KCR Gajwel : కంచుకోటలు కొన్నే ఉంటాయి. అక్కడి నుంచి నేతలు ప్రతీసారి పోటీచేసి గెలుస్తుంటారు. కేసీఆర్ కు సిద్ధిపేటలాగా.. చంద్రబాబుకు కుప్పం లాగా అక్కడ ఎవరు పోటీచేసినా గెలవలేరు. కానీ వైసీపీ ఇటీవల కుప్పంలో టీడీపీని చావుదెబ్బ తీసి స్థానిక సంస్థలను గెలిచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో బాబును కొట్టేందుకు రెడీ అవుతోంది. అయితే కేసీఆర్ కంచుకోట సిద్దిపేటను అల్లుడు హరీష్ కు వదిలేసి పోయిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీచేసి గెలిచాడు. తొలి సారి కేవలం 20వేల ఓట్లతో టఫ్ ఫైట్ ను ఎదుర్కొని బయటపడ్డాడు. రెండోసారి ప్రతిపక్ష నేతలందరినీ టీఆర్ఎస్ లోకి ఫర్వాలేదన్నట్టు గెలిచాడు.
నిజామాబాద్ అత్తగారిల్లు అని పోటీచేసిన కేసీఆర్ కూతురును ఒకసారి గెలిపించి రెండోసారి ఓడించారు ప్రజలు. సెంటిమెంట్ కు తావులేదని నిరూపించారు. కేసీఆర్ కూతురు అయినా సరే తమ సమస్యలు తీర్చకపోతే ఓడిస్తామని చూపించారు. ఈ క్రమంలోనే గజ్వేల్ ను తన నియోజకవర్గంగా మార్చుకున్న కేసీఆర్ సైతం వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అపశృతులకు తావులేకుండా తన సేఫ్ సైడ్ కు వెళ్లాలని డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కానీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం అంత ఈజీ కాదంటున్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమేనని దాదాపు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మల్లన్న సాగర్ నిర్వాసితులు ఆ గజ్వేల్ నియోజకవర్గంలో బాధితులుగా మారి ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి లాంటి వారు గజ్వేల్ లో నిర్వహించిన నిరసన సభలకు మంచి స్పందన వచ్చింది. ఇక సిద్దిపేటలో గజ్వేల్ కేసీఆర్ కు కంచుకోట కాదు.. ప్రజల్లోనూ కేసీఆర్ పట్ల ఆ ‘మన’ అనే సెంటిమెంట్ లేదు. ఒకసారి 20వేల మెజార్టీ మాత్రమే ఇచ్చిన గజ్వేల్ ఓటర్లు.. పోయినసారి 58వేల మెజార్టీ ఇచ్చారు. సీఎంగా పోటీచేసినా కూడా బోటా బోటీ మెజార్టీనే గజ్వేల్ ప్రజలు కట్టబెట్టారు.
హైదరాబాద్ శివారుగా ఉన్న ఈ నియోజకవర్గంలో తెలంగాణ సెంటిమెంట్ తక్కువే. పైగా గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. కేసీఆర్ ఫాంహౌస్ ఇక్కడ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీచేశారు. అభివృద్ధి కోణంలో ప్రజలూ ఓటేశారు. కానీ ఇప్పుడు కేసీఆర్ పై ఆ నియోజకవర్గంలోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోందని కొందరు సర్వే కారులు చేసి మరీ సోషల్ మీడియాలో షేర్లు చేస్తున్నారు. ఇక కేసీఆర్ అధికారంలో ఉన్న తన ఇంటెలిజెన్స్ సహా అన్నింటిని క్రోడీకరించుకున్నట్టు ఉన్నాడు.
అందుకే తాజాగా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారట.. కారణం ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకతనేనని.. అందుకే ఈ స్థానంలో పోటీచేయడం సాహసమేనని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు మీడియాలో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కేసీఆర్ నిజంగానే గజ్వేల్ వదిలేస్తాడా? వేరే నియోజకవర్గం చూసుకుంటాడా? చేస్తే మళ్లీ సిద్దిపేటకు షిఫ్ట్ అవుతాడా? అన్నది వేచిచూడాలి.