KCR Dharna Chouwk: ‘వెనుకటికి నైజాం రాజ్యం ఉండేది. ఆ ముస్లిం రాజ్యంలో రజాకర్లు అనే ప్రైవేటు సైన్యం నిరసనలు, ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేసేవారు. అసలు ధర్నా చౌక్ లపైనే నిషేధం విధించేవారు. అక్కడ నిరసన తెలిపిన ఆడ, మగపై దారుణంగా ప్రవర్తించేవారు’.. కానీ ఇది ఒకప్పటి స్వాతంత్య్రానికి పూర్వం సంగతి.. స్వాతంత్ర్యం వచ్చాక స్వేచ్ఛకు, సమానత్వానికి.. గళం వినిపించేందుకు మనకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కలిపించింది.
దేశంలో ఎవ్వరైనా గళం వినిపించవచ్చు. తన అసమ్మతిని తెలియజేయవచ్చు. ధర్నాలు, ఆందోళనలు చేయడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. కానీ మన కేసీఆర్ సార్ వచ్చాక ఆందోళనలే చేయకుండా ఉమ్మడి ఏపీలోనే ప్రధాన ఆందోళనలకు అడ్డా అయిన హైదరాబాద్ ఇందిరాపార్క్ నే ఎత్తేశారు.
ఇందిరాపార్క్. దీనికి ఉమ్మడి ఏపీలో గొప్ప చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక విశాలమైన ఇందిరాపార్క్ వద్ద ఉన్న రహదారిపై ధర్నా చౌక్ ఉండేది. అక్కడ ఆందోళనలు చేసి సచివాలయానికి ఆందోళనకారులు ర్యాలీగా వచ్చేవారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, వైఎస్ వరకూ అక్కడ ఆందోళనలు చేసిన వారే. అంతటి ప్రతిష్టాత్మక ధర్నా చౌక్ ను కేసీఆర్ రాగానే ఆందోళనలకు ఆస్కారం లేదని ఎత్తిపడేశారు.
కానీ ప్రజాస్వామ్యవాదులు ఊరుకుంటారా? కోర్టుకెక్కారు. కేసీఆర్ సర్కార్ దమన చర్యపై ఖండించారు. కోర్టులో కేసీఆర్ సర్కార్ ను తప్పు పట్టి ప్రతి మనిషికి ఆందోళన చేసే హక్కు ఉందని.. దాన్ని ఎవరూ హరించలేదని గట్టి పెట్టేసింది.
అలా ధర్నా చౌక్ ను కోర్టు ఆర్డర్ ద్వారా పునరుద్దరించారు. ఆ తర్వాత కాలచక్రం గిర్రున తిరుగుతుంది. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావడానికి ఎంతో సమయం పట్టదు. ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ కు ఇప్పుడు అదే దిక్కైంది?. అక్కడే ధర్నాకు కేసీఆర్ వచ్చి కూర్చోవడం అంటే అంతకంటే అతిశయోక్తి వింత మరొకటి లేదు.
అసలు ధర్నాలే చేయవద్దని ఆ చౌక్ ను ఎత్తేసిన పెద్దమనిషిని అదే చౌక్ వద్ద కేంద్రంపై బీజేపీపై పోరాడడానికి రావడం.. అక్కడే ధర్నాకు కూర్చోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తనదాకా వస్తే కానీ పరిస్థితి కేసీఆర్ కు అర్థం కాదా? ధర్నా చౌక్ విలువ తెలియలేదా? అని పలువురు సెటైర్లు పేలుస్తున్నారు. ఇది కదా చిత్రం అని అందరూ చర్చించుకుంటున్నారు.
-కేసీఆర్ మహాధర్నాపై ‘రామ్ టాక్’ విశ్లేషణ వీడియోను కింద చూడొచ్చు..