కొడుకు కేటీఆర్ కు తన రాజకీయ వారసత్వం అప్పచెప్పడం కోసం మొదటి నుండి పార్టీలో తనతో పాటు ఉంటూ వచ్చిన మేనల్లుడు టి హరీష్ రావును దూరంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అందరికి తెలిసినవే.
అయితే హరీష్ రావు మౌనంగా ఉంటున్నప్పటికీ ఆయనను చూసి కేసీఆర్ భయపడుతున్నారా అనే అనుమానాలు పలు వర్గాలలో కలుగుతున్నాయి. అందుకనే కొంతకాలం మంత్రిపదవికి దూరంగా ఉంచినా, తిరిగి పిలిచి మరీ మంత్రివర్గంలో చేర్చుకోవలసి వచ్చినదని చెబుతున్నారు. అయితే మంత్రి పదవి అయితే ఇచ్చారు గాని ఆ శాఖలో అయన చేయవలసిన పనులు ఏవీ లేకుండా చేయడం తెలిసిందే.
అందుకనే ఈ మధ్య హరీష్ రావు హైదరాబాద్ లో ఎక్కువగా కనపడకుండా ఎక్కువకాలం సొంత జిల్లాలోనే గడుపుతున్నారు. నిత్యం హరీష్ రావుపై విరుచుకు పడే కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి అక్కడి హరీష్ రావు ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజల కోసం కాకుండా హరీష్ రావు కోసం మాత్రమే పనిచేస్తున్నారని అంటూ విరుచుకు పడ్డారు.
హరీష్ రావు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు త్వరలో ఒక లేఖ వ్రాస్తానని చెపుకోచ్చారు.
అయితే సంగారెడ్డిని హరీష్ రావు బాగా అభివృద్ధి చేసారని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ హరీష్ రావు పుణ్యమాని 2017 నుంచి సంగారెడ్డి నియోజవర్గంలో నీటి కష్టాలు మొదలు అయ్యాయని విరుచుకు పడ్డారు. గడిచిన మూడేళ్ళ నుంచి సంగారెడ్డి జిల్లా ప్రజలు నీళ్ల కోసం ఆకాశం వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
హరీష్అ రావు నీటి దొంగ అని అంటూ మంజీరా-సింగూరు డ్యామ్ నీళ్లను సంగారెడ్డి జిల్లాకు చెందకుండా, సంగారెడ్డి ప్రజల బతుకులతో చెలగాటం ఆడారని ఆరోపించారు. నారాయణ ఖేడ్- జోగిపేట్-పఠాన్ చేరు-జహీరాబాద్ ఎమ్మెల్యేలు అందరూ టీఆరెఎస్ కావడంతో సంగారెడ్డిలో నీళ్ల కరువు వచ్చిందని ధ్వజమెత్తారు.