు వేశార‌ని, జనాల్లోనూ క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేస్తున్నార‌నే బ‌ల‌మైన అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, దీన్ని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు అన్న‌ది చూడాలి.