KCR Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా దానికో అర్థం, పరమార్థం ఉంటుందంటారు. అంత ఈజీగా ఆయన అడుగు ముందుకు వేయరు. దాని వెనుకో ఏదో తతంగం ఉండనే ఉంటుంది. కేసీఆర్ మౌనంగా ఉన్నా అవతల ఎవరిదో కొంప కొల్లేరు అవుతుందన్నట్టే లెక్క. కేసీఆర్ ను మించిన రాజకీయ చాణక్యుడు లేడని అంటుంటారు. సమస్యలను ఎలా డైవర్ట్ చేయాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటారు.
రెండు రోజుల క్రితం వరకూ తెలంగాణలో చర్చ అంతా ‘ఢిల్లీలో బయటపడ్డ లిక్కర్ స్కాం’ గురించే. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఉందని స్వయంగా బీజేపీ ఎంపీలు ఇద్దరూ ఆరోపించడంతో ఇది జాతీయ వార్త అయ్యింది. తెలంగాణలో బీజేపీ శ్రేణులు ఆమె ఇంటి ఎదుట ఆందోళన చేయడంతో పెంటపెంట అయ్యింది.
అయితే ఇంతటి సంక్షోభం వేళ ఇటు కేసీఆర్,కేటీఆర్ సైలెంట్ అయ్యారు. కవిత బయటకొచ్చి ఖండించింది. మరీ దీన్ని జనాల్లో నానకుండా ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించిన కేసీఆర్ వెంటనే కార్యరంగంలోకి దూకాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇన్నాళ్లు ప్రశాంతంగా సాగిన ‘బండి సంజయ్’ పాదయాత్రకు బ్రేక్ వేసిన ఆయనను అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. ఆయనను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. ఈ అరెస్ట్ పై బీజేపీ కార్యకర్తలు భగ్గుమని ఆందోళన చేశారు. ఇదో పెద్ద ఎపిసోడ్ అయ్యి బండి సంజయ్ అరెస్ట్ వార్త కేంద్రం వరకూ చేరింది.దీంతో ‘కవిత లిక్కర్ స్కాం’ మరుగన పడింది.
కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ విషయం తెలియక పాపం బీజేపీ కార్యకర్తలు నేతలు కొట్టుకు చస్తున్నారు.కానీ కేసీఆర్ మాత్రం హ్యాపీగా ఈ విషయాన్ని డైవర్ట్ చేశారని టీఆర్ఎస్ శ్రేణులు ఊపిరిపీల్చుకుంటున్నాయి.
ఇదే విషయాన్ని కనిపెట్టిన బండి సంజయ్ ఇప్పుడు తేరుకొని బావురు మంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే తనను అరెస్ట్ చేసినట్లు బండి సంజయ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. పాదయాత్రను ఆపనంటున్నారు. మరి కేసీఆర్ డైవర్ట్ పాలిటిక్స్ తెలిసి కూడా ఆయన బుట్టలో పడిపోవడం ఏంటి ‘బండి’ అని పలువురు హితవు పలుకుతున్నారు.
కేసీఆర్ ఆవళించకముందే పేగులు లెక్కబెట్టే రకం. ఆయన రాజకీయాన్ని పసిగట్టి సర్దుకోవాల్సిన బీజేపీ ఆయన గేమ్ లో అడ్డంగా బుక్కవడమే ఇక్కడ కమలం పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేసే అంశం. ఇప్పటికైనా తేరుకోకుంటే ఇలాంటి అందివచ్చిన అవకాశాలు ఎన్నో జారవిడుకుంటారు తస్మాత్ జాగ్రత్త మరీ..